Rajasthan Congress: కర్నాటక ఉత్సాహం… రాజస్థాన్‌లో ఆవిరి..! పాపం కాంగ్రెస్..!!

సీఎం అశోక్ గెహ్లాట్, మాజీ పీసీసీ చీఫ్ సచిన్ పైలట్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. దీంతో వీళ్లద్దరి మధ్య సయోధ్య కుదర్చలేక కాంగ్రెస్ అధిష్టానం చేతులెత్తేస్తోంది. మరికొన్ని నెలల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాజస్థాన్లో నెలకొన్న ఈ సంక్షోభం ఎలాంటి మలుపులు తీసుకుంటుందోననే భయం పార్టీలో కనిపిస్తోంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: May 16, 2023 | 05:30 PMLast Updated on: May 16, 2023 | 5:30 PM

No End To Troubles For Congress In Rajasthan Sachin Pilot Gives Ultimatum Of Andolan

కర్నాటక ఎన్నికల్లో గెలిచామన్న ఆనందం కాంగ్రెస్ పార్టీకి ఎంతోకాలం ఉండేటట్లు కనిపించట్లేదు. ఎందుకంటే రాజస్థాన్ రూపంలో ఆ పార్టీకి సంక్షోభం ముంచుకొస్తోంది. అక్కడ కూడా ఇద్దరు నేతల మధ్య రగడ.. పార్టీని బజారుకీడుస్తోంది. సీఎం అశోక్ గెహ్లాట్, మాజీ పీసీసీ చీఫ్ సచిన్ పైలట్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. దీంతో వీళ్లద్దరి మధ్య సయోధ్య కుదర్చలేక కాంగ్రెస్ అధిష్టానం చేతులెత్తేస్తోంది. మరికొన్ని నెలల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాజస్థాన్లో నెలకొన్న ఈ సంక్షోభం ఎలాంటి మలుపులు తీసుకుంటుందోననే భయం పార్టీలో కనిపిస్తోంది.

గత ఎన్నికల్లో బీజేపీని ఓడించి కాంగ్రెస్ పార్టీ సీఎం పీఠాన్ని దక్కించుకుంది. ఇప్పుడు కర్నాటకలో లాగే అప్పుడు కూడా పీసీసీ చీఫ్ కు, సీనియర్ నేతకు మధ్య వార్ నడిచింది. అప్పుడు పీసీసీ చీఫ్ గా ఉన్న సచిన్ పైలట్ నేతృత్వంలో పార్టీ విజయం సాధించింది. అయితే సీనియర్ నేత అశోక్ గెహ్లాట్ తాను కూడా సీఎం రేసులో ఉన్నానని చెప్పారు. దీంతో ఇద్దరిలో అశోక్ గెహ్లాట్ వైపే అధిష్టానం మొగ్గు చూపింది. అప్పటి నుంచి సచిన్ పైలట్ అయిష్టంగానే పార్టీలో కొనసాగుతూ వచ్చారు. మళ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ఇంకా కామ్ గా ఉంటే బాగుండదనుకున్నారో ఏమో రచ్చ రచ్చ చేస్తున్నారు.

గత బీజేపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిపై విచారణ జరిపిస్తామని మేనిఫెస్టోలోనే ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ. అయితే గెహ్లాట్ సీఎం అయి నాలుగేళ్లు దాటినా ఇప్పటివరకూ విచారణకు ఆదేశించలేదు. ఇది సచిన్ పైలట్ కు కోపం తెప్పిస్తోంది. వసుంధర రాజే ప్రభుత్వ అవినీతిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. ధర్నాలు, నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. అధిష్టానం మాటను ఏమాత్రం ఖాతరు చేయకుండా తన పని తాను చేసుకుపోతున్నారు. అంతేకాక తాను పార్టీకి విరుద్ధంగా పని చేయట్లేదని, బీజేపీపై పోరాడుతున్నానని చెప్తున్నారు.

సచిన్ పైలట్ ను బీజేపేయే ఆడిస్తోందని గెహ్లట్ వర్గీయులు ఆరోపిస్తున్నారు. తాను బీజేపీ మనిషినైతే ఆ పార్టీ హయాంలో జరిగిన అవినీతిపై విచారణకు ఎందుకు డిమాండ్ చేస్తానని పైలట్ ప్రశ్నిస్తున్నారు. వీళ్లిద్దరి మధ్య ఆధిపత్యపోరు పార్టీ పరువును బజారుకీడుస్తోంది. అయితే వచ్చే ఎన్నికల నాటికి సచిన్ పైలట్ పార్టీలో ఉండకపోవచ్చనే ప్రచారం జోరుగా సాగుతోంది. బీజేపీలో చేరడమో, లేకుంటే సొంత పార్టీ పెట్టుకోవడమో ఖాయమని ఆయన అనుచరులు చెప్తున్నారు. అయితే సొంత పార్టీ పెట్టి దాన్ని నడిపించడం అంత ఆషామాషీ కాదు. బీజేపీలో చేరితో కాస్తోకూస్తో మేలు జరగొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే వీళ్లిద్దరి తీరుతో కాంగ్రెస్ పార్టీ ఈసారి రాజస్థాన్ లో ఓడిపోవడం ఖాయమని భావిస్తున్నారు.