12లక్షల వరకు నో ఇన్‌కం ట్యాక్స్..‌ వెనక మతలబు ఇదే..

12లక్షల వరకు నో ట్యాక్స్... ఇదీ బడ్జెట్‌ స్పీచ్‌లో నిర్మలమ్మ ఇచ్చిన హామీ. నిజంగా 12లక్షల వరకు ఆదాయ పన్నులేదా...? ఇందులో ఏమైనా మతలబు ఉందా...? ఓవైపు 12లక్షల వరకు రిలీఫ్ అంటూనే 4లక్షల పైబడిన ఆదాయానికి పన్ను ఉన్నట్లు ట్యాక్స్‌ శ్లాబులు ఎందుకు ప్రకటించారు..?

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 3, 2025 | 10:14 AMLast Updated on: Feb 03, 2025 | 10:14 AM

No Income Tax Up To 12 Lakhs This Is The Logic Behind It

12లక్షల వరకు నో ట్యాక్స్… ఇదీ బడ్జెట్‌ స్పీచ్‌లో నిర్మలమ్మ ఇచ్చిన హామీ. నిజంగా 12లక్షల వరకు ఆదాయ పన్నులేదా…? ఇందులో ఏమైనా మతలబు ఉందా…? ఓవైపు 12లక్షల వరకు రిలీఫ్ అంటూనే 4లక్షల పైబడిన ఆదాయానికి పన్ను ఉన్నట్లు ట్యాక్స్‌ శ్లాబులు ఎందుకు ప్రకటించారు..? అసలు పన్నును ఎలా లెక్కిస్తారు…? మరి 12లక్షలపైన ఆదాయం ఉంటే పన్ను ఆపై మొత్తానికి కట్టాలా లేక ఆదాయం అంతటికీ కట్టాలా…?

బడ్జెట్‌లో ఆదాయపన్నుపై కేంద్రం తీసుకున్న నిర్ణయం ఎవరూ ఊహించనిదే. ఇంతకాలం వేతన జీవులు ఎన్నిసార్లు వేడుకున్నా పట్టించుకోని నిర్మలమ్మ ఇలా ఒకేసారి కరుణించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. మధ్యతరగతిని టార్గెట్ చేసిన కేంద్రం చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించింది. కొత్త ఆదాయపన్ను విధానంలో ట్యాక్స్‌ ఫైల్‌ చేసే వేతన జీవులకు మాత్రమే అది కూడా 12లక్షల ఆదాయం వరకు మాత్రమే ఊరట ఇచ్చింది. అంటే మీకు ఏడాదికి 12లక్షలవరకు జీతం వస్తుంటే దానిపై ఎలాంటి పన్ను ఉండదు. స్టాండర్డ్‌ డిడక్షన్ 75వేలు కూడా కలుపుకుంటే 12లక్షల 75వేల వరకు నో ట్యాక్స్.. 12 లక్షల వరకు ఆదాయం ఉన్న వారికి కొత్త పన్ను విధానంలో ఏకంగా రూ. 80 వేల వరకు ఆదా కానుంది.

కొత్త పన్ను చెల్లింపు విధానంలో ఆదాయ పన్ను శ్లాబులను కూడా సవరిస్తున్నట్లు ప్రకటించారు నిర్మలమ్మ. ఇప్పటివరకు రూ. 3 లక్షల వరకు ఆదాయంపై కనీస పన్ను మినహాయింపు పరిమితి ఉండగా.. ఇప్పుడు దానిని రూ. 4 లక్షలకు పెంచారు. ఇక కొత్త శ్లాబ్ ప్రకారం 4-8 లక్షల వరకు ఆదాయంపై 5 శాతం పన్ను పడుతుంది. 8 లక్షల నుంచి 12 లక్షల వరకు 10 శాతం, 12 లక్షల నుంచి 16 లక్షల వరకు ఆదాయంపై 15 శాతం, 16 లక్షల నుంచి 20 లక్షల వరకు 20 శాతం, 20 లక్షల నుంచి 24 లక్షల వరకు 25 శాతం ట్యాక్స్ వసూలు చేస్తారు. ఇక 24 లక్షల రూపాయలపైన ఆదాయంపై 30 ట్యాక్స్ పడుతుంది. ఓవైపు 12లక్షల వరకు పన్ను లేదంటూనే మరోవైపు ఈ శ్లాబులేంటన్న దానిపై గందరగోళం నెలకొంది. ఆ కన్ఫ్యూజన్‌ను క్లియర్‌ చేస్తోంది మీ డయల్‌ న్యూస్.

నిర్మలా సీతారామన్‌ మనకు ఈజీగా అర్థం కావడానికి 12లక్షల వరకు పన్ను లేదని చెప్పారు కానీ పన్ను ఉంది. కానీ దానికి రిబేట్ ఇస్తారు. మీకు ఏడాదికి ఆరు లక్షల జీతం వస్తే మీరు 5శాతం పన్ను పరిధిలోకి వస్తారు. ఆ ప్రకారం మొదటి నాలుగు లక్షలకు రిలీఫ్ ఉంటుంది. ఆ తర్వాత రెండు లక్షలకు 5శాతం చొప్పున పదివేలు పన్ను పడుతుంది. కానీ దానికి కేంద్రం రిబేట్ ఇస్తుంది. అంటే రూపాయి కూడా కట్టాల్సిన పనిలేదు. అలాగే ఏడాదికి 8లక్షల ఆదాయం ఉన్నవారిని తీసుకుంటే కొత్త శ్లాబుల ప్రకారం 20వేలు కట్టాలి. కానీ ఆ మొత్తాన్ని కూడా కేంద్రం రిబేట్ ఇస్తుంది. అంటే రూపాయి కూడా పన్ను చెల్లించాల్సిన పనిలేదు. అలాగే 9 లక్షల ఆదాయం ఉన్నవారు కూడా కొత్త శ్లాబ్ ప్రకారం వారికి 30వేలు పన్ను పడుతుంది.

కానీ ఆ 30వేలు రిబేట్ ఇవ్వడంతో పన్నుభారం రూపాయి కూడా లేనట్లే…అలాగే రూ. 10 లక్షలు ఆదాయం ఉన్నవారు కొత్త శ్లాబ్‌ ప్రకారం 40వేలు కట్టాలి. ఆ మొత్తాన్ని రాయితీగా ఇస్తారు. ఇలాగే 11, 12లక్షల ఆదాయం ఉన్నవారికి కూడా ఊరట దక్కింది. ఆపైన ఆదాయం ఉన్నవారికి ఊరట కాస్త స్వల్పంగానే దక్కింది. 16లక్షల ఆదాయం ఉన్నవారు ఇప్పటివరకు లక్షా 70వేలు కడుతుండగా వారు ఇకపై లక్షా 20వేలు కడితే సరిపోతుంది. అంటే వారికి 50వేల వరకు ఊరట దక్కుతుంది. ఇక 20లక్షలు దాటిన వారికి ప్రస్తుతం 2లక్షల 90వేల పన్ను పడుతుండగా… అదిప్పుడు2లక్షలకు తగ్గుతుంది. అంటే 90వేలు ఊరట దక్కినట్లే. ఇక 24లక్షల ఆదాయం ఉన్నవారికి ప్రస్తుతం 4లక్షల 10వేల పన్ను భారం ఉండగా దాన్ని 3లక్షలకు తగ్గించారు. లక్షా 10వేలు వారికి మిగిలినట్లే. ఇక 50లక్షల ఆదాయం దాటిన వారికి కూడా లక్షా పదివేల వరకు ఊరట దక్కుతుందని కేంద్రం చెబుతోంది.

12లక్షల 75వేల వరకు పన్నులేదన్నారు హ్యపీ… మరి దాన్ని దాటితే ఎంత ట్యాక్స్‌ పే చేయాలన్నదానిపై చాలామందికి కన్ఫ్యూజన్ ఉంది. 12లక్షల పైబడిన మొత్తానికి కట్టాలా లేక ఆదాయం మొత్తానికి కట్టాలా అన్నది తెలియక జట్టు పీక్కుంటున్నారు. ఇందులో ఎలాంటి గందరగోళం లేదు. మొత్తం ఆదాయానికి ట్యాక్స్‌ కట్టాల్సిందే. ఇన్‌కం ట్యాక్స్‌ ఎలా లెక్కగడతారన్నదానిపై ఉదాహరణను తీసుకుంటే ప్రస్తుతం ఓ వ్యక్తికి ఏడాదికి 13 లక్షల వేతనం ఉందనుకుంటే… అతను కొత్త పన్ను విధానం ప్రకారం 75వేలు పన్ను కట్టాలి. ఈ 75వేలు ఎలా వచ్చిందంటే మొదటి 4లక్షలకు పన్నులేదు. ఆపై 4నుంచి 8లక్షల వరకు ఐదుశాతం పన్ను ఉంది. కాబట్టి 4లక్షలకు 20వేలు కట్టాలి. ఆ తర్వాత 8 నుంచి 12లక్షల వరకు 10శాతం కింద 40వేలు పన్ను పడుతుంది. ఆపైన లక్షకు 15శాతం చొప్పున 15వేలు. మొత్తం 75వేలు పన్ను పడుతుంది. అంటే 12లక్షల 75వేల వరకు జీతం ఉంటే కేంద్రం సెక్షన్‌ 87A కింద రిబేట్‌ ప్రకారం రూపాయి కూడా పన్ను పడదు. కానీ దానికి మించి రూపాయి ఎక్కువ ఉన్నా మొత్తానికి పన్ను పోటు తప్పదు.

నిర్మలమ్మ ఈ స్థాయిలో ఊరట కల్పించడం వెనక కారణాలు చాలానే ఉన్నాయి. ప్రస్తుతం పాత, కొత్త పన్ను విధానాలున్నాయి. జనాన్ని పాత విధానం నుంచి కొత్త విధానానికి మారేలా కేంద్రం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. రానున్న రోజుల్లో పూర్తిగా పాత విధానాన్ని తొలగించాలన్నది కేంద్రం ఆలోచన. పైగా కొత్త విధానంలో 12లక్షల ఆదాయం వరకు పన్ను మినహాయింపు అనడంతో 90శాతం మందికి పైగా దీనివైపు మళ్లడం ఖాయం. త్వరలో ఢిల్లీ ఆ తర్వాత బీహార్‌ అసెంబ్లీ ఎన్నికలున్నాయి. ఇక్కడ మధ్య తరగతే కీలకం. ఈ వర్గాన్ని కేంద్రం పట్టించుకోవడం లేదని విపక్షాలు భారీగా ప్రచారం చేస్తున్నాయి.

ప్రస్తుతం దేశ జనాభాలో 43కోట్ల మందికి పైగా మధ్యతరగతి వారే. గత లోక్‌సభ ఎన్నికల్లో అధికార బీజేపీకి అధికారం దక్కింది కానీ పాపులారిటీ భారీగా పడిపోయింది. దీనికి మధ్యతరగతే కారణమనేది కమలం అంచనా. అందుకే కేంద్రం ఈ స్థాయిలో ఆదాయపన్నుపై ఊరట కల్పించినట్లు భావిస్తున్నారు. పన్ను తగ్గించడంతో కేంద్రానికి భారీగా నష్టం వస్తుంది. కానీ జనం దగ్గర డబ్బు చెలామణి పెరుగుతుంది. ఈ డబ్బంతా ఆర్థిక వ్యవస్థలోకి వస్తుంది. కొనుగోళ్లు పెరుగుతాయి. పెట్టుబడులు పెరుగుతాయి. ఈ నిర్ణయంతో FMCG, ఆటోమొబైల్, రియల్‌ ఎస్టేట్‌ రంగాలకు లబ్ధి చేకూరుతుంది. ఈ లావాదేవీలపై పన్నుల రూపంలో కేంద్రం ఆ నష్టాన్ని చాలావరకు పూడ్చుకుంటుంది. కాబట్టి కేంద్రం పెద్దగా నష్టపోయేదేమీ కనిపించడం లేదు. మొత్తంగా నిర్మలమ్మ నిర్ణయం సంచలనాత్మకమే…