జాబ్‌ లేదు.. మనీ లేదు.. బతకడం కోసం ఆ పనులా.. అమెరికాలో విద్యార్థుల కష్టాలు…!

అమెరికా... అదో ఆశల గమ్యం. అంతకుమించి ప్రెస్టీజ్‌.. అమెరికాలో చదువుతున్నారన్నా.. ఉద్యోగం చేస్తున్నారన్నా.. కాలర్ ఎగరేసుకొని మరీ తిరుగుతుంటారు ఇక్కడున్న వాళ్లు అదేంటో !

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 24, 2025 | 01:42 PMLast Updated on: Mar 24, 2025 | 1:42 PM

No Job No Money Just Working To Survive The Hardships Of Students In America

అమెరికా… అదో ఆశల గమ్యం. అంతకుమించి ప్రెస్టీజ్‌.. అమెరికాలో చదువుతున్నారన్నా.. ఉద్యోగం చేస్తున్నారన్నా.. కాలర్ ఎగరేసుకొని మరీ తిరుగుతుంటారు ఇక్కడున్న వాళ్లు అదేంటో ! ఎక్కడో ఏడు సముద్రాల దూరంలో.. అందరికీ దూరంగా.. ఆ డాలర్ చప్పుళ్ల మధ్య అలా కాలం గడిపేస్తుంటారు. ఐతే అలాంటి డాలర్ డ్రీమ్స్‌ ఇప్పుడు పేకమేడలా కూలిపోతున్నాయ్. ట్రంప్ దెబ్బకు.. అక్కడ ఉండడం కూడా నరకంగానే మారింది. వీసా నిబంధనల నుంచి.. అక్రమంగా వలస ఉన్న వారి విషయం వరకు.. అందరి విషయంలో, అన్ని విషయాలు.. సరదా తీర్చేస్తున్నారు ట్రంప్. ఇక అమెరికా వెళ్లి చదువుకొని.. అక్కడే జాబ్ చేద్దామని పెద్ద పెద్ద కలలను బ్యాగ్‌లో నింపుకొని వెళ్లిన విద్యార్థుల కష్టాలు అయితే మరీ దారుణం.

మాస్టర్స్ డిగ్రీ, మంచి ఉద్యోగం, సుఖమైన జీవితం.. ఇలా ఎన్నో కలలు కన్న వేవేలాది మంది భారతీయ విద్యార్థులకు ఇప్పుడు పీడకలగా మారుతున్నాయ్. బంగారు భవిష్యత్ సంగతి తర్వాత.. భయంకరమైన ఆర్థిక పరిస్థితిగా మారింది. ఉద్యోగం లేకపోవడం, భారీ రుణాలు, తిరిగి చెల్లించలేని రుణాలతో భారతదేశానికి తిరిగి వెళ్లాలనే భయంతో బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. తమ కలలను కొనసాగించాలా.. లేదా వదులుకొని ఇంటికి తిరిగి వెళ్లాలా అనే సందిగ్ధంలో పడిపోయారు. ఈ సంవత్సరం H1B వీసా లాటరీ జరిగే అవకాశం లేదు. OPT తాత్కాలిక ఊరటనిస్తుంది. స్పాన్సర్‌షిప్‌ను హామీ ఇచ్చే యజమాని లేకుండా, ఇది పెద్దగా భరోసా ఇవ్వదు. USలోని అనేక కంపెనీలు ప్రస్తుతం అంతర్జాతీయ విద్యార్థులను నియమించడానికి వెనకడుగు వేస్తున్నాయ్‌. సెకండ్‌ మాస్టర్స్ డిగ్రీని కొనసాగించడంలాంటి ఇతర ఎంపికలు విద్యార్థులను బయటపడే మార్గం లేకుండా మరింత రుణ ఊబిలోకి నెట్టేస్తాయ్‌. ఎంతోమంది విద్యార్థులు ఇలాంటి పరిస్థితుల్లోనే చిక్కుకున్నారు.

లక్షల అప్పులు, ఉద్యోగం లేకపోవడం, తిరిగి ఇండియా వెళ్లలేకపోవడంలాంటి కారణాలతో నరకం చూస్తున్నారు. చదువు పూర్తయిన వాళ్ల సంగతి అలా ఉంటే.. చదువుకుంటున్న వాళ్ల పరిస్థితి మరింత దారుణం. అమెరికాలో యూనివర్శిటీ, కాలేజీ ఫీజులు చాలా ఎక్కువుంటాయ్. వాటిని కడుతూ, ఇక్కడ బతకాలి అంటే కచ్చితంగా ఉద్యోగం చేయాల్సిందే. వాళ్ళ రోజువారీ ఖర్చుల కోసమైనా డబ్బులు కావాలి. అందుకే నూటికి 90 శాతం మంది విద్యార్థులు చదువుకుంటూ పార్ట్ టైమ్ ఉద్యోగాలు చేసుకుంటారు. యూనివర్శిటీ క్యాంపస్‌లలో కూడా ఉద్యోగాలు ఉంటాయి. అయితే అందరికీ రావు. దాంతో బయటకు వచ్చిన గ్యాస్ స్టేషన్లు, రెస్టారెంట్లలో, షాప్స్ లలో చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ చదువుకుంటారు. ట్రంప్ వచ్చాక రూల్స్ మార్చేశారు. విద్యార్థులు బయట ఉద్యోగాలు చేసేందుకు వీలు లేదని స్ట్రిక్ట్ కండిషన్ పెట్టారు.

అలా బయట ఉద్యోగాలు చేస్తూ దొరికితే వారి స్టూడెంట్ వీసాలను వెంటనే క్యాన్సిల్ చేయించి.. వెనక్కు పంపేస్తున్నారు. దీంతో ఉద్యోగాలు లేవ్‌.. ఖర్చులకు డబ్బులు లేవ్‌.. డబ్బులు ఎలానో తెలియడం లేదు.. బతకడం ఎలానో అర్థం కావడం లేదు. చివరికి ఇండియాకు తిరిగి వద్దామన్నా.. చేతిలో డబ్బులు లేకపోవడంతో.. ఏం చేయాలో పాలుపోక అమాయకంగా గాల్లో దిక్కులు చూస్తున్నారు. ఐతే ఇప్పుడో ప్రచారం సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది. అక్కడే ఉండేందుకు.. ఎలాగోలా బతికేందుకు.. కొందరు అమ్మాయిలు.. కేరక్టర్‌ను అమ్ముకుంటున్నారనే ప్రచారం జరుగుతోంది. రాత్రికి ఇంత అని మాట్లాడుకొని వెళ్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయ్. ఇది నిజమా.. ఎవరో పుట్టించిన ప్రచారమా అన్న సంగతి ఎలా ఉన్నా.. అమెరికాలో మనోళ్ల కష్టాలు ఏ రేంజ్‌లో ఉన్నాయనే దానికి.. ఇది బెస్ట్ ఎగ్జాంపుల్‌.