వంద ఇస్తే..వెయ్యి కావాలంటారు దేశంలో ఉచితాలకు అడ్డే లేదా ?

ఫ్రీ..ఫ్రీ...ఫ్రీ...దేశంలో ఎన్నికల వేళ...ఏ పార్టీ అయినా ఉచితాలకు అడ్డు అదుపే లేదు. పార్టీలు పోటీ పథకాలు ఇవ్వడంలో ఆరితేరిపోయాయి. ఉచితంగా వచ్చే దానికి ప్రజలు ఆశ పడితే..

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 14, 2025 | 04:35 PMLast Updated on: Feb 14, 2025 | 4:35 PM

No Party Is Against Freebies

ఫ్రీ..ఫ్రీ…ఫ్రీ…దేశంలో ఎన్నికల వేళ…ఏ పార్టీ అయినా ఉచితాలకు అడ్డు అదుపే లేదు. పార్టీలు పోటీ పథకాలు ఇవ్వడంలో ఆరితేరిపోయాయి. ఉచితంగా వచ్చే దానికి ప్రజలు ఆశ పడితే.. ఇప్పుడు వంద ఇస్తే తర్వాత వెయ్యి రూపాయలు కోరుకుంటారు. ఉచితాలు దేశానికి ప్రమాదకరంగా మారిపోయింది. ఉచిత పథకాలపై అత్యున్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్నికల వేళ రాజకీయ పార్టీలు…ఉచితాలను ప్రకటించే పద్ధతి మంచిది కాదని వ్యాఖ్యానించింది. పట్టణ ప్రాంతాల్లో నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించాలని దాఖలైన పిటిషన్‌పై జస్టిస్‌ బీఆర్‌.గవై, జస్టిస్‌ అగస్టిన్‌ జార్జ్‌ మాసిహ్‌తో కూడిన ధర్మాసనం విచారించింది. ప్రజలకు సౌకర్యాలు అందించాలన్న ప్రభుత్వాల ఉద్దేశం మంచిదే అయినా…కానీ వారిని దేశ అభివృద్ధిలో భాగం చేయాలని సూచించింది. ఉచితాల ద్వారా అలా జరుగుతోందా..? ఎన్నికల్లో ఉచిత పథకాలు ప్రకటించే పద్ధతి సరైనది కాదని స్పష్టం చేసింది. ఉచిత పథకాలు మంచివి కాదని… దురదృష్టవశాత్తూ.. వీటి కారణంగా ప్రజలు కష్టపడి పని చేసేందుకు ఇష్టపడడం లేదని స్పష్టం చేసింది. ఉచితంగా రేషన్‌, డబ్బులు అందుతున్నాయని…ఎలాంటి పని చేయకుండానే డబ్బులు వస్తుండటంతోనే ఇలా జరుగుతోందని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, ఆప్‌, కాంగ్రెస్‌ పోటీపడి హామీలు ఇచ్చాయి. అసలు బడ్జెట్‌ అవుతుందో కూడా తెలియదు. ఇష్టారాజ్యంగా పంచుతామని అడ్డు అదుపు లేకుండా వేల కోట్ల హామీలు ఇచ్చారు.

Moneyసంక్షేమం పేరుతో ఉచిత పథకాలు అమలు చేయడం…తప్పేమీ కాదు. ఎవరు అర్హులో…ఎవరు అనర్హులో గుర్తించి ఇవ్వాలి. అలా అని అందరికి ఇవ్వడం కూడా ధర్మం కాదు. ఎన్నికల్లో లబ్దిపొందడం కోసం ఉచితాలు ఇవ్వడమన్నది మాత్రం క్షమించరాని నేరం. ఉచిత పథకాలు అందరికి ఇవ్వడం వల్ల జనాన్ని సోమరులుగా మార్చేసినట్లే. అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు ఉచిత పథకాలు అమలు చేయడం కారణంగా…పని సంస్కృతిని చంపేస్తున్నాయి. సంక్షేమాన్ని అమలు చేయకూడదని కాదు…వాటిని అమలు చేసే తీరే సరైంది కాదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఎల్‌ అండ్‌ టీ ఛైర్మన్‌..చెన్నైలో భారత పరిశ్రమల సమాఖ్య సదస్సులో కీలక వ్యాఖ్యలు చేశారు. నిర్మాణరంగంలో కార్మికుల వలసలు తగ్గిపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. సంక్షేమ పథకాల కారణంగానే ఈ పరిస్థితి వచ్చిందని…ఉచిత పథకాల వల్లే కార్మికులు పని చేయడానికి ఇష్టపడటం లేదన్నారు. ఉపాధి…సంక్షేమం…రాయితీలు…వీటికి చాలా తేడా ఉంది. సంక్షేమం పేరుతో ఉచితాలు ఇష్టారాజ్యంగా ఇచ్చేస్తున్నారు. రాష్ట్ర, దేశ ఆర్థిక పరిస్థితి ఏమైనా సరే.. తమ రాజకీయ ప్రయోజనం నెరవేరితే చాలన్నట్లు రాజకీయ పార్టీలు వ్యవహరిస్తున్నాయి. ముందు హామీలి ఇచ్చేద్దాం…అధికారంలోకి వచ్చాక పథకాల సంగతి చూద్దాం అన్నట్లుగా పార్టీల తీరు ఉంది.

దేశంలో అన్ని రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు ఉచిత పథకాలు అమల్లో ఉన్నాయి. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకమైన స్కీమ్ ఉంది. చివరకు కేంద్రంలో కూడా ఉచిత పథకాల సంస్కృతి వచ్చేసింది. సంక్షేమ పథకాల్లో భాగంగా బడుగు, బలహీన వర్గాలకు మేలు చేయాల్సిందే. అయితే కేవలం ఓట్ల కోసం ప్రకటించే అనుచిత వాగ్దానాలతోనే అసలు సమస్య. దేశంలో ప్రజలందరి ఆదాయం ఒకే రకంగా లేదు. సంపద పంపిణీ కూడా క్రమపద్ధతిలో లేదు. అలాంటప్పుడు మొత్తానికి మొత్తం పథకాలు వద్దంటే.. పేదవాడు ఎలా బతకాలనే ప్రశ్నలున్నాయి. ఉచితాలు అనుచితమని అందరూ అంటారు. కానీ, అమలు పరిచే సమయం వచ్చే సరికి అన్ని రాజకీయ పక్షాలూ ఒకే తాను ముక్కలు. ఎన్నికలు వచ్చిన ప్రతిసారి… అన్ని రాజకీయ పార్టీలు పోటీ పడి మేనిఫెస్టో పేరుతో హామీలిస్తున్నాయి. సంక్షేమ పథకాలనీ…ఉచిత పథకాలంటూ ఊదరకొడుతున్నాయి. ఏ ఒక్క రాజకీయ పార్టీ దీనికి మినహాయింపేమీ కాదు…అందరికి ఒకటే దారి. ఇప్పుడే ఏ రాజకీయ పార్టీ మేనిఫెస్టో చూసినా నగదు బదిలీ పథకాలు తప్ప మరేమీ ఉండటం లేదు. వాటికే ప్రజలు ఓట్లేస్తున్నారని గట్టిగా నమ్ముతున్నారు. ఓట్లు కొనడానికి… ప్రలోభ పెట్టడానికి డబ్బు పంపిణీ చేసే అడ్డుకునే వ్యవస్థలు ఉన్నాయి. విధానాల పేరు చెప్పి పలు అనుచిత ఉచితాలు ప్రకటించి మూకుమ్మడిగా ఓటర్లను ప్రలోభపెట్టి…ఎన్నికల్లో లబ్ధి పొందే రాజకీయ పార్టీల ఎత్తుగడలకు అడ్డుకట్ట లేదు. ఫలితంగా అధికారంలోకి వచ్చేందుకో, ఉన్న అధికారాన్ని నిలుపుకునేందుకో ఉచితాలు, రాయితీలు, మాఫీలతో ఖజానా ఖాళీ చేసి రాష్ట్రాలను అప్పుల కుప్పగా మార్చేస్తున్నాయి.