Parliament Attack: పార్లమెంటుకే భద్రత లేదా? మరి సామాన్యుల సంగతేంటి..?
వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి నిర్మించిన కొత్త పార్లమెంట్ భవనంలో.. భద్రత చాలా బలహీనమనే సంకేతాలు బయటకు వెళ్లటం ఏ మాత్రం మంచిది కాదు. ఇప్పటికీ దేశానికి ఉగ్రముప్పు పొంచి ఉంది. పార్లమెంట్ ఉగ్రవాద సంస్థలకు కూడా అలుసయ్యే ప్రమాదం ఉంది.
Parliament Attack: పార్లమెంట్‌లో టియర్ గ్యాస్ దాడి కలకలం రేపింది. ఆగంతకులు విజిటర్స్ గ్యాలరీ నుంచి సభలోకి ప్రవేశించడం భద్రతా వైఫల్యాన్ని గుర్తు చేసింది. సరిగ్గా 22 ఏళ్ల క్రితం పార్లమెంట్‌పై ఉగ్రదాడి జరిగిన రోజే.. ఈ ఘటన జరగటంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఖలిస్తానీ ఉగ్రవాదుల హెచ్చరికలున్నా.. తనిఖీలు సరిగ్గా జరపలేదనే విమర్శలు వస్తున్నాయి. ప్రజాస్వామ్య దేశంలో సార్వభౌమాధికారానికి పార్లమెంట్ చిహ్నం. అలాంటి పార్లమెంట్‌లోకి ఎవరో బయటి వ్యక్తులు వచ్చి టియర్ గ్యాస్ వదలడం చిన్న విషయం కాదు.
దేశ పార్లమెంటరీ వ్యవస్థనే అపహాస్యం చేసే ఘటన ఇది. ఏదో నిరసన తెలిపారు అంతే కదా అని లైట్ తీస్కుంటే తప్పులో కాలేసినట్టే. ఇప్పుడు షూస్‌లో టియర్ గ్యాస్ పెట్టుకొచ్చారని తేలిగ్గా తీసుకుంటున్నారు. రేపు అదే షూస్‌లో తుపాకీ పెట్టుకొస్తే ఏం చేస్తారనేది తేలాలి. వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి నిర్మించిన కొత్త పార్లమెంట్ భవనంలో.. భద్రత చాలా బలహీనమనే సంకేతాలు బయటకు వెళ్లటం ఏ మాత్రం మంచిది కాదు. ఇప్పటికీ దేశానికి ఉగ్రముప్పు పొంచి ఉంది. ఇప్పటివరకు కొత్త పార్లమెంట్‌కు కట్టుదిట్టమైన భద్రత ఉందని సర్కారు చెబుతూ వచ్చింది. కానీ ఆగంతకుల ఘటన తర్వాత.. పార్లమెంట్ ఉగ్రవాద సంస్థలకు కూడా అలుసయ్యే ప్రమాదం ఉంది. చాలా తేలికగా ఎవరైనా పార్లమెంట్ లోకి ప్రవేశించవచ్చని రూఢీ అయింది. కచ్చితంగా పార్లమెంట్ భద్రత విషయంలో సమగ్ర సమీక్ష జరగాలి. లోపాలుంటే సరిదిద్దుకోవాలి. పార్లమెంట్ శత్రు దుర్భేధ్యంగా ఉండాలి. ఇలాంటి ఘటనలు మరోసారి జరక్కుండా చూసుకోవాలి. ఏదో నామ్ కే వాస్తే సమీక్షలు, విచారణలతో సరిపెడితే అంతకంటే ఆత్మవంచన మరొకటి ఉండదు. 22 ఏళ్ల నాటి ఉగ్రదాడి నుంచి ఏం పాఠాలు నేర్చుకున్నారనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.
భద్రతా సిబ్బందిని ఎలా దాటారు..?
పార్లమెంట్ లోపల దాడికి పాల్పడిన ఇద్దరు ఆగంతకుల్ని సాగర్ శర్మ, మనోరంజన్‌గా ఢిల్లీ పోలీసులు గుర్తించారు. బయట రంగుల టియర్‌గ్యాస్‌తో నినాదాలు చేసింది నీలమ్‌కౌర్, ఆమోల్ షిండేగా గుర్తించారు. మొత్తం నలుగురు వ్యక్తులు పోలీసుల అదుపులో ఉన్నారు. రూ.20వేల కోట్లతో నిర్మించిన కొత్త పార్లమెంట్ భవన్‌లోకి భద్రతా తనిఖీని తప్పించుకుని వాళ్లు లోపలికి టియర్‌గ్యాస్‌తో ఎలా వెళ్లారు? అనే ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. మైసూర్ ఎంపీ ప్రతాప్ సింహా పేరిట పాస్‌లు తీసుకుని ఆగంతకులు లోపలికి ప్రవేశించినట్లు తెలిసింది. పార్లమెంట్‌పై ఉగ్రదాడి జరిగి సరిగ్గా 22 ఏళ్లు పూర్తైంది. అదే రోజున ఈ దాడి జరగడం చర్చనీయాంశంగా మారింది. త్వరలో భారత్‌లో దాడులకు పాల్పడతామని కెనడాకు చెందిన ఖలిస్తానీ సంస్థలు ప్రకటించాయి. దీంతో ఇప్పుడు టియర్ గ్యాస్ ఘటనకు, ఖలిస్తానీ సంస్థలకు ఏమైనా సంబంధం ఉందా? అనే కోణంలోనూ దర్యాప్తు జరుగుతోంది. టియర్ గ్యాస్ బాటిల్‌ను షూలో దాచిపెట్టి.. లోపలికి ప్రవేశించారని భద్రతా సిబ్బంది తెలిపారు. కట్టుదిట్టమైన భద్రత ఉన్న భవనంలోకి ఎవరో వచ్చి టియర్ గ్యాస్ ఎలా ప్రయోగిస్తారనేది ప్రశ్న. వీరికి పార్లమెంట్ సిబ్బంది ఎవరైనా సహకరించారా.. లేదా అనే సందేహాలు వస్తున్నాయి. ఏ దేశానికైనా పార్లమెంట్ భద్రత చాలా కీలకం.
సామాన్యులకు భద్రత కల్పిస్తారా..?
పార్లమెంట్‌కే భద్రత కల్పించలేని దేశం.. ప్రజలకు భద్రత ఇవ్వగలదా అనేది మౌలికమైన ప్రశ్న. అత్యంత పటిష్టమైన భద్రత ఉండే పార్లమెంట్‌లోకి ప్రమాదకర రసాయనాలు ఉన్న ట్యూబ్ లాంటి వాటితో రావడం అతి పెద్ద భద్రతా వైఫల్యం. ప్రేక్షకుల గ్యాలరీలోనికి రావడానికి కూడా ఐదంచెల సెక్యూరిటీ సిస్టమ్ దాటి రావాల్సి ఉంటుంది. అలాంటి, భద్రతా వ్యవస్థను దాటి సభలోనికి వారు ప్రవేశించడం కచ్చితంగా వైఫల్యమే. ఇద్దరు దుండగులు బీజేపీ ఎంపీ ప్రతాప సింహ ఆఫీసు నుంచి పార్లమెంట్‌లోకి ప్రవేశించడానికి అనుమతించే పాస్‌లను పొందారు. సిక్స్ ఫర్ జస్టిస్ ఉగ్రవాద సంస్థ ముఖ్యుడు గురుపత్వంత్ సింగ్ పన్నూ కొద్దిరోజుల క్రితమే హెచ్చరికలు జారీ చేశాడు. డిసెంబర్ 13 వరకూ భారత పార్లమెంట్‌పై దాడి చేస్తామని బెదిరించడం ఆందోళన రేపింది. అయితే ఈ హెచ్చరికల తర్వాత కూడా అప్రమత్తం కాలేదా అనే అనుమానాలు వస్తున్నాయి. దాడి జరగకపోయినా.. జరుగుతుందనే అంచనాతో అప్రమత్తం కావాల్సి ఉంటుంది.
కానీ కొత్త పార్లమెంట్‌కు భద్రత విషయం ప్రశ్నార్థకంగా మారేలా సిబ్బంది తీరు ఉంది. కీలకమైన పార్లమెంట్ భవనం భద్రతను లైట్ తీస్కుంటున్నారా అనే సందేహాలు వస్తున్నాయి. 22 యేళ్ళ క్రితం కూడా పార్లమెంట్‌పై దాడి జరిగింది. యావత్ దేశాన్ని కదిలించిన భయంకరమైన ఉగ్రదాడి అది. 2001 డిసెంబరు 13న జరిగిన ఆనాటి భయానక ఘటన ఇప్పటికీ దేశ ప్రజల మదిలో మెదులుతూనే ఉంది. అదే రోజు మళ్లీ పార్లమెట్‌లో గ్యాస్ దాడి కలకలం రేపుతోంది. ఆనాడు పార్లమెంటు ప్రాంగణంలో 30 నిమిషాల పాటు జరిగిన ఈ భయానక ఘటనలో మొత్తం తొమ్మిది మంది చనిపోగా, 18 మంది గాయపడ్డారు. 22 ఏళ్ల నాటి ఉగ్రదాడి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ పార్లమెంట్ లో చర్చ సాగుతున్న టైమ్‌లోనే మరోసారి ఇలా గ్యాస్ దాడి జరగడం సంచలనంగా మారింది.