Pakistan Army: ఆకలితో అలమటిస్తున్న పాక్ సైన్యం..!

దేశ ఆర్థిక పరిస్థితి ఇంత దుర్భరంగా ఉంటే ఎలాగోలా ఒడ్డున పడేయాల్సిన పాక్ పాలకులు... రాజకీయాలు చేస్తున్నారు. ఇమ్రాన్‌ను ఎలా బొక్కలో తోయాలా అని ఆలోచిస్తున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 7, 2023 | 08:09 AMLast Updated on: Mar 07, 2023 | 8:09 AM

No Salaries And No Food For Pakistan Army

శత్రువైనా కష్టాల్లో ఉన్నప్పుడు అయ్యో పాపం అనక తప్పదు… ప్రస్తుతం పాక్ సైనికులు తిండికి కూడా వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

సరిహద్దుల్లో నిరంతరం కాల్పులు జరపడం, ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం పాక్ సైనికుల పని… కానీ ఇప్పుడు సీన్ మారింది. వాళ్ల యుద్ధం ఇప్పుడు భారత్‌తో కాదు… ఆకలితో… కడుపు మండుతుంటే డొక్కలు ఎండుతుంటే తిండి కోసం నానా కష్టాలు పడుతున్నారు. ఓవైపు జీతాలు లేవు… మరోవైపు సరైన తిండీ లేదు.. అన్నమో అల్లా అంటూ దీనంగా వేడుకుంటున్నారు.

ప్రస్తుతం పాక్ దివాళా అంచున నిలబడింది. చైనా కాస్తో కూస్తో ఆదుకోకపోయింటే ఎప్పుడో చేతులెత్తేసేది. కష్టాల నుంచి బయటపడటానికి, ఐఎంఎఫ్ నుంచి అప్పుకోసం నానా తిప్పలు పడ్డారు. చివరకు ప్రజలపై పన్నుల భారం మోపారు. అయినా అప్పు పుట్టలేదు. ద్రవ్యోల్బణం 48 ఏళ్ల గరిష్టానికి చేరింది. ఆ ప్రభావం పాక్ సైన్యంపై కూడా ఓ రేంజ్‌లో పడింది. సైన్యానికి ఇస్తున్న బడ్జెట్‌లో పెద్దగా కోతలేదని అధికారులు చెబుతున్నా వాస్తవం మాత్రం భిన్నంగా ఉంది. ఇంకా చెప్పాలంటే దారుణంగా ఉంది. ఆయుధ సమీకరణను నిలిపివేశారు. సైనికుల జీతాల్లో కోతలు పెట్టారు.

జీతాల్లో కోతంటే ఎలాగోలా నెగ్గుకురావొచ్చు. కానీ సైన్యానికి పెట్టే తిండిలోనూ కోతపెట్టారు. చాలాచోట్ల సైనికులకు మూడు పూటలు కాదు రెండు పూటాల తిండి కూడా సరిగా అందట్లేదు. సరుకులు వస్తాయో లేదో వచ్చినా అందరికీ తిండి దక్కుతుందో లేదోనన్న భయం వారిని వెంటాడుతోంది. నిత్యావసరాల కోసం పోరాటమే వారి నిత్యకృత్యమైంది. సరిహద్దుల్లో ఎదురయ్యే సమస్యలతో పాటు తిండి కోసం పోరాడుతున్నామని ఏకంగా డీజీఎంవో స్థాయి అధికారులే మొరపెట్టుకుంటున్నారు. తుపాకులకు తిండి లేకపోయినా పర్లేదు కానీ సైనికులకు మాత్రం కావాలని ఏకంగా హెడ్‌క్వార్టర్లకు మెసేజ్‌లు పంపుతున్నారు.

సైనిక పెద్దలు కూడా ప్రస్తుతం ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నారు. పాకిస్థాన్ సైనిక బడ్జెట్‌ 11.30 బిలియన్ అమెరికన్ డాలర్లు.. కానీ అంత మొత్తం కేటాయించే పరిస్థితి లేదు. దీంట్లో సగం కూడా సైన్యానికి అందడం కష్టమే అంటున్నారు. ఆయుధ సమీకరణ వంటి ఖర్చులను వాయిదా వేసుకోవచ్చు… కానీ సైన్యానికి ఇవ్వాల్సిన జీతభత్యాలు, తిండీ తిప్పలపై కోత పెడితే మాత్రం అది కష్టమే… ఆ జీతంపై ఆధారపడే వారి కుటుంబాలు బతుకుతున్నాయి. ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగి ధరలు ఆకాశంలో ఉన్నాయి. ఇలాంటి సమయంలో జీతాల్లో కోత పెట్టడమేంటని సైనికులు ప్రశ్నిస్తున్నారు. మొత్తంగా చూస్తే పాక్ సైనికుల పరిస్థితి దారుణంగా ఉంది. సరిహద్దుల్లో భారత్‌తో పోరాడాలో లేక ఆకలితో యుద్ధం చేయాలో వారికి అర్థం కావడం లేదు.

దేశ ఆర్థిక పరిస్థితి ఇంత దుర్భరంగా ఉంటే ఎలాగోలా ఒడ్డున పడేయాల్సిన పాక్ పాలకులు… రాజకీయాలు చేస్తున్నారు. ఇమ్రాన్‌ను ఎలా బొక్కలో తోయాలా అని ఆలోచిస్తున్నారు. కానీ మనం ఎలా గండం నుంచి బయటపడదామా అన్నదానిపై సీరియస్‌గా దృష్టి పెట్టలేదు. ఇది ప్రజల్లో మరింత వ్యతిరేకతకు కారణమవుతోంది.

(KK)