Top story: టారిఫ్స్ కాదు.. ఇక ఇండియా టైమ్ ఆట మొత్తాన్నీ మార్చేసిన జైశంకర్

టారిఫ్స్.. ప్రపంచ వ్యాప్తంగా కల్లోలం సృష్టిస్తున్న వన్ అండ్ ఓన్లీ వర్డ్ ఇది. ట్రంప్ యాక్షన్‌కు చైనా వంటి దేశాలు ప్రతీకారానికి దిగడం ప్రపంచాన్ని కలవరపెడుతోంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 9, 2025 | 03:50 PMLast Updated on: Apr 09, 2025 | 3:50 PM

Not Tariffs But Jaishankar Who Changed The Whole Game Of India Time

టారిఫ్స్.. ప్రపంచ వ్యాప్తంగా కల్లోలం సృష్టిస్తున్న వన్ అండ్ ఓన్లీ వర్డ్ ఇది. ట్రంప్ యాక్షన్‌కు చైనా వంటి దేశాలు ప్రతీకారానికి దిగడం ప్రపంచాన్ని కలవరపెడుతోంది. ఈ వాణిజ్య యుద్ధం.. ఎక్కడ ఆర్థిక మాంద్యంగా మారుతుందో అన్న ఆందోళనలే చాలా దేశాల్లో కనిపిస్తున్నాయి. మరి డొనాల్డ్ ట్రంప్ టారిఫ్స్‌పై భారత్ రియాక్షన్ ఏంటి?.. చైనా చేసినట్టు ప్రతీకార పన్నులకు దిగుతుందా? లేక ట్రంప్‌కు తలవంచి సర్దుకుపోతుందా? అంటే ఈ రెండూ కాదు.. అంతకుమించిన ఫార్ములాను తెరపైకి తెచ్చింది. ఆ ఫార్ములా కనుక వర్క్‌ఔట్ అయితే ట్రంప్ టారిఫ్స్‌ ప్రభావం మన దేశంపై ఉండకపోగా.. వాణిజ్యంలో సరికొత్త లక్ష్యాలను చేరుకోవడం ఈజీ అవుతుంది. పైగా ఆ ఫార్ములాను జైశంకర్ హ్యాండిల్ చేస్తున్నారు. కాబట్టి ఫెయిల్ అయ్యే ఛాన్స్ కూడా ఉండకపోవచ్చు. ఇంతకూ, ట్రంప్ టారిఫ్స్ టెర్రర్ పుట్టిస్తున్న వేళ.. భారత్-అమెరికా అమలు చేయబోతున్న ఫార్ములా ఏంటి? ఆ ఫార్ములా భారత వాణిజ్యంలో గేమ్ ఛేంజర్‌గా ఎలా మారుతుంది? టాప్ స్టోరీలో చూద్దాం..

2022 ఫిబ్రవరి 24న ఉక్రెయిన్‌పై రష్యా దండెత్తింది. అప్పుడు ప్రపంచం రెండుగా చీలింది. ఉక్రెయిన్, రష్యాలో ఎవరు ఎవరివైపు అనే ప్రశ్న తలెత్తింది. కొన్నిదేశాలు ఉక్రెయిన్‌ వైపు నిలిస్తే.. మరి కొన్ని దేశాలు రష్యా వైపు నిలబడ్డాయి. భారత్ మాత్రం ఎవరివైపూ నిలబడలేదు. తన సిద్ధాంతం శాంతి మాత్రమే అని తేల్చి చెప్పింది. కీవ్‌వైపు నిలవాలని అమెరికా తీవ్ర ఒత్తిడి తెచ్చినా డోంట్ కేర్ అంటూ..అదే మాటపై నిలబడింది. మొదట్లో భారత్ ధైర్యం ఏంటో ప్రపంచ దేశాలకు అర్ధం కాలేదు. ఆ తర్వాత మాత్రం భారత్ నిర్ణయమే భేష్ అని ప్రపంచమే అంగీకరించింది. తొందర పడి ఏదో ఒక నిర్ణయం తీసు కుని, గుడ్డిగా ఎవరో ఒకరి పక్షాన నిలవడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదని ప్రపంచానికి అర్ధమైంది. ఇప్పుడు ట్రంప్ టారిఫ్స్‌ విషయంలో కూడా భారత్ అంతే కూల్‌గా వ్యవహరిస్తోంది. 26శాతం టారిఫ్స్ ప్రకటించగానే తొందరపడి ప్రతీకార పన్నులు ప్రకటించలేదు. ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిం చింది. ఇప్పుడు ఆ మార్గాలే భారత్‌ను బెటర్ పొజిషన్‌లో నిలబెట్టబోతున్నాయి.

ట్రంప్‌ విధించిన టారిఫ్‌లపై చాలా దేశాలు ప్రతీకార చర్యలకు సిద్ధమవుతున్న వేళ భారత్‌ చేస్తున్న భిన్నమైన ఆలోచనలకు సాక్ష్యమే ఈ ట్వీట్. అగ్రరాజ్యంపై పరస్పర సుంకాలకు బదులుగా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవడంపై మోడీ సర్కార్ దృష్టిసారించింది. దీనిపై ఇరుదేశాల విదేశాంగ మంత్రులు జైశంకర్, మార్కో రూబియో ఫోన్‌లో కీలక చర్చలు జరిపారు. ప్రతిపాదిత వాణిజ్య ఒప్పందానికి త్వరగా ఆమోదం తెలపాలని ఇరుపక్షాలు అంగీకారానికి వచ్చాయి. ఈ విషయాన్నే భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌ సోషల్ మీడియాలో వెల్లడించారు. ‘‘అమెరికా విదేశాంగ మంత్రి రూబియోతో ఫోన్‌లో మాట్లాడా. ఇండో-పసిఫిక్‌, భారత ఉపఖండం, యూరప్, మధ్య ఆసియా, పశ్చిమాసియా, కరేబి యన్‌లో నెలకొన్న పరిస్థితులపై చర్చలు సాగించాం. భారత్‌-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాన్ని వీలైనంత త్వరగా చేసుకోవాల్సిన ఆవశ్యకతపై ఏకాభిప్రాయానికి వచ్చాం. దీనిపై మరిన్ని సంప్రదింపులు కొనసాగించేందుకు ఎదురుచూస్తున్నాం అని జైశంకర్‌ రాసుకొచ్చారు.

అమెరికాతో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం పూర్తయితే ట్రంప్ టారిఫ్స్‌.. మనకు వరంగా మారే అవకాశాలే అధికంగా ఉంటాయి. ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం అంటే.. రెండు దేశాలు పరస్పర అంగీకారంతో దిగుమతులు, ఎగుమతులపై సుంకాలను తగ్గించే డీల్. దీని వల్ల వాణిజ్యానికి మరిన్ని అవకాశాలు లభిస్తాయి. వివరంగా చెప్పాలంటే.. అమెరికాతో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం అమల్లోకి వస్తే, రెండువైపులా చాలా ఉత్పత్తులపై సుంకాలు తగ్గిపోతాయి, లేదంటే రద్దు అవుతాయి. కొన్ని ప్రత్యేక ఉత్పత్తులపై మాత్రమే సుంకాలు కొనసాగొచ్చు. దీని వల్ల భారత్, అమెరికా టారిఫ్ వార్ సమస్య పరిష్కారమవుతుంది. ఇకపై అమెరికా నుంచి వచ్చే ఉత్పత్తులు చౌకగా లభిస్తాయి. అదే విధంగా, భారత్ నుంచి అగ్రరాజ్యానికి ఎగుమతి చేసే ఉత్పత్తులు, సేవలు కూడా మరింత పోటీ ధరలతో అందుబాటులోకి వస్తాయి. దీని వలన భారతీయ తయారీ రంగం, సేవా రంగం మరింత అభివృద్ధి చెందే అవకాశముంది. ఇప్పటికే మన దేశం.. ఆస్ట్రేలియా, మారిషస్, యూఏఈ, దక్షిణ కొరియా, సింగపూర్ వంటి దేశాలతో వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంది. ఇక బ్రిటన్, కెనడా, యూరోపియన్ యూనియన్, ఇజ్రాయెల్‌తో కూడా చర్చలు కొనసాగుతున్నాయి. ఈ దేశాల సంగతెలా ఉన్నా.. అమెరికాతో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం ఫైనల్ అయితే.. అది భారత్‌కు గేమ్ ఛేంజింగ్ మూమెంట్ అవుతుందన్నది విశ్లేషకుల అభిప్రాయం. అందుకు చాలా బలమైన కారణాలున్నాయి.

చైనా, యూరోపియన్​ యూనియన్​‌పై అమెరికా ఆర్థిక యుద్ధం చేస్తే, ఆ పరిణామం భారత్‌కు వరంగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ ట్రేడ్‌ వార్ బడా సంస్థలు భారత్‌కు వచ్చేలా చేస్తుంది. చైనా ఆల్రెడీ.. అమెరికా, యూరోపియన్ యూనియన్‌తో వాణిజ్య యుద్ధంలో ఉంది. అటు యూరోపియన్ యూనియన్ కూడా చైనాకు ప్రత్యామ్నాయం కోసం భారత్‌తోనే సంప్రదింపులు చేస్తోంది. ఈ పరిణామాలు మన దేశ వాణిజ్యానికి కలిసొచ్చే అంశాలే. చైనాను మరిన్ని కష్టాల్లోకి నెట్టేయబోతోంది కూడా ఈ పరిణామాలే. ఓవరాల్‌గా ఒక్కటి మాత్రం నిజం.. సంక్షోభాలు ఎదురైనప్పుడు తొందరపాటు చర్యలతోకాక.. సామరస్యంగా నిర్ణయాలు తీసుకుంటే ఫలితాలు పాజిటివ్‌గా వస్తాయని భారత్ మరోసారి ప్రపంచానికి చాటబోతోంది.