ఇక హమాస్, ఇరాన్ అంతమే.. ఒక్కటైన ట్రంప్, నెతన్యాహు..!
2025 జనవరి 19.. పదిహేను నెలలుగా బాంబుల శబ్దాలు, బాధితుల ఆర్తనాదాలతో దద్దరిల్లిన గాజాలో పిన్ డ్రాప్ సైలెన్స్ ఏర్పడిన రోజు. సీజ్ ఫైర్ డీల్ అమల్లోకి రావడంతోనే గాజా పౌరులు వీధుల్లోకి వచ్చి సంబరాలు చేసుకున్నారు.

2025 జనవరి 19.. పదిహేను నెలలుగా బాంబుల శబ్దాలు, బాధితుల ఆర్తనాదాలతో దద్దరిల్లిన గాజాలో పిన్ డ్రాప్ సైలెన్స్ ఏర్పడిన రోజు. సీజ్ ఫైర్ డీల్ అమల్లోకి రావడంతోనే గాజా పౌరులు వీధుల్లోకి వచ్చి సంబరాలు చేసుకున్నారు. వలస వెళ్లిన లక్షలాదిమంది సంక్షోభం ఇక ముగిసిందని భావించి గాజా ప్రాంతానికి తిరిగి రావడం మొదలు పెట్టారు. నిజమే.. కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగి ఉంటే గాజా సంక్షోభం ముగిసిపోయి ఉండేది. కానీ, అలా జరగలేదు. సీజ్ ఫైర్ డీల్ తొలి దశకే పరిమితమైంది. రెండో దశ చర్చలు ప్రారంభం కూడా కాలేదు. చర్చలు ప్రారంభం కాబోతున్నాయి అనుకునేలోపు ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు ఆయుధాలు నింపుకున్నాయి. గాజా నింగిలో గర్జించడం మొదలు పెట్టాయి. ఫలితంగా వందల మంది పిట్టల్లా రాలిపోతున్నారు. కానీ, ముగిసిందనుకున్న గాజావార్ మళ్లీ ఎందుకు మొదలైంది?రెండో దశ యుద్ధంలో నెతన్యాహు లక్ష్యం ఏంటి? టాప్ స్టోరీలో చూద్దాం..
2025 మార్చి 17వ తేదీ.. అంతా ముగిసిపోయింది అనుకుని ప్రశాంతంగా ఉన్న గాజాను ఉలిక్కి పడేలా చేసిన రోజు. ఒకటీ రెండూ కాదు.. వందల ఫైటర్ జెట్స్ అర్ధరాత్రి బాంబుల వర్షం కురిపించాయి. తొలి గంటలో 30 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయినట్టు గాజా సివిల్ డిఫెన్స్ ఏజెన్సీ ప్రకటించింది. ఆ తర్వాత గంట గంటకూ లెక్క మారుతూనే ఉంది. 24 గంటలు గడిచేసరికి ఆ లెక్క 500లకు చేరింది. ఇక గాజా అనే ప్రాంతం అక్కడ ఉండకూడదు అనే రేంజ్‌లో ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ దాడులు కొనసాగాయి. దీనికి తొలి అడుగు ఇటీవలే పడింది. ఫిబ్రవరి చివర్లో అందరి ముందు ప్రదర్శన చేస్తూ బందీలను రిలీజ్ చేయడం వారిని అవమానించడమే అని ఆరోపిస్తూ 600మంది పాలస్తీనా ఖైదీల విడుదలను నెతన్యాహు నిలిపివేశారు. ఈ చర్చ ఒప్పందాన్ని ఉల్లంఘించడమేనన్న హమాస్, ఇజ్రాయెల్ తీరును తప్పుబట్టింది. చివరికి ఖతర్ జోక్యంతో నలుగురు ఇజ్రాయెల్ పౌరుల మృతదేహాలను ఎలాంటి ప్రదర్శన లేకుండా హమాస్ అప్పగించింది. బదులుగా పాలస్తీనా ఖైదీలను ఇజ్రాయెల్ విడుదల చేసింది. కానీ, ఇక్కడితో ఏదీ పూర్తి కాలేదు. ఎందుకంటే నెతన్యాహు మైండ్‌లో మరో స్ట్రాటజీ రన్ అయింది.
తొలి విడత సీజ్ ఫైర్ ఒప్పందంలో భాగంగా 8 మృతదేహాలు, 33 మంది బందీలను హమాస్ అప్పగించగా 2 వేల మంది పాలస్తీనా ఖైదీలను ఇజ్రాయెల్ విడిచిపెట్టింది. 6 వారాల ఒప్పందం ముగిసి పదిరోజులు దాటింది. దీంతో ఇరుపక్షాలు రెండో విడత చర్చలు జరపాలని కోరుకుంటున్నట్లు అమెరికా పశ్చిమాసియా రాయబారి స్టీవ్ విట్‌కాఫ్ ఫిబ్రవరి చివర్లో తెలిపారు. హమాస్ స్పందించలేదు. ఫలితంగా బందీలందరినీ విడిపించి హమాస్ సైనిక, పాలనాపరమైన శక్తిని ధ్వంసం చేస్తామని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు చెప్పారు. ఇందుకు ట్రంప్ ప్రభుత్వం మద్దతు ప్రకటించింది. అయితే యుద్ధం మొదలు పెట్టకుండా హమాస్ సామర్థ్యాన్ని ఎలా ధ్వంసం చేస్తారనే ప్రశ్నలు తలెత్తాయి. కట్‌చేస్తే.. ఆ ప్రశ్నలకి సమాధానంగా ఇజ్రాయెల్ గాజాపై విరుచుకుపడిపోయింది. ఖాన్ యూనిస్, రఫా, ఉత్తర గాజా, గాజా సిటీల్లో వైమానిక దాడులు చేస్తోంది. గాజాలో జరిపిన దాడుల్లో హమాస్ పోలీస్, ఇంటర్నల్ సెక్యూరిటీ సర్వీసెస్ హెడ్ మహ్మద్ అబు వత్ఫా కథ కూడా ముగించేసింది. సో.. టార్గెట్ క్లియర్.. గాజాలో హమాస్ అనే పేరు కూ డా వినపడటానికి వీల్లేదని నెతన్యాహు ఫిక్స్ అయ్యారు. మరి గాజా యుద్ధాన్ని నేనే ముగించానని గర్వంగా ప్రకటించుకున్న ట్రంప్ మాటేంటి? అసలు కథంతా నడిపిస్తోంది ఆయనే.
ఔను.. గాజాలో ఇజ్రాయెల్ పక్కా ప్రణాళికతోనే దాడులు మొదలుపెట్టింది. భీకర దాడులకు ముందు నెతన్యాహు సర్కార్ ట్రంప్ ప్రభుత్వాన్ని సంప్రదించింది. ఈ విషయాన్ని స్వయంగా వైట్‌హౌసే చెప్పింది. దాడుల గురించి ట్రంప్ యంత్రాంగాన్ని ఇజ్రాయెల్ సంప్రదించిందనీ.. ఇజ్రాయెల్‌తో పాటు అమెరికాను భయభ్రాంతులకు గురిచేయాలని చూసే హమాస్, హౌతీలు, ఇరాన్ మూల్యం చెల్లించుకోక తప్పదని వైట్‌హౌస్ మీడియా కార్యదర్శి కరోలిన్ లివిట్ ప్రకటించారు. సో.. ట్రంప్ సర్కార్ మద్దతుతోనే గాజాలో ఇజ్రాయెల్ విధ్వంసం సృష్టిస్తోందన్నమాట. హమాస్‌కు కొద్ది రోజుల క్రితమే ట్రంప్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. వారి దగ్గర బందీలుగా ఉన్న అందరినీ విడుదల చేయకుంటే గాజాస్ట్రీప్‌ను నాశనం చేస్తానని బెదిరించారు. కానీ, ఆ హెచ్చరికలను హమాస్ లెక్కచేయలేదు. ఫలితంగా నెతన్యాహు దాడుల ప్రతిపాదనకి ట్రంప్ ఓకే చెప్పారు. ఇక్కడ నెతన్యాహుకు హమాస్ అంతు చూడటం ఎంత ఇంపార్టెంటో ట్రంప్‌కు ఇరాన్ లెక్కసరిచేయడం అంతే కీలకం. పశ్చిమాసియాలో ఇరాన్ బలం, బలగం హమాస్, హౌతీ లు, హిజ్బుల్లా గ్రూపుల అంతంతోనే అది సాధ్యమవుతుంది. కాబట్టి నెతన్యాహును రెచ్చిపోమని పవర్స్ ఇచ్చారు. కానీ, ఇరాన్‌తో ట్రంప్‌కు ఉన్న వైరమేంటి?
ఇరాన్ అణ్వాయుధాలను అభివృద్ధి చేసుకోవడాన్ని నిలువరించేందుకు అమెరికా ప్రయత్నాలు చేస్తోంది. ఇదే అంశంపై ఇటీవల మాట్లాడిన ట్రంప్.. టెహ్రాన్‌తో చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. ఈ సందర్భంగా ఇరాన్‌కు సైన్యం, ఒప్పందం అనే రెండు మార్గాలను సూచించారు. అయితే, తాను ఒప్పందానికే ప్రాధాన్యం ఇస్తానని, టెహ్రాన్‌ను దెబ్బతీయడం ఇష్టం లేదని స్పష్టంచేశారు. కానీ, అగ్రరాజ్యంతో చర్చలు జరిపేందుకు తాము సిద్ధంగా లేమని ఇరాన్ అధ్యక్షుడు తేల్చి చెప్పారు. అంతేకాదు, ట్రంప్ ఏం చేసుకుంటారో చేసుకోవచ్చని ఓపెన్ సవాల్ చేశారు. ఇది ట్రంప్ ఇగోను దారుణంగా హర్ట్ చేసింది. దీంతో ఇరాన్ లెక్క తేల్చాలని డిసైడ్ అయ్యారు. అందులో భాగంగానే ఇరాన్ మద్దతు గ్రూపుల అంతు చూడటం మొదలుపెట్టారు. హౌతీల పనిపట్టే బాధ్యత తాను తీసుకుని, హమాస్ అంతుచూసే బాధ్యత నెతన్యాహుకు ఇచ్చారు. అంతా అనుకున్నట్టు జరిగితే త్వరలోనే ఇరాన్ అణు స్థావరాలపైనా భీకర దాడులు జరుగుతాయి. అదే జరిగితే అసలు సిసలు యుద్ధం మొదలయ్యేది అప్పుడే.. ఒక్కముక్కలో చెప్పాలంటే మిడల్ ఈస్ట్‌లో ఎండ్ గేమ్ మొదలైంది.