NTR.. A Brand: దేశ రాజకీయాలపై ఎన్టీవోడి బ్రాండ్…!
ఈ రోజుల్లో నాయకులంతా ఓటు బ్యాంకు రాజకీయాలతో, అధికారం కోసం అడు గులేసే వాళ్లే తప్ప... జనం కోసం, జన క్షేమం కోసం నిస్వార్థంగా పనిచేసిన వాళ్లు చాలా అరుదనే చెప్పుకోవాలి. తెలుగు నాట ఎన్టీఆర్ వేసిన బాటలో ఎందరో నాయకులు అన్ని పార్టీల్లో కనిపిస్తారు. ప్రాంతీయ పార్టీలు ఈ దేశంలో ఏ స్థాయిలో చక్రం తిప్పగలవో ఎన్టీఆర్ ఎప్పుడో నిరూపించారు.
నందమూరి తారకరామారావు రాజకీయాల్లోకి ప్రవేశించటం అనూహ్యం. సాధించిన విజయాలు అసామాన్యం. సామాన్యుడి కోసం వస్తున్నానంటూ ఆయన ఇచ్చిన పిలుపుకి తెలుగునాట ఊరూవాడా ఏకమై జనసంద్రమైంది. నేను తెలుగువాడిని.. నాది తెలుగుదేశం పార్టీ… అని ప్రకటించిన ఎన్టీఆర్ కు తెలుగు గడ్డ నీరాజనాలు పలికింది.
ఇందిరా గాంధీ ఒంటి చేత్తో దేశ రాజకీయాలను శాసిస్తున్న రోజులవి. అప్పట్లో ఆమెను రాజకీయంగా ఢీకొనడానికి ఎవరూ సాహసించని పరిస్థితి. అలాంటిది ఎన్టీఆర్ ప్రాంతీయ పార్టీని స్థాపించడంతో పాటు ఇందిరపైనే రాజకీయ యుద్ధం చేశారు. 1982లో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారు. చైతన్య రథంలో నేరుగా ప్రజల్లోకి వెళ్లి మొండిగా పోరాడారు. దారిలో ప్రజలందరికీ కనిపించడం కోసం మైళ్ల తరబడి వాహనంపై అలాగే కూర్చునేవారు. ఒక రోజు రాత్రిపూట రైల్వే గేటు వద్ద ఇనుప గేటు తగిలి ఆయన తలకు పెద్ద గాయమైంది. అయినా ఒక్క రోజు కూడా పర్యటన ఆపలేదు. అప్పటి వరకూ సినిమా హీరోగా సౌకర్యవంతమైన జీవితం గడిపిన ఆయన రాజకీయాల్లోకి వచ్చాక ఆ సౌకర్యాలన్నింటినీ పక్కన పెట్టారు.
రైట్ పర్సన్ ఇన్ రైట్ టైమ్ అనే మాటను అక్షరాలా నిజం చేస్తూ.. రాజకీయ శూన్యతను ముందే పసికట్టిన ఢిల్లీ నాయకుల్ని బెంబేలెత్తించి తెలుగోడి సత్తా చాటారు ఎన్టీఆర్. ఇప్పుడు రోడ్ షోల పేరుతో నేటి తరం రాజకీయ నేతలు చేస్తున్న ప్రచారానికి ఆద్యుడు ఎన్టీఆరే. చైతన్య రథమెక్కి ప్రచారం చేస్తూ.. ఎక్కడ గ్రామం కనిపిస్తే అక్కడే బహిరంగ సభ.. చైతన్య రథంలోనే పడక.. రోడ్డు పక్కనే స్నానపానాదులు.. అలా ఒక కొత్త ఒరవడికి ఎన్టీఆర్ తెరతీశారు. ఆయన వస్తున్నారంటే ఊళ్లకు ఊళ్లే తరలి వచ్చేవి. ఆయన రావడం ఆలస్యమైతే, రోజుల తరబడి ఎదురు చూసేవారు. పేదవాడే నా దేవుడు… సమాజమే నా దేవాలయం అంటూ ఎన్టీయార్ చేసిన ప్రసంగాలు ప్రజల మనసుల్లో బలంగా నాటుకు పోయాయి.
ఉభయ కమ్యూనిస్టు పార్టీలు… ఎన్టీఆర్‌పై ఒత్తిడి చేసి పొత్తులో భాగంగా పెద్ద సంఖ్యలో సీట్లు రాబట్టుకోవాలని ప్రయత్నించాయి. ఆ పార్టీలపై సానుకూల అభిప్రాయం ఉన్నా ఒక పరిమితికి మించి సీట్లు ఇవ్వడానికి ఆయన అంగీకరించలేదు. కమ్యూనిస్టు పార్టీలు 110 సీట్లు కోరగా… ఎన్టీఆర్ 60కి మించి ఇవ్వడానికి ఒప్పుకోలేదు. చివరకు ఆ పార్టీలతో పొత్తు లేకుండానే ఎన్నికల్లో పోటీ చేశారు. పార్టీ స్థాపించిన 9 నెలల్లోనే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి ముఖ్యమంత్రి అయ్యారు.
ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక ఏడాదిన్నర వ్యవధిలోనే కుట్ర పన్ని టీడీపీలో చీలిక తెచ్చి ఆయనను సీఎం పీఠం నుంచి దించివేశారు. అంతకు కొన్ని రోజుల ముందే అమెరికాలో ఆయన గుండెకు శస్త్ర చికిత్స చేయించుకుని రాష్ట్రానికి తిరిగొచ్చారు. కొన్ని రోజులు బయటకు కదలవద్దని వైద్యులు చెప్పినా… ప్రజలను చైతన్య పర్చడానికి రాష్ట్రమంతా తిరిగారు అప్పట్లో 30 రోజుల్లో మూడు సంపూర్ణ బంద్‌లు జరిగాయి. ఎన్టీఆర్ ప్రతిపక్ష పార్టీలను ఉద్యమంలోకి కూడగట్టగలిగారు. మెజారిటీ ఎమ్మెల్యేలు తనతోనే ఉండేలా చూసుకున్నారు. ఈ ఉద్యమం ఉధృతికి ఇందిరా గాంధీ సైతం దిగివచ్చి, నెల రోజుల్లోనే ఆయనను మళ్లీ ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోపెట్టారు. ఇది ప్రజాస్వామ్య పరిరణోద్యమం పేరుతో చరిత్రలో నిలిచిపోయింది.
ఉమ్మడి రాష్ట్రంలో సారా వ్యతిరేకోద్యమం ఉధృతంగా జరుగుతున్న సమయంలో టీడీపీ ప్రతిపక్షంలో ఉంది. అధికారంలోకి వస్తే సంపూర్ణ మద్యనిషేధం అమలు చేయడంతో పాటు తన మానస పుత్రిక అయిన రెండు రూపాయలకు కిలో బియ్యం పథకాన్ని మళ్లీ అమలు చేస్తానని ఎన్టీఆర్ ప్రకటించారు. రాష్ట్రానికి ఉన్న బడ్జెట్ పరిమితుల్లో ఈ రెండూ అమలు చేయడం సాధ్యం కాదని, ఒకదాని వల్ల వచ్చే ఆదాయం పోతుంటే, మరో దాని వల్ల ఖర్చు పెరుగుతుందని పార్టీ నేతలు ఆయనకు చెప్పారు. ఏదో ఒక హామీ ఇస్తే సరిపోతుందని వాదించారు. అయినా ఎన్టీఆర్ ఒప్పుకోలేదు. రెండు హామీలూ ప్రకటించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత రెండూ అమలు చేశారు. రాష్ట్రంలో సంపూర్ణ మద్య నిషేధం అమలు కావడం అదే ప్రథమం.
తెలుగు నాట కాంగ్రెస్‌తో పోటీపడగల మరొక పక్షం లేని స్థితిలో, తెలుగుదేశం పార్టీ అవతరించింది. బలమైన పార్టీ లేకపోవచ్చు కానీ, కాంగ్రెస్ మీద విముఖత 1970ల నుంచే పెరుగుతూ వచ్చింది. సంప్రదాయ భూస్వాములే అధికంగా ఉన్న ఓ సామాజికవర్గం ఆధిపత్యంలో కాంగ్రెస్ పార్టీ పునాదులు కూరుకుపోయి ఉన్నాయి. ఎన్టీయార్‌కు ముందు ఆంధ్రప్రదేశ్‌ను తొమ్మిది మంది ముఖ్యమంత్రులు పాలిస్తే వారిలో ఆరుగురు ఒకే సామాజికవర్గం వారు. మంత్రివర్గంలో కానీ, తక్కిన దిగువశ్రేణి నాయకత్వంలో కానీ దాదాపు ఇదే రకమైన నిష్పత్తి కొనసాగేది. ఇది వెనుకబడిన కులాలలో, వారిలో ఎదిగి వస్తున్న యువజనంలో తీవ్రమైన అసంతృప్తిని కలిగించింది. ఈ తరుణంలో ఏర్పడిన తెలుగుదేశం పార్టీ దుర్భేద్యంగా ఉన్న కాంగ్రెస్ సామాజిక సమీకరణను, ఓటుబ్యాంకును బద్దలు కొట్టే పోటీ సమీకరణను రచించింది. తెలుగుదేశం వ్యూహరచనలో మాజీ సోషలిస్టులు, సామాజిక వేత్తలు మంచి పాత్ర పోషించారు. సంప్రదాయ భూస్వామ్య, ప్రాబల్య శక్తులకు పోటీగా పేద, మధ్య తరగతి రెడ్లను, వెనుకబడిన కులాల వారిని, పార్టీ అభ్యర్థులుగా ఎంపిక చేయాలని, పట్టణ ప్రాంత విద్యావంతులలో ప్రతిష్ఠ పొందడానికి వీలుగా చదువుకున్నవారిని, న్యాయవాదులు, డాక్టర్లు వంటి ఉన్నత వృత్తిరంగాల వారిని పెద్ద సంఖ్యలో తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు.
1983 ఎన్నికల కోసం తెలుగుదేశం పార్టీ రూపొందించిన ఎన్నికల ప్రణాళికను చూస్తే, సమాజంలోని అనేక సామాజిక శ్రేణుల, వర్గాల ఆకాంక్షలను స్పృశించే వాగ్దానాలు కనిపిస్తాయి. కాంగ్రెస్‌కు అండగా నిలుస్తున్న దళితులను ఆకట్టుకోవడానికి కూడా ఆ మేనిఫెస్టో ప్రయత్నించింది. విద్యార్థులకు స్కాలర్‌షిప్పులు, రిజర్వేషన్లు, స్త్రీలకు ఆస్తిహక్కులో భాగం, మధ్యాహ్న భోజనం, రెండు రూపాయలకు కిలోబియ్యం వంటివి పార్టీ వాగ్దానాలు కాగా, ప్రచారంలో భాగంగా స్థానిక సమస్యలను ఎన్టీయార్ ప్రస్తావించారు. ఆనాటి ఆంధ్రప్రదేశ్ అంతటికీ పనికివచ్చే నినాదంగా ఆంధ్రుల ఆత్మగౌరవం, కేంద్రం వివక్ష అన్న నినాదాలను తీసుకున్నారు. అవినీతిని, దుర్మార్గ పాలనను అంతం చేయడం అన్నది ప్రధాన నినాదంగా మారింది. నాలుగు ప్రధాన రంగాలలో తప్ప రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తి ఉండాలని కూడా ఆ మేనిఫెస్టో భావించింది. పౌరహక్కులపై చర్చకు తెరలేపింది. పోలీసు తీరుతెన్నుల మీద పౌర నిఘా వ్యవస్థను ప్రతిపాదించింది. ఆశ్చర్యకరంగా విదేశాంగ విధానం గురించి కూడా నాటి తెలుగుదేశం పార్టీ తన వైఖరిని చెప్పింది. తెలుగు రాజకీయ సమాజంలోకి కొత్త వర్గాలకు ప్రాతినిధ్యాన్ని ఇచ్చినందుకు తెలుగుదేశం పార్టీని ప్రశంసించవలసిందే. మండల వ్యవస్థ ద్వారా అనేక అంచెల ప్రజాస్వామిక రాజకీయాలకు అవకాశం ఇవ్వడం, మొత్తంగా సమాజంలో రాజకీయ అవగాహనను పెంచడం తెలుగుదేశం సాధించిన విజయాలు. మురళీధర్ రావు కమిషన్ నుంచి, మండల్ సిఫార్సుల దాకా తెలుగుదేశం వైఖరి సామాజిక న్యాయం వైపే ఉంది. ఈ ఘనత ఎన్టీయార్‌దే. అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లు ఇచ్చే సమయంలో.. బాగా చదువుకున్న యువతకు, అప్పటిదాకా రాజకీయ అవకాశాలు అందని వెనుకబడిన వర్గాలకు ప్రాతినిధ్యం ఇచ్చి.. చట్టసభల్లో సామాన్యులు అడుగుపెట్టడానికి కారణమయ్యారు.
ఏసీ రూములు, కాన్ఫరెన్స్ హాళ్లలో మీటింగులు వంటివి అన్నగారి హయాంలో ఎక్కడా వినిపించలేదు. ఆయన ఎక్కడుంటే అక్కడే సచివాలయం. నిర్ణయాలు తీసుకోవడంలో మెరుపు వేగం ఎన్టీఆర్ సొంతం. ఓసారి నిజామాబాద్ జిల్లా పర్యటనలో ఉండగా శ్రీరాం సాగర్ ప్రాజక్టు ఫైల్‌ను ఇంజినీర్లు ఆయన దగ్గరకు తీసుకొచ్చారు. ఫైల్ చూడగానే… ఈ ప్రాజెక్టుతో ఎంత మంది రైతులకు లబ్ది కలుగుతుందని అధికారుల్ని అడిగారు. వాళ్లు ఇన్ని వేల ఎకరాలకు నీరంది.. లక్షలాది మంది రైతులకు లబ్ది చేకూరుతుందని చెప్పారట. అది విన్న అన్నగారు కనీసం ఖర్చెంత అవుతుందన్నది కూడా చూడకుండానే.. వెంటనే శ్రీరాం సాగర్ ప్రాజెక్ట్‌ను ఓకే చేసేశారు. ఇదీ ప్రజలకు మేలు చేయటంలో ఎన్టీఆర్‌కున్న నిబద్ధత. అంతేకాదు అప్పట్లో యాదగిరిగుట్టపై అక్రమాలు జరుగుతున్నాయని తెలిసి గంటలోనే ఈవోపై చర్యలు తీసుకున్నారు. ఓ మంత్రి కొన్న సెకండ్ హ్యాండ్ కారు గురించి కూడా ఎన్టీఆర్ ఆరా తీశారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం కాకుండా చూడటం కోసం అవినీతిపై ఆయన చాలా కఠినంగా ఉండేవారనడానికి ఈ ఘటనలు నిదర్శనాలు.
ఎన్టీఆర్ ప్రజాసంక్షేమానికి ఓ నిలువెత్తు రూపం. ప్రజల కోసం అందునా పేదల కోసం ఆయన వేసిన ప్రతి అడుగూ ఓ నూతన అధ్యాయం. పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దుతో పెత్తందారీ కబంధ హస్తాల నుంచి గ్రామాలకు విముక్తి కల్పించారు. మండలాల ఏర్పాటుతో ప్రజల ముందుకే పాలన తీసుకెళ్లారు. బడుగు, బలహీనవర్గాల్లో రాజకీయ చైతన్యం తెచ్చారు. ఎన్టీఆర్ రాజకీయంగా బీసీలకు పెద్దపీట వేశారు. మండల, జిల్లా స్థాయి పదవుల్లో రిజర్వేషన్లు కల్పించడం ద్వారా.. రాజకీయమంటే ఎరగని వారికీ మండల పరిషత్తు, జిల్లా పరిషత్తు అధ్యక్షులుగా అవకాశం కల్పించారు. ప్రజల ఆర్థిక సమస్యలు తీర్చడానికి, వారి బతుకులు మార్చడానికి ఎంతైనా రాయితీలు ఇవ్వాల్సిందే అని చెప్పిన ఆయన.. రెండు రూపాయలకే కిలో బియ్యం పథకం ద్వారా కోట్ల మందికి వరి బియ్యం అందించారు. ముఖ్యమంత్రిగా ఆయన ప్రవేశపెట్టి, అమలు చేసిన సంక్షేమ పథకాలు అన్ని వర్గాల ప్రజల జీవితాల్లో పెనుమార్పులకు కారణమయ్యాయి.
నా తెలుగింటి ఆడపడుచులు అంటూ ఆప్యాయంగా పిలిచే ఎన్టీఆర్.. పాలనలో మహిళా సాధికారతకు పెద్దపీట వేశారు. తండ్రి ఆస్తిలో సమానహక్కు కల్పించడం ద్వారా నారీలోకం మనసుల్లో అన్నగా కొలువుదీరారు. వరకట్న సమస్యను రూపుమాపేందుకు, సంఘంలో మహిళలకు గౌరవం కల్పించేందుకు ఈ చట్టం తెస్తున్నట్లు ఎన్టీఆర్ పేర్కొన్నారు. ఎన్టీఆర్ 1984లో ఆ చట్టం చేస్తే… కేంద్ర ప్రభుత్వం అలాంటి చట్టం తేవడానికి మరో 20 ఏళ్లు పట్టిందంటే ఆయన దూరదృష్టి ఏ స్థాయిదో అర్థం చేసుకోవచ్చు. మహిళా సంక్షేమానికి ఎన్టీఆర్ హయాంలో ప్రవేశపెట్టిన పథకాలు చరిత్రాత్మకంగా నిలిచాయి. ప్రభుత్వ ఉద్యోగాల్లోనూ మహిళలకు రిజర్వేషన్ కల్పించిన ఘనత ఆయనదే. చేయదగిన ప్రభుత్వ ఉద్యోగాల్లో 30% వారికే కేటాయించారు. ఉన్నత విద్యాసంస్థల్లో విద్యార్థినులకు 33% రిజర్వేషన్ కల్పించారు. మండల ప్రజాపరిషత్తు అధ్యక్షులు, జిల్లా ప్రజాపరిషత్తు ఛైర్మన్ పదవుల్లో 9 శాతాన్ని మహిళలకే కేటాయించారు. ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన మహిళలకు తెలుగు బాల మహిళా ప్రగతి ప్రాంగణాల ద్వారా వృత్తి విద్యా కోర్సుల్లో శిక్షణ ఇచ్చి, ఉపాధి అవకాశాలు కల్పించారు. మహిళలకు ఎన్నో పథకాలు ప్రారంభించిన ఎన్టీఆర్ వాటి అమలు కోసం ప్రత్యేక శాఖను ఏర్పాటు చేశారు.
సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు అనేదే ఎన్టీఆర్ నినాదం. పేదల ప్రాథమిక అవసరాలు తీర్చడమే కర్తవ్యంగా భావించారు. ఎన్టీఆర్ ఇచ్చిన హామీల అమలుకు రూ.1400 కోట్లు ఖర్చవుతుందని, అంత డబ్బు ఎక్కణ్నుంచి వస్తుందని ఎన్నికల సమయంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలోని మంత్రులు ఎద్దేవా చేశారు. పేదల కోసం రూ.1400 కోట్లు కాదు.. అవసరమైతే రూ.13,500 కోట్లయినా ఖర్చు చేస్తానని ఘాటుగా సమాధానమిచ్చిన ఎన్టీఆర్.. అధికారంలోకి వచ్చాకా దానికే కట్టుబడ్డారు. వృత్తి విద్యా కళాశాలల్లో క్యాపిటేషన్ ఫీజు రద్దు చేశారు. సీట్లు అమ్ముకోవడాన్ని నిషేధించారు. వాటిలో ప్రవేశాలకు ప్రతిభే కొలబద్ద కావాలన్నారు. ఇంజినీరింగ్, వైద్య కళాశాలల్లో ప్రవేశాలకు ఎంసెట్ విధానాన్ని తీసుకువచ్చారు. మండల స్థాయిలో పీహెచ్‌సీలు, 30 పడకల ఆసుపత్రుల్ని నిర్మించడంతో పాటు నిమ్స్‌ను సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిగా మార్చి అత్యున్నత వైద్య సేవల్ని అందించారు. సారా వ్యతిరేక ఉద్యమానికి మద్దతుగా నిలిచారు. హామీ ప్రకారం మద్యపాన నిషేధం అమలు చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో గురుకుల పాఠశాలలు నిర్మించి ఎస్సీ, ఎస్టీ, బీసీల్లోని పేద పిల్లలకు మెరుగైన విద్యను అందించారు. విద్యార్థులకు వసతిగృహాలను నిర్మించారు. దేశంలోనే తొలిసారిగా మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు.
పటేల్, పట్వారీ వ్యవస్థ రద్దు.. ఎన్టీఆర్ తీసుకున్న సాహసోపేత నిర్ణయం. పటేల్, పట్వారీ హయాంలో ఒకే భూమిని అయిదారుగురికి రాసి ఇవ్వడం, ఒకసారి పట్టాలిచ్చిన భూములకు మళ్లీ పట్టాలివ్వడం తదితర అక్రమాలు విచ్చలవిడిగా సాగేవి. ఒకే సర్వే నంబరును ఇద్దరికి ఇచ్చి తగవులు పెట్టడం, దానిపై మళ్లీ వారి దగ్గరకు వెళ్తే ఎంతో కొంత ముట్టజెప్పాల్సి రావడం జరిగేది. ఈ వ్యవస్థను రద్దు చేస్తూ.. 27 వేల రెవెన్యూ గ్రామాల్లో పనిచేసే 37 వేల మందికి పైగా పార్ట్‌టైమ్ గ్రామాధికారులను తొలగించారు. వారి స్థానంలో విలేజి అసిస్టెంట్లను నియమించారు.
ఆంధ్రప్రదేశ్‌లో అధికార వికేంద్రీకరణకు ఎన్టీఆర్ శ్రీకారం చుట్టారు. రాష్ట్ర ప్రభుత్వం అంటే కేవలం హైదరాబాద్‌లోనే లేదు. సామాన్య ప్రజానీకం వద్దకు పోయి.. పేదవాడి తలుపు తట్టి మీ సమస్యలేంటి అని తెలుసుకుని వాటిని పరిష్కరించాలి. ఆ భావంతోనే అధికార వికేంద్రీకరణ చేసి, ఎక్కడి వారికి అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు అందించినప్పుడే సక్రమమైన సంక్షేమం. అందుకే మండలాలను ఏర్పాటు చేశామని ఎన్టీఆర్ పేర్కొన్నారు. 1985 మే 25న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మాండలిక వ్యవస్థ మొగ్గ తొడిగింది. 305 తాలూకాలు, 1,084 రెవెన్యూ ఫిర్కాలను రద్దు చేస్తూ.. 1,104 రెవెన్యూ మండలాలు ఏర్పాటు చేశారు. మండలం యూనిట్‌గా గ్రామాల అభివృద్ధికి బాటలు వేశారు. దాన్ని ప్రజల ముందుకే పాలనగా అభివర్ణించారు. జిల్లా, మండల పరిషత్‌లతోపాటు, నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాలకు మొదటిసారి ప్రత్యక్ష విధానంలో ఎన్నికలు నిర్వహించారు. ప్రతి మండల కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, పశువైద్యశాల, వాణిజ్య బ్యాంక్, ప్రాథమిక సహకార పరపతి సంఘం, పోలీస్‌స్టేషన్, జూనియర్ కళాశాల, సబ్ ట్రెజరీ తదితర ప్రభుత్వ కార్యాలయాలు ఉండేలా రూపకల్పన చేశారు. మున్సిపల్ ఛైర్మన్ల నియామకానికి సంబంధించి మూడొంతుల్లో రెండొంతుల బలం ఉండాలన్న చట్టానికి సవరణ తెచ్చారు. సాధారణ మెజారిటీతోనే మున్సిపల్ పాలకవర్గాలను ఎంపిక చేయడానికి శ్రీకారం చుట్టారు.
మద్దతు ధర దక్కని చెరకు, వరి రైతులకు బోనస్ అందించే విధానానికి ఎన్టీఆరే శ్రీకారం చుట్టారు. చెరకు రైతులకు.. అప్పట్లో టన్నుకు రూ.250 ధర నిర్ణయించాలని కేంద్రానికి లేఖ రాస్తే రూ.140 చొప్పున ఇస్తామన్నారు. ఎన్టీఆర్ టన్నుకు రూ.65 అదనంగా ఇవ్వడం రైతు సంక్షేమంపై ఆయనకున్న శ్రద్ధకు నిదర్శనం. వరి రైతులకు కూడా ప్రోత్సాహం అందించారు. పొగాకు కొనుగోలు చేయించారు. పెద్ద పెద్ద సంస్థలు తమ ఉత్పత్తులకు ధర నిర్ణయించుకున్నట్లే.. రైతు కూడా పండించిన ధాన్యానికి తానే విలువ కట్టుకునే పరిస్థితి ఉండాలని ఎన్టీఆర్ ఆకాంక్షించారు. వ్యవసాయానికి ఉపయోగించే విద్యుత్తును హార్స్‌పవర్ రూ.50 చొప్పున ఇచ్చారు. చిన్న, సన్నకారు రైతులకు భూమి శిస్తు రద్దు చేశారు. తెలుగు గ్రామీణ క్రాంతి పథం ద్వారా బోర్లు, బావులు, చెరువుల్ని తవ్వించారు. అందులో 50% ఖర్చు ప్రభుత్వమే భరించింది. వాగులు, వంకల ద్వారా వృథా అవుతున్న నీటిని పొలాలకు మళ్లించే వందలాది ఎత్తిపోతల పథకాల్ని రైతులే నిర్మించుకున్నారు. సింగిల్ విండో సిస్టమ్ ద్వారా రైతులకు రుణాలు, ఎరువులు, రుణాలు అందేలా చర్యలు తీసుకున్నారు.
1983 ఏప్రిల్ 14న ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ప్రారంభించిన రెండు రూపాయలకు కిలో బియ్యం పథకం.. సంక్షేమ పథకాల చరిత్రలోనే ఓ పెను సంచలనం. పండగలు, పబ్బాలకు తప్ప తెల్లన్నం ముఖం చూడని పేద, దిగువ మధ్యతరగతి వర్గాల్లో ఈ పథకం చెరగని ముద్ర వేసింది. ఎన్టీవోడు ఇచ్చిన కిలో రెండు రూపాయల బియ్యమే తింటున్నాం, మరి ఇంకెవరికి ఓటేస్తాం అని ఎన్నికల సమయంలో వాడవాడలా మహిళలు గొంతెత్తారు. ఎన్నికల్లోనూ నీరాజనాలు పలికారు. ఈ పథకానికి రాయితీగా అప్పట్లోనే ఏడాదికి రూ.168 కోట్లు ఖర్చు చేశారు. బలహీనవర్గాల అభ్యున్నతికి పాటుపడిన అంబేడ్కర్ సంస్మరణార్థమే.. రెండు రూపాయలకే కిలో బియ్యం పథకాన్ని ప్రవేశపెట్టామని ఎన్టీఆర్ ప్రకటించారు. వార్షికాదాయ పరిమితిని పెంచి అధిక శాతం పేదల కుటుంబాలకు మేలు కలిగేలా చూశారు. తీవ్ర నిరాదరణకు గురవుతున్న గిరిజనుల సంక్షేమానికి ఎన్టీఆర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. గిరిజన ప్రాంతాల్లో అన్ని చిన్న ఉద్యోగాలు వారికే చెందేలా చేయడం వంటి సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. ఐటీడీఏలను బలోపేతం చేసి, ఐఏఎస్ అధికారుల్ని ప్రాజెక్టు అధికారులుగా నియమించారు. రాష్ట్రంలో ఎస్సీ రిజర్వేషన్లను 14 శాతం నుంచి 15 శాతానికి, ఎస్టీ రిజర్వేషన్లను 4 నుంచి 6 శాతానికి పెంచారు.
సామాన్యుడికీ ఇళ్లు నిర్మించడమే ప్రభుత్వ ధ్యేయం అని ఎన్టీఆర్ స్పష్టం చేశారు. ఎన్టీఆర్ పేదలందరికీ పక్కా ఇళ్ల నిర్మాణం చేపట్టారు. ఒక్కో ఇంటికి రూ.6 వేల చొప్పున ఇచ్చి, సిమెంటు, ఇటుకలతో కాలనీలుగా నిర్మించారు. ఇళ్లస్థలాలను కూడా సేకరించి ఇచ్చారు. రాజకీయాలంటే తెలియని అట్టడుగు వర్గాల్లోనూ ఎన్టీఆర్ చైతన్యం తెచ్చారు. ముఖ్యంగా వెనుకబడిన తరగతుల సంక్షేమానికి ఎంతో ప్రాధాన్యమిచ్చారు. వారికి విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు పెంచడంతో పాటు, స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ రిజర్వేషన్ అమలు చేశారు. దీంతో రాజకీయాల్లోకి పెద్ద ఎత్తున బీసీ నాయకులు వచ్చారు. సామాన్యులు కూడా మండలాధ్యక్షులుగా, జిల్లా పరిషత్ అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. రాష్ట్రంలో బీసీలకు విద్య, ఉద్యోగ రిజర్వేషన్లను 25% నుంచి 44%కు పెంచారు. హైకోర్టు తీర్పుతో ఇది అమలుకు నోచుకోకపోయినా బీసీల్లో చైతన్యం నింపింది. 1986లో ఒకేసారి బీసీ విద్యార్థులకు 300 వసతిగృహాలు ఏర్పాటుచేశారు. వారికి ఉపకారవేతనాలను రెట్టింపు చేశారు.
సగం ధరకే చీర, ధోవతి పథకం.. పేదలకు తక్కువ ధరకే దుస్తులు దొరకడంతో పాటు, ఆకలితో అలమటిస్తున్న చేనేత కార్మికులకు ఉపాధి కల్పించడం దీని పరమార్థం. చేనేత కార్మికులకు నూలు, రంగులు, రసాయనాలు రాయితీపై ఇవ్వడంతోపాటు.. వారు నేసిన వస్త్రాలను నేరుగా ప్రభుత్వం సేకరించేది. ఈ పథకం ఎంతో మంది చేనేత కార్మికుల్ని ఆకలి చావుల నుంచి రక్షించింది. చేనేతలకు మెషీన్‌లూమ్స్ అందించారు. ఇలా అన్నివర్గాలకు మేలు కలిగేలా సంక్షేమ పథకాలకు రూపకల్పన చేసిన ఎన్టీఆర్ పథకాలు.. ఇప్పటికీ పేర్ల మార్పుతో కొనసాగుతుండటమే ఆయన ముందుచూపుకు నిదర్శనం.
కాంగ్రెస్ కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ప్రతిపక్షాలను ఏకతాటిపైకి తీసుకురావడానికి కృషి చేశారు ఎన్టీఆర్. సైద్ధాంతికంగా వేర్వేరు దారుల్లో ఉన్న జనతాదళ్, బీజేపీ, వామపక్షాలు, వివిధ ప్రాంతీయ పార్టీల నేతలను కూడగట్టి సదస్సులు నిర్వహించారు. ఒక ప్రాంతీయ పార్టీ నేతగా ఉండి జాతీయ అధికార పార్టీపై పోరాటానికి అందరినీ కూడగట్టేందుకు ధైర్యం చేయడం ఎన్టీఆర్ ప్రత్యేకత. ఆయన కృషితో జాతీయ స్థాయిలో అన్ని ప్రతిపక్ష పార్టీలతో నేషనల్ ఫ్రంట్ ఏర్పాటైంది.
తెలుగునాట అన్న అంటే.. ఎన్టీఆర్ అన్నట్టుగా ఆ పదం ఆయనతో ముడిపడిపోయింది. ఎన్టీఆర్‌కు ముందు రాజకీయ నేతలను అన్న అని ప్రజలు ఆప్యాయంగా పిలుచుకున్న దాఖలాలు లేవు. ఎన్టీఆర్ తనకు తాను బహిరంగ సభల్లో ప్రజలకు అన్నగా పరిచయం చేసుకున్నారు.
ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశం, ఎన్నికల్లో పోరాడటం, గెలుపొందడం, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అన్నది సమైక్య ఆంధ్రప్రదేశ్, జాతీయ రాజకీయాల్లో గొప్ప ఘట్టాలు. ముఖ్యమంత్రిగా ఆయన ఎప్పుడూ పేదల పక్షపాతిగా వ్యవహరించారు. పేదలకు ఆయన హయాంలో అమలు చేసిన సంక్షేమ పథకాలే అందుకు ఉదాహరణ. తెలుగువాడి సత్తాను ఢిల్లీలో చాటిన ఎన్టీఆర్, కాంగ్రెసేతర పార్టీలను ఏకం చేశారు. ప్రతిపక్షాలను ఒక్కతాటిపైకి తీసుకొచ్చి, దేశ రాజకీయాల్లో చక్రం తిప్పారు. అవసరమైతే రాజకీయాలు కూడా చేయగలిగినా, తనకు ప్రజలకోసం పాటుపడటమే ముఖ్యమని నిరూపించారు. తెలుగునాట యుగపురుషుడిగా వెలిగారు.
1984లో ఇందిర దారుణ హత్యకు తరవాత జరిగిన ఎనిమిదో లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ 414 సీట్ల మెజార్టీతో ఘన విజయం సాధించింది. కానీ ఒక్క ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం టీడీపీ 30 స్థానాలు దక్కించుకుని, లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్షంగా నిలబడింది. దేశ లోక్‌సభ చరిత్రలో ఒక ప్రాంతీయ పార్టీ కేంద్రంలో ప్రధాన ప్రతిపక్షంగా గెలవడం అదే తొలిసారి. రాజకీయ కుట్రలను జనబలంతో తిప్పికొట్టిన ఎన్టీఆర్ పేరు కేంద్ర రాజకీయాల్లో మారుమోగింది. వారసత్వ రాజకీయాలకు నిలయమైన కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా.. దేశంలో ప్రతిపక్షాలను, వామపక్షాలను ఏకతాటిపైకి తీసుకువచ్చి.. ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా నేషనల్ ఫ్రంట్ ఏర్పాటులో కీలకంగా అడుగులేసి, జాతీయ శక్తిగా ఎదిగారు.
భారత దేశంలోని ప్రాంతీయ పార్టీలన్నిటినీ, కమ్యూనిస్టులతో కలిపి కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా నేషనల్ ఫ్రంట్ అనే ఒక సంకీర్ణాన్ని ఏర్పాటు చేయటంలో ఎన్టీఆర్ విజయం సాధించారు. ఈ రోజుల్లో నాయకులంతా ఓటు బ్యాంకు రాజకీయాలతో, అధికారం కోసం అడు గులేసే వాళ్లే తప్ప… జనం కోసం, జన క్షేమం కోసం నిస్వార్థంగా పనిచేసిన వాళ్లు చాలా అరుదనే చెప్పుకోవాలి. తెలుగు నాట ఎన్టీఆర్ వేసిన బాటలో ఎందరో నాయకులు అన్ని పార్టీల్లో కనిపిస్తారు. ప్రాంతీయ పార్టీలు ఈ దేశంలో ఏ స్థాయిలో చక్రం తిప్పగలవో ఎన్టీఆర్ ఎప్పుడో నిరూపించారు.