ANAKAPALLY NEGGEDEVARU : ఒకరు సీనియర్ – మరొకరు జూనియర్.. ఆ రెండు కులాల ఓట్లే టర్నింగ్ పాయింట్

అనకాపల్లి నియోజకవర్గం (Anakapalli Constituency) రాజకీయ కురుక్షేత్రం (Politics Kurukshetra). పార్టీల వ్యూహాల కంటే తలపండిన నేతల ఎత్తుగడలే ఫలిస్తుంటాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: May 29, 2024 | 02:05 PMLast Updated on: May 29, 2024 | 2:05 PM

One Is Senior The Other Is Junior Those Two Caste Voters Are The Turning Point

 

అనకాపల్లి నియోజకవర్గం (Anakapalli Constituency) రాజకీయ కురుక్షేత్రం (Politics Kurukshetra). పార్టీల వ్యూహాల కంటే తలపండిన నేతల ఎత్తుగడలే ఫలిస్తుంటాయి. పొలిటికల్ (Political) కాలిక్యులేషన్ల కంటే సామాజిక ఈక్వేషన్లకే అక్కడ ప్రియారిటీ. అలాంటి కీలక స్ధానంలో సీనియర్‍ వెర్సస్ జూనియర్ మధ్య పోరు జరిగింది. జనసేన (Jana Sena) అనుభవానికి పట్టం కడితే… వైసీపీ (YCP) ప్రయోగంతో సరిపెట్టింది. బౌన్స్ బ్యాక్ అయిన మాజీ మంత్రికి మొదటి నుంచి అన్నీ మంచి శకునాలే ఎదురైతే…అధికార పార్టీ అభ్యర్ధి హైకమాండ్ ఆశీస్సులపైనే ఆధారపడ్డారు. పేరుతోనే ఫిదా చేసే అనకాపల్లిలో బెల్లం తీపి రుచి చూసేది ఎవరు…? అక్కడ నెగ్గేదెవరు ?

అనకాపల్లి…ఉత్తరాంధ్ర నియోజకవర్గాల్లో కీలకమైనది. శారదానది ఒడ్డున ఉన్న ఈ నియోజకవర్గం…వ్యవసాయ ఆధారిత ఉత్పత్తులకు ప్రసిద్ధి. దేశంలోనే రెండో అతి పెద్ద బెల్లం తయారీ కేంద్రం ఉంది. సామాజిక, రాజకీయంగా చైతన్యవంతమైన ఈ నియోజకవర్గానికి మొదటిసారి 1952లో ఎన్నికలు జరిగాయి. కుటుంబ ఆధిపత్య రాజకీయాలకు కేరాఫ్ గా నిలిచే అనకాపల్లిలో సుదీర్ఘకాలం కాంగ్రెస్, టీడీపీ మధ్య హోరాహోరీ పోరు నడిచింది. మాజీమంత్రులు దాడి వీరభద్రరావు, కొణతాల రామకృష్ణ ఇక్కడ చక్రం తిప్పారు. వీళ్ళద్దరూ రాజకీయ ప్రత్యర్ధులుగా ఉన్నంతకాలం మరొకరికి ఛాన్స్ లేకుండా పోయింది. ఐతే, అనకాపల్లి పొలిటిక్స్ 2009 కంటే ముందు…ఆ తర్వాత అనే విధంగా మారాయి. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత ముఖ్య నాయకత్వం బలహీనపడింది. సీనియర్ నేతలు కొణతాల, దాడి వీరభద్రరరావుకి నియోజకవర్గంపై పట్టు సడలింది. సామాజికంగా బలమైన ఓట్ బ్యాంక్ కలిగిన మునగపాక మండలం యలమంచిలి నియోజకవర్గంలో కలిసిపోయింది.

దీంతో అప్పటి వరకు గవర సామాజిక వర్గం రాజకీయాలను శాసించిన చోట…కాపుల ఓటు బ్యాంక్ పెరిగింది. 2009 ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా.. ట్రయాంగిల్ ఫైట్ కారణంగా కొణతాలకు ఓటమి తప్పలేదు. రెండున్నర దశాబ్ధాల కాలంలో అనకాపల్లి రాజకీయాలు అనేక మార్పులు జరిగాయి. ఓటమి తర్వాత ప్రత్యక్ష రాజకీయాలకు దూరమైన కొణతాల…ఉత్తరాంధ్ర చర్చ వేదిక ద్వారా అభివృద్ధిపై దృష్టి పెట్టారు. టీడీపీలో పట్టున్న దాడి కుటుంబం సాంప్రదాయ రాజకీయాలు చేస్తూనే రెండు సార్లు వైసీపీలోకి ఇన్ అండ్‌ అవుట్ అయ్యింది.

2014లో పీలా గోవింద సత్యనారాయణ, 2019లో వైసీపీ తరపున గుడివాడ అమర్నాథ్ గెలిచారు. ఈ రెండు ఎన్నికల్లోనూ టీడీపీ గవర సామాజిక వర్గం ఓటర్లను నమ్మితే….వైసీపీ కాపుల వైపు గురిపెట్టింది. ఐదేళ్ళు తిరిగేసరికి అనకాపల్లిలో లెక్కలన్నీ మారాయి. కాపు, గవర సామాజిక వర్గాలు…ఏకతాటిపైకి వచ్చాయి. రాజకీయ ఎత్తుగడల కోసం…ఎత్తులు వేసుకుంటే జరిగే నష్టం ఎంత తీవ్రంగా వుంటుందో సీనియర్ నేతలు కొణతాల, దాడికి తెలుసొచ్చింది. దీంతో ఈ ఎన్నికల్లో కలిసికట్టుగా పని చేశారు. మాజీ మంత్రి కొణతాల పొలిటికల్ రీ-ఎంట్రీ., రాజకీయ ప్రత్యర్ధి అయిన దాడి ఫ్యామిలీని కలుపుకోవడం సహా…ఈ దఫా ఎన్నికల్లో అనేక కీలక పరిణామాలు జరిగాయి. కూటమి బలపరిచిన అభ్యర్ధిగా మాజీమంత్రి కొణతాల… వైసీపీ తరపున రాజకీయాలకు పూర్తిగా కొత్తైన మలసాల భరత్ తో పోటీకి దిగారు. ప్రచారం నుంచి పోలింగ్ వరకూ టఫ్ ఫైట్‍ విశ్లేషణలు జరిగాయి. చివరికి ఓటరు మాత్రం సీనియారిటీ, నిబద్ధతకు ఓటేసినట్టు కనిపిస్తోంది.

GVMCలోని ఐదు డివిజన్లు, అనకాపల్లి, కశింకోట మండలాల పరిధిలో అనకాపల్లి నియోజకవర్గం విస్తరించి ఉంది. ఇక్కడ మహిళ ఓటర్లదే ఆధిపత్యం. మొత్తం 2 లక్షల 13 వేల మంది ఓటర్లు ఉన్నారు. ఈసారి లక్షా 70 వేల ఓట్లు పోలయ్యాయి. అంటే 79.82 శాతం పోలింగ్‌ నమోదైంది. 2019 ఎన్నికలతో పోలిస్తే…ఈసారి నమోదైన ఓటింగ్ రెండు శాతం ఎక్కువ. పార్టీ బలాబలాల కంటే అభ్యర్ధి వ్యక్తిత్వం, సామాజిక సమీకరణాలు, స్ధానిక రాజకీయ పరిణామాలు ఎన్నికలను ప్రభావితం చేస్తాయి. కాపు, గవర సామాజిక వర్గం ఓటు బ్యాంక్ కీలకం. వాళ్ళు ఎటు వైపు మొగ్గితే ఫలితం అటే ఉంటుందనేది విశ్లేషణ. 2009, 2014, 2019లో అది నిజమైంది. 45 శాతంగా ఉన్న కాపు, 30 శాతంగా ఉన్న గవర్లే గెలుపోటములను డిసైడ్‌ చేస్తారు. పవన్ కళ్యాణ్ ఇమేజ్‌తో…కాపులు జనసేన వైపు మొగ్గు చూపించినట్లు తెలుస్తోంది. కొణతాల అభ్యర్ధిత్వంతో గవర్లు కూడా ఎన్డీయే కూటమికే మద్దతు పలికినట్టు అంచనాలు ఉన్నాయి. వైసీపీ అభ్యర్ధి మలసాల భరత్… ఓటర్లను పెద్దగా ఆకట్టుకోలేకపోయారనేది ఓటింగ్ ప్యాట్రన్ చూస్తే అర్ధం అవుతోంది. కేవలం పార్టీ ఇమేజ్, జగన్మోహన్ రెడ్డి చరిష్మా వల్లే గట్టెక్కాస్తాననే ధీమాతో ఆయన ఉన్నారు. ప్రచారం నుంచి పోల్ మేనేజ్‌మెంట్‌ వరకు కొణతాల రామకృష్ణకు మంచి అనుభవం ఉంది. ఆయనకు దాడి లాంటి సీనియర్ల చేయూత లభించింది.

దీంతో పాజిటివ్ టాక్… అనుకున్న దాని కంటే వేగంగా వచ్చింది. అదే వైసీపీ అభ్యర్ధి భరత్ విషయంలో వివిధ కారణాలతో వ్యతిరేకత కనిపించింది. ఈ నియోజకవర్గంలో రైతులు పండించిన పంటలు నిల్వ చేసుకోవడానికి కోల్డ్ స్టోరేజీలు లేవు. దీంతో రైతులు…తమ ఉత్పత్తులకు సరైన ధర రావట్లేదు. వీటన్నింటినీ ప్రచారాస్త్రాలుగా చేసుకోవడంలో కూటమి సక్సెస్ అయింది. జగన్‌ ఇమేజ్‌, సంక్షేమ పథకాలు, బలమైన కేడర్ తనను గట్టెక్కిస్తాయనే ధీమాతో ఉన్నారు. ఇక్కడ అభ్యర్ధుల బలాలు, బలహీనతలు చర్చనీయాంశమే. వైసీపీ అభ్యర్ధిది తూర్పు కాపు సామాజిక వర్గం. అనకాపల్లిలో అత్యధికంగా ఉన్న కాపుల ఓట్లు బ్రేక్ చేయడం, స్థానిక నాయకత్వానికి ఛాన్స్ ఇచ్చామని అధికార పార్టీ భావించింది. అభ్యర్ధి విషయంలో పార్టీ ఎంత అడ్వాంటేజ్ ఉందో….వ్యక్తిగతంగా అదే స్ధాయిలో మైనస్‌లు ఉన్నాయి. మలసాల భరత్ రాజకీయాలకు కొత్త. అమెరికాలో వ్యాపారాలు చేసిన ఆయన… వైసీపీ తరపున పోటీ చేశారు. అయితే జనంలో ఎలాంటి వ్యతిరేకత లేకపోవడం భరత్‌కు కలిసొచ్చే అంశం. నియోజకవర్గం ప్రజలతో పెద్దగా పరిచయాలు లేకపోవడం మైనస్‍. ప్రత్యర్థి బలమైన వ్యక్తి కావడం భరత్‌ గట్టి పోటీని ఎదుర్కొంటున్నారు. మంత్రి అమర్నాథ్‌…గాజువాకకు షిఫ్ట్ అవ్వడంతో అనకాపల్లిలో వైసీపీ నాయకత్వం మనస్ఫూర్తిగా భరత్ కు సహకరించలేదని ప్రచారంలో ఉంది. కొణతాల రామకృష్ణకు సీనియారిటీ, సింపతీ ఉన్నాయి.

పార్లమెంట్ సభ్యులుగా, శాసన సభ్యుడిగా గతంలో పనిచేసిన అనుభవం వుంది. 40 ఏళ్లకు పైగా రాజకీయ జీవితంలో వేలెత్తి చూపించే పరిస్ధితి ఎన్నడూ రాలేదు. టీడీపీ, బీజేపీ మద్దతు ఆయనకు కలిసొచ్చే అంశంగా మారనుంది. అనకాపల్లి రాజకీయాలకు ఓ సెంటిమెంట్ కూడా వుంది. ఇక్కడ గెలిచిన నేతలకు మంత్రులుగా ప్రమోషన్ లభించడం ఆనవాయితీ. ఇక్కడి నాలుగుసార్లు గెలిచిన దాడి వీరభద్రరావు కీలక శాఖల మంత్రిత్వ బాధ్యతలు వహించారు. 2004లో గెలిచిన కొణతాల…కాంగ్రెస్‌ ప్రభుత్వంలో తిరుగులేని నేతగా వెలుగు వెలిగారు. కీలకమైన వాణిజ్య పన్నులశాఖ మంత్రిగా పనిచేశారు. గంటా శ్రీనివాస్‌కు అనూహ్యంగా అమాత్యయోగం లభించింది. 2019లో గెలిచిన గుడివాడ అమర్నాథ్‌కు మంత్రి పదవి దక్కింది. ఈసారి ఎన్నికల ఫలితాలు…కూటమి లెక్కలకు అనుకూలంగా వస్తే కొణతాలకు మరోసారి చాన్స్ వస్తుందని ఆయన వర్గం గట్టిగా నమ్ముతోంది. దీంతో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది.