One Nation-One Election: ఒకే దేశం-ఒకే ఎన్నిక కోసం పార్లమెంటులో బిల్లు.. మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌తో కమిటీ..!
దేశంలోని అన్ని రాష్ట్రాలకు, పార్లమెంటుకు ఒకేసారి ఎన్నికలు జరగాలని మోదీ ప్రభుత్వం కోరుకుంటోంది. దీని సాధ్యాసాధ్యాలపై పరిశీలనకు ఏర్పాటు చేసిన రామ్‌నాథ్ కోవింద్ కమిటీని బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నద్దా కలిశారు. ఎన్నికల ప్యానెల్ ఏర్పాటుపై చర్చించారు.
One Nation-One Election: మోదీ ప్రభుత్వం ఎప్పటినుంచో కోరుకుంటున్న వన్ నేషన్-వన్ ఎలక్షన్ (జమిలి ఎన్నికలు) కోసం రంగం సిద్ధమవుతోంది. ఈ దిశగా మోదీ ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. దీనికోసం మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అధ్యక్షతన కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసింది.
దేశంలో సాధారణంగా ఒక్కో రాష్ట్రానికి, ఒక్కోసారి ఎన్నికలు జరుగుతుంటాయి. వివిధ రాష్ట్రాల అసెంబ్లీలకు, పార్లమెంటుకు వేర్వేరుగా ఎన్నికలు జరుగుతున్నాయి. గతంలో అన్ని ఎన్నికలు ఒకేసారి జరిగినప్పటికీ, నెమ్మదిగా ఈ విధానం మారుతూ వచ్చింది. ప్రస్తుతం కొన్ని రాష్ట్రాలకు మాత్రమే పార్లమెంటుతోపాటు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ పద్ధతి మార్చాలని బీజేపీ ప్రభుత్వం భావిస్తోంది. దేశంలోని అన్ని రాష్ట్రాలకు, పార్లమెంటుకు ఒకేసారి ఎన్నికలు జరగాలని మోదీ ప్రభుత్వం కోరుకుంటోంది. ఈ అంశంపై చర్చించేందుకు ఈ నెల 18 నుంచి 22 వరకు ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని బీజేపీ నిర్ణయించింది. దీని సాధ్యాసాధ్యాలపై పరిశీలనకు ఏర్పాటు చేసిన రామ్‌నాథ్ కోవింద్ కమిటీని బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నద్దా కలిశారు. ఎన్నికల ప్యానెల్ ఏర్పాటుపై చర్చించారు.
ఆరు సవాళ్లు..
ఒకే దేశం-ఒకే ఎన్నిక విధానాన్ని అమలు చేయాలంటే కేంద్రానికి ఆరు అంశాలు సవాలుగా మారాయి. దీనికోసం రాజ్యాంగంలోని అధికరణల్ని మార్చాల్సి ఉంటుంది. అవి 1.పార్లమెంట్ పదవీ కాలాన్ని నిర్వచించే ఆర్టికల్ 83 2.పార్లమెంటును రద్దు చేసే ఆర్టికల్ 85 3.అసెంబ్లీ పదవీ కాలాన్ని నిర్వచించే ఆర్టికల్ 172 4.రాష్ట్రాల అసెంబ్లీలు రద్దు చేసే ఆర్టికల్ 174 5.రాష్ట్రపతి పాలన విధించే ఆర్టికల్ 356 6.పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదరాలి ఇలాంటి కీలక అధికరణాల్ని సవరిస్తేనే జమిలి ఎన్నికలు సాధ్యమవుతాయి. ఈ మేరకు అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు, పార్టీల అభిప్రాయాలు తీసుకోవాల్సి ఉంది. ఈ అధికరణల్ని మార్చే విషయంలో రాజ్యాంగం ఏ మేరకు అనుమతిస్తుంది అనే విషయంలోనూ నిపుణుల నుంచి సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
బిల్లు ప్రవేశపెడతారా..?
ఈ నెలలో జరగనున్న ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో జమిలి ఎన్నికల కోసం ప్రభుత్వం బిల్లు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ప్రభుత్వం ఇంకా రాబోయే పార్లమెంట్ సమావేశాల ఎజెండాను ప్రకటించలేదు. రెండు, మూడు రోజుల్లో సమావేశాల ఎజెండా ప్రకటిస్తామని పార్లమెంట్ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి వెల్లడించారు. అలాగే యూసీసీ (యునిఫాం సివిల్ కోడ్) బిల్లును కూడా ప్రవేశపెట్టొచ్చనే ప్రచారం జరుగుతోంది. ఈ బిల్లులు ప్రవేశపెట్టడం సులభమే కానీ.. వీటిని ఆమోదించుకోవడం కష్టమైన పని. ఎందుకంటే వన్ నేషన్-వన్ ఎలక్షన్ బిల్లు పాస్ కావాలంటే రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుంది. దీనికోసం పార్లమెంటులో లోక్‌సభలోని 543 స్థానాలకుగాను, కనీసం 67 శాతం ఓట్లు అనుకూలంగా రావాలి. అలాగే రాజ్యసభలోని 245 స్థానాల్లో కూడా 67 శాతం ఓట్లు రావాలి. అలాగే దేశంలోని సగం రాష్ట్రాల అసెంబ్లీలు ఈ బిల్లుల్ని ఆమోదిస్తూ తీర్మానం చేయాలి. దీని ప్రకారం 28 రాష్ట్రాలకుగాను కనీసం 14 రాష్ట్రాలు ఆమోదం తెలపాలి. బీజేపీ ప్రస్తుతం 10 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. బీజేపీకి అనుకూలంగా ఉండే ఏపీ, ఒడిశాలాంటి రాష్ట్రాలు మరో ఆరున్నాయి. రాష్ట్రాల అసెంబ్లీలు తీర్మానం చేసే విషయంలో పెద్దగా ఇబ్బంది ఉండదు. అయితే, పార్లమెంటులోని 67 శాతం ఓట్ల విషయంలోనే కాస్త ఇబ్బంది. ప్రస్తుతం బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీయేకు లోక్‌సభలో 333 మంది సభ్యుల మద్దతు ఉంది. అంటే ఇది 61 శాతం కాగా, మరో ఆరు శాతం ఓట్లు సాధించాలి. ఇది కొంచెం కష్టమైన విషయమే. రాజ్యసభలో బీజేపీకి 33 మంది సభ్యులు మాత్రమే ఉన్నారు.
ఖరీదైపోతున్న ఎన్నికలు
దేశంలో ఎన్నికల నిర్వహణ వ్యయం ప్రతిసారీ పెరుగుతూనే వస్తోంది. అటు ప్రభుత్వానికి కూడా ఎన్నికల నిర్వహణ వ్యయం పెరుగుతోంటే.. రాజకీయ పార్టీలు ఎన్నికల్లో ఖర్చుపెట్టే నిధుల సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు పార్టీలు వేర్వేరుగా ఖర్చు చేయాల్సి వస్తోంది. ప్రభుత్వానికి కూడా వేర్వేరుగా ఎన్నికలు నిర్వహించడం భారంగా మారుతోంది. ఈ సమస్యకు జమిలి ఎన్నికలే పరిష్కారమని బీజేపీ అభిప్రాయం. దీనివల్ల అటు ప్రభుత్వానికి, ఇటు పార్టీలకు ఖర్చు తగ్గుతుందని మోదీ ప్రభుత్వం చెబుతోంది. ప్రజలు, రాజకీయ నేతలు, అధికారుల సమయం కూడా ఆదా అవుతుంది. రాజకీయాలపై కాకుండా.. పాలనపై మరింత ఎక్కువ సమయం దృష్టిపెట్టే అవకాశం దొరుకుతుంది.