Pawan Kalyan: ఓన్లీ షూటింగ్స్.. నో పాలిటిక్స్.. బీజేపీ వార్నింగ్‌కు పవన్ భయపడ్డారా.?
ఎప్పుడు ఏం చేస్తారో.. ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో.. ఎందుకు అలాంటి నిర్ణయాలు తీసుకుంటారో.. అంతెందుకు ఏం మాట్లాడతారో కూడా పవన్‌కు క్లారిటీ ఉండదు అనే బ్యాడ్ నేమ్ ఉంది రాజకీయాల్లో ! వన్ ఫైన్ డే.. మైక్ ముందుకు వస్తారు.. నాలుగు బుక్కుల పేర్లు.. ఆ పుస్తకాల్లో ముచ్చట్లు చెప్పడం.. వైసీపీని తిట్టడం.. పొత్తుల మీద కన్ఫ్యూజన్‌లో పెట్టడం.. ఆ తర్వాత పత్తా లేకుండా పోవడం.. ఇదే తీరు పవన్‌కల్యాణ్‌ది ప్రతీసారి! పవన్ పార్ట్‌టైమ్ పొలిటిషన్ అని వైసీపీ అనేది అందుకే మరి! జనసేన ఆవిర్భావ దినోత్సవం రోజు పవన్ చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. ఎట్టి పరిస్థితుల్లోనూ వైసీపీని గెలవనిచ్చేది లేదని.. ప్రయోగాల జోలికి పోనని.. టీడీపీతో దోస్తీ ఖాయం అన్నట్లుగా మాట్లాడారు.
కట్ చేస్తే.. సేనాని పత్తాకు లేకపాయె ! పొత్తుల గురించి చెప్పడం లేదు.. రాజకీయ ఎత్తుల మాటే ఎత్తడం లేదు. ఆ మధ్య ఢిల్లీకి వెళ్లారు. బీజేపీ పెద్దలతో కలిశారు. ఆ తర్వాత పూర్తిగా సైలెంట్ అయిపోయారు. ఇంకా చెప్పాలంటే.. మాయం అయిపోయారు. ఇదే ఇప్పుడు ఏపీ రాజకీయవర్గాల్లో కొత్త అనుమానాలకు తావిస్తోంది. ఓన్లీ షూటింగ్స్.. నో పాలిటిక్స్ అంటున్నారు. వరుస పెట్టి సినిమాలు చేస్తున్నారు.
OGతో పాటు హరహర వీరమల్లు, సాయిధరమ్‌తో మూవీ.. ఇలా రాబోయే నెలల పాటు పవన్ షూటింగ్‌ల్లో బిజీగానే ఉండబోతున్నారు. రాజకీయాల గురించి మాట్లాడుతున్నారు కానీ.. అర్థం లేని, సంబంధం లేని విషయాలు ప్రస్తావిస్తున్నారు. ఏపీ, తెలంగాణ మంత్రుల మాటల యుుద్ధంలో వేలు పెట్టి.. మాటలు పడ్డారు అనవసరంగా! ఇదంతా ఎలా ఉన్నా.. పవన్ సైలెన్స్ వెనక బీజేపీ బెదిరింపే కారణమా అనే చర్చ సాగుతోంది. టీడీపీ, జనసేన పొత్తును అడ్డుకునే ప్రాసెస్‌లో.. పవన్‌ను పిలిపించుకొని మరీ కమలం పార్టీ పెద్దలు వార్నింగ్ ఇచ్చారా.. అందుకే పవన్ సైలెంట్ అయిపోయారా అంటే.. కాదు అని టక్కున చెప్పలేని పరిస్థితి.
టీడీపీ నేతలు చెప్తోంది కూడా అదే ! టీడీపీ వైపు పవన్ వెళ్లకుండా ఆపే ప్రయత్నాలు బీజేపీ చేస్తోందనే వాదన ఉంది. టీడీపీతో పొత్తు ప్రతిపాదన గురించే.. ఢిల్లీ పర్యటనలో బీజేపీ పెద్దలకు పవన్ వివరించారని.. దానికి వాళ్లు సుముఖంగా లేరు అని.. అందుకే క్లారిటీ ఇవ్వలేదని తెలుస్తోంది. విషయం తేలేంత వరకు సైలెంట్‌గా ఉండాలని కాస్త స్ట్రాంగ్‌గానే పవన్‌కు చెప్పారని.. అందుకే షూటింగ్స్ తప్ప పవన్ పాలిటిక్స్ పట్టించుకోవడం లేదన్నది మెజారిటీ వర్గాల అభిప్రపాయం. ఇదే పరిస్థితి కొన్నాళ్ల పాటు కొనసాగే అవకాశాలు ఉన్నట్లు కనిపిస్తోంది.
బీజేపీని కలుపుకోవడం టీడీపీకి ఇష్టమే.. ఐతే సైకిల్‌తో ప్రయాణం కమలానికి నచ్చట్లేదు. జనసేనానికి సీఎం పదవి ఇస్తే పొత్తుకు సిద్ధం అంటోంది బీజేపీ. ఇలాంటి పరిణామాల మధ్య కమలాన్ని వదులుకునేందుకు చంద్రబాబు ఇష్టపడడం లేదు. తిరిగి తిరిగి రాజకీయం ఒకే దగ్గర ఆగిపోయింది. పవన్ నిర్ణయం మీదే ఏపీ రాజకీయం ఆధారపడి ఉంటుంది. ఐతే ఆయన సైలెన్స్ అయ్యేలా బీజేపీ కీ ఇచ్చినట్లు కనిపిస్తోంది. ఇదే పరిస్థితి ఇంకొన్నాళ్లు కొనసాగే అవకాశం ఉంది. పార్టీల సంగతి ఎలా ఉన్నా.. తమ నాయకుడు ఎటు అని క్షేత్రస్థాయిలో కార్యకర్తలు అమాయకంగా దిక్కులు చూస్తున్న పరిస్థితి.