తెలంగాణలో ఐఏఎస్… సీఎం మధ్య ఓపెన్ వార్

తెలంగాణలో ఐఏఎస్ ఐపీఎస్ లకు ముఖ్యమంత్రికి మధ్య యుద్ధం జరుగుతోందా.? సీఎం రేవంత్ రెడ్డి ఏకంగా ఓపెన్ మీటింగ్ లో ఐఏఎస్ లను ,ఐపీఎస్ లను టార్గెట్ చేస్తూ విమర్శలు చేయడం సంచలనం రేపింది

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 22, 2025 | 04:45 PMLast Updated on: Feb 22, 2025 | 4:45 PM

Open War Between Ias And Cm In Telangana

తెలంగాణలో ఐఏఎస్ ఐపీఎస్ లకు ముఖ్యమంత్రికి మధ్య యుద్ధం జరుగుతోందా.? సీఎం రేవంత్ రెడ్డి ఏకంగా ఓపెన్ మీటింగ్ లో
ఐఏఎస్ లను ,ఐపీఎస్ లను టార్గెట్ చేస్తూ విమర్శలు చేయడం సంచలనం రేపింది.ఒక ముఖ్యమంత్రి తనతో పని చేసే ఐఏఎస్లను ఐపీఎస్ లను ఇలా ఓపెన్ గా విమర్శించడం తెలుగు రాష్ట్రాల చరిత్రలోనే మొట్టమొదటిసారి. క్లోజ్ డోర్ మీటింగ్స్ లో ఐఏఎస్ ల పెర్ఫామెన్స్ పై కామెంట్స్ చేయవచ్చు. వాళ్ళని బదిలీలు చేయొచ్చు. వార్నింగ్స్ ఇవ్వవచ్చు. కానీ ఇలా ఓపెన్ మీటింగ్లో ఐఏఎస్ ల పై విమర్శలు చేయడం ఆశ్చర్యం కలిగిస్తుంది. దీంతో ముఖ్యమంత్రి కి ఉన్నతాధికారులకి మధ్య ఎక్కడో సమన్వయ లోపం ఉందనే విషయం బయటపడిపోయింది. ముఖ్యమంత్రి ఓపెన్ గా విమర్శలు చేయడంతో ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా బహిరంగంగానే మాట్లాడేస్తున్నారు.

రేవంత్ కుటుంబ సభ్యులు, మిత్రులు తమకు నేరుగా ఆదేశాలిస్తున్నారని. వాటిని అమలు చేయకపోవడం వల్లనే సీఎం ఇలా ఇన్ డైరెక్ట్ గా విరుచుకుపడు తున్నారని ఆరోపిస్తున్నారు బ్యూరోక్రాట్స్. ముఖ్యమంత్రికి సన్నిహితంగా ఉండే ఉదయ సింహారెడ్డి, ఫయీమ్ అనే రాజ్యాంగేతర శక్తులు, మరికొందరు వ్యక్తులు సెక్రటేరియట్లో, సి ఎం ఓ లో అధికారులను నేరుగా ఆదేశించడంపై బ్యూరోక్రాట్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వంలో సమాంతరంగా ఒక రహస్య వ్యవస్థ నడుస్తోందని ఏ ఫైల్ పై సంతకం చేయాలో, ఏ ఫైల్ ముందుకు తీసుకురావాలో, దేన్ని తొక్కి పెట్టాలో కొందరు ప్రైవేటు వ్యక్తులు నిర్ణయిస్తున్నారని ఐఏఎస్లు ఐపీఎస్లు ఓపెన్ గానే మాట్లాడేసుకుంటున్నారు. అంతేకాదు ఈ ప్రైవేట్ వ్యక్తులు అధికారులను బెదిరిస్తున్నారని కూడా ఆరోపణలు వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితి ఎన్నడూ చూడలేదని ఐఏఎస్ లు, ఐపీఎస్లు వాపోతున్నారు. ఇదంతా నాణానికి ఒకవైపు.

మరోవైపు ఐఏఎస్ లో ఐపీఎస్ ల అవినీతి కుప్పలు తెప్పలుగా బయటపడుతుంది. అమయి కుమార్ లాంటి ఐఏఎస్ అధికారి చేసిన ఆగడాలు, భూ దందాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. అలాగే హరీష్ అనే ఐఏఎస్ అధికారి కూడా భూములకు సంబంధించి చాలా లావాదేవీలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు అదే అధికారిని రెవిన్యూ మంత్రి పొంగులేటి తిరిగి తన దగ్గరే పెట్టుకున్నారు. అమయ్ కుమార్, హరీష్ లు ఇద్దరూ కెసిఆర్ హయాంలో అప్పటి ప్రభుత్వ పెద్దల సహకారంతో భయంకరమైన అవినీతికి పాల్పడ్డారు అనేది ఆరోపణ. కానీ ఇప్పటికీ వాళ్ళ హవా నడుస్తుందని కూడా చెప్తున్నారు. ఇక నవీన్ మిట్టల్ లాంటి అధికారిపై ఇన్ని అన్ని ఆరోపణలు కాదు. వీళ్ళందరూ కెసిఆర్ హయాంలోనూ చక్రం తిప్పారు… ఇప్పుడు అదే హవా కొనసాగిస్తున్నారు. అయితే వీళ్ళ అందరితో అవసరాలు ఉండటంతో వాళ్లని స్థాన చలనం చేయకుండా కొనసాగిస్తున్నారని గుసగుసలు బాగా వినిపిస్తున్నాయి.రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది దాటింది.

గత ప్రభుత్వంలో బిహారి ఐఏఎస్ లే ప్రభుత్వాన్ని నడిపించారని పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. రేవంత్ పలుమార్లు ఐఏఎస్ ల బదిలీలు చేశారు. కానీ 14 నెలల తర్వాత కూడా కొద్ది మంది సీనియర్ ఐఏఎస్ లను కదపలేక పోయారు.
రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఐఏఎస్‌లకు ప్రాధాన్యం పెరుగుతుందని అందరూ భావించారు. కెసిఆర్ లూప్‌లైన్‌లో ఉంచిన వారికి రేవంత్ పెద్ద పీట వేస్తారని బ్యూరోక్రాట్స్ భావించారు. కానీ కాంగ్రెస్ సర్కార్ లో కూడా ఇంకా పాత వాళ్లే పెత్తనం చేలాయించడాన్ని మిగిలిన వాళ్ళు తట్టుకోలేక పోతున్నారు. 1991 బ్యాచ్‌ ఐఏఎస్ రామకృష్ణరావు ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వంలో ఆర్థిక, ప్రణాళిక శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు. కెసిఆర్ ప్రభుత్వంలోనూ చక్రం తిప్పారు. కేసీఆర్ చేసిన అనేక ఆర్థిక చెల్లింపుకు ఈయనే సాక్షి. ప్రస్తుత ప్రభుత్వంలో కూడా ఆర్థిక శాఖ స్పెషల్ సీఎస్ గా రామకృష్ణరావే కొనసాగుతున్నారు. ఇప్పటికీ ఆయన్ని కదిలించలేకపోయింది రేవంత్ సర్కార్. 1992 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ జయేష్ రంజన్. కేటీఆర్ కి అత్యంత సన్నిహితుడైన జయేష్ తెలంగాణలో పదేళ్ల నుంచి పరిశ్రమలు, ఐటీ శాఖ ముఖ్య, ప్రత్యేక కార్యదర్శిగా పని చేశారు.

జయేష్ కు 2027 సెప్టెంబర్‌ వరకు సర్వీసు ఉంది. కేసీఆర్ ప్రభుత్వంలో ఆయనపై అనేక ఆరోపణలు వచ్చాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జయేష్ ను మారుస్తారని అనుకున్నారు. కానీ ఇప్పటి వరకు జరిగిన బదిలీల్లో ఆయన పేరే లేదు. స్పెషల్ సీఎస్ హోదాలో ఉన్న జయేష్ తనకున్న ఢిల్లీ సంబంధాలతో ఏఐసీసీ అగ్రనేతలను ప్రసన్న చేసుకొని పదవీ విరమణ చేసే లోపు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవిని చేపట్టాలని ప్రయత్నాలు చేస్తున్నారు.2002 ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన రఘునందన్ రావు కూడా అదే పదవిలో కొనసాతున్నారు. ఆగస్టు 2021 నుంచి వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఆయనే కొనసాగుతున్నారు. గత ప్రభుత్వంలో రఘునందన్ రావు హయాం లోనే రైతుబంధు, రైతు భీమా, ఇతర వ్యవసాయ అనుబంధ రంగాల్లో అవినీతి అక్రమాలు చోటు చేసుకున్నాయని పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి.

అలాగే ఫర్టిలైజర్ కంపెనీలు, సీడ్స్ కంపెనీ లు సర్టిఫికేషన్ కోసం కోట్ల రూపాయల ముడుపులు చెల్లించాయని ఆరోపణలు వచ్చాయి. అయినా రఘునందన్ రావు నిరాటంకంగా కొనసాగుతున్నారు. ఇక1996 బ్యాచ్ కు చెందిన అధికారి నవీన్ మిట్టల్. ఆది నుంచి అనేక వివాదాల్లో నవీన్ మిట్టల్ పేరు మారు మ్రోగి పోయింది. గత ప్రభుత్వం ఎన్నికల ఏడాదిన్నర ముందు ఆయన్ను రెవెన్యూశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా నియమించింది. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా ఆయన అదే పదవిలో కొనసాగుతున్నారు. ఎన్నికల సమయంలో కేంద్ర ఎన్నికల కమిషన్ కు కూడా నవీన్ మిట్టల్ పై ప్రతిపక్షాలు ఫిర్యాదు చేశాయి. ఆయనకు సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా తో సన్నిహిత సంబంధాలు ఉండటంతో కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా ఆయన్ను ఆ పోస్టు నుంచి ట్రాన్స్ ఫర్ చేసే అవకాశాలు లేవు. 1998 బ్యాచ్ ఐఏఎస్ అధికారి సందీప్ కుమార్ సుల్తానీయా కెసిఆర్, రేవంత్ రెండు ప్రభుత్వాల్లోనూ కీలకంగా వ్యవహరిస్తున్నారు. 1999 బ్యాచ్ కు చెందిన వి. శేషాద్రి ధరణి తీసుకు రావడంలో కీలక పాత్ర పోషించారు… ప్రస్తుతం భూ భారతి కూడా ఆయనే చేశారు. 1996 బ్యాచ్ కు చెందిన ఐఏఎస్ అధికారి దాన కిషోర్. గతంలో జిహెచ్ఎంసి, జల మండలి కమిషనర్ గా పని చేసిన ఆయన మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా వ్యవహరిస్తున్నారు.

రేవంత్ కు అడ్మినిస్ట్రేషన్ పై పట్టు లేకపోవడంతో కొందరు ఐఏఎస్లు ఐపీఎస్లు ఆడిందాట పాడింది పాటగా నడుస్తుంది.
కెసిఆర్ హయాంలో చక్రం తిప్పిన బ్యూరోక్రాట్లే ఇప్పుడు ప్రభుత్వంలో చెలరేగిపోతున్నారు. వీళ్లకు అన్ని ఆనుపానులు తెలియడంతో… తాము అనుకున్న పనులు పూర్తి చేసుకోవాలంటే వీళ్ళని కొనసాగించాలి అని ముఖ్యమంత్రి చుట్టూ ఉన్న బృందం భావించడంతో పాత అధికారులే ఇప్పుడు కొనసాగుతున్నారు. దీంతో మిగిలిన వాళ్లు రగిలిపోతున్నారు. రేవంత్ కి దగ్గరగా నిజాయితీ గల అధికారి, అడ్మినిస్ట్రేషన్ పై పట్టున్న అధికారి ఒక్కరూ లేరని కామెంట్లు బహిరంగంగానే వినిపిస్తున్నాయి. ప్రభుత్వం ఏర్పడి ఏడాది దాటినా పాలనపై పట్టు రాకపోవడానికి ముఖ్యమంత్రికి ఐఏఎస్ లకి మధ్య సమన్వయం లేకపోవడమే ప్రధాన కారణం.