Opposition Meeting: మరోసారి విపక్షాల భేటీ.. తేదీలు ఖరారు.. ఈసారైనా ఐక్యత సాధ్యమయ్యేనా..?
ప్రతిపక్ష కూటమిలో ఉన్న ఎన్సీపీకి చెందిన అజిత్ పవార్.. మహారాష్ట్రలో బీజేపీతో కలిసిపోయిన నేపథ్యంలో ప్రతిపక్షాల భేటీ వాయిదా పడుతుందని భావించారు. అయితే, పూర్తిగా రద్దు చేయకున్నా.. నాలుగు రోజులు ఆలస్యంగా ఈ భేటీ జరగనున్నట్లు కాంగ్రెస్ ప్రతినిధి కేసీ వేణుగోపాల్ వెల్లడించారు.
Opposition Meeting: బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు తలపెట్టిన భేటీకి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 17, 18 తేదీల్లో బెంగళూరులో ఈ భేటీ జరగబోతుంది. గత నెలలో మొదటి ప్రతిపక్ష భేటీ జరిగిన సంగతి తెలిసిందే. మొదటి సమావేశాన్ని బిహార్ సీఎం నితీష్ కుమార్ పాట్నాలో ఏర్పాటు చేయగా, తాజా భేటీని బెంగళూరులో కాంగ్రెస్ ఏర్పాటు చేస్తోంది. మొదట హిమాచల్ ప్రదేశ్‌లో ఈ భేటీ జరపాలని నిర్ణయించినప్పటికీ, అక్కడ భారీ వర్షాలు, వాతావరణం అనుకూలంగా ఉండకపోవడంతో వేదికను బెంగళూరుకు మార్చారు. కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న సంగతి తెలిసిందే. మొదట ఈ భేటీని 13, 14 తేదీల్లో నిర్వహించాలని భావించినప్పటికీ కొన్ని కారణాల వల్ల ఆలస్యంగా నిర్వహిస్తున్నారు. ప్రతిపక్ష కూటమిలో ఉన్న ఎన్సీపీకి చెందిన అజిత్ పవార్.. మహారాష్ట్రలో బీజేపీతో కలిసిపోయిన నేపథ్యంలో ప్రతిపక్షాల భేటీ వాయిదా పడుతుందని భావించారు. అయితే, పూర్తిగా రద్దు చేయకున్నా.. నాలుగు రోజులు ఆలస్యంగా ఈ భేటీ జరగనున్నట్లు కాంగ్రెస్ ప్రతినిధి కేసీ వేణుగోపాల్ వెల్లడించారు. నిజానికి రెండో భేటీ గురించి ఎన్సీపీ అధినేత శరద్ పవార్ వెల్లడించారు. తాజా పరిణామాల నేపథ్యంలో ఆయన భేటీకి వచ్చే అవకాశాలు తక్కువే.
ఈ సారైనా కలిసిపోతాయా..?
ఎన్సీపీ నేతలు బీజేపీతో కలిసిపోవడంతో భేటీకి ముందే ప్రతిపక్షాలకు ఎదురుదెబ్బ తగిలింది. అయితే, మిగతా పార్టీలు అన్నీ దాదాపు భేటీకి హాజరయ్యే అవకాశం ఉంది. కాంగ్రెస్‌తోపాటు టీఎంసీ, ఎస్పీ, ఆర్‌జేడీ, జేడీయూ, ఆమ్ ఆద్మీ, సీపీఎం, సీపీఐ వంటి పార్టీలు హాజరవుతాయి. బీజేపీని ఎదుర్కొనేందుకు భవిష్యత్తులో అనుసరించాల్సిన వ్యూహాలు, ఉమ్మడి ప్రణాళిక, కలిసికట్టుగా పని చేసే అంశాలపై ప్రధానంగా చర్చిస్తారు. ఆ తర్వాత సీట్ల పంపిణీ వంటి అంశాలపై కూడా చర్చ జరుగుతుంది. ప్రతిపక్షాలు ఉమ్మడిగా బీజేపీపై పోరాడాలంటే ముందుగా తమలో ఉన్న విబేధాల్ని పక్కనపెట్టాలి. ముఖ్యంగా కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ మధ్య ఉన్న బేధాల్ని తొలగించుకుంటేనే ఇది విజయవంతమవుతుంది. బీజేపీ తర్వాత ఎక్కువ రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీనే. ఆ తర్వాత రెండు రాష్ట్రాల్లో ఆమ్ ఆద్మీ అధికారంలో ఉంది. అందువల్ల జాతీయ పార్టీల్లో ఈ రెండూ కీలకమైనవి.
కానీ, ఈ రెండింటి మధ్య ఉన్న వివాదాలే ప్రతిపక్షాల ఐక్యతను దెబ్బతీస్తున్నాయి. అనేక అంశాల్లో కాంగ్రెస్ మద్దతు కోరుతోంది ఆప్. కానీ, ఈ విషయంలో కాంగ్రెస్ వెనుకడుగు వేస్తోంది. ఎందుకంటే కాంగ్రెస్ పతనంలో బీజేపీ తర్వాత ప్రధాన పాత్ర ఆమ్ ఆద్మీదే. ఇప్పుడు ఆ పార్టీతోనే కలిసి పని చేసే విషయంలో కాంగ్రెస్ బెట్టు చేస్తోంది. ఆమ్ ఆద్మీ తమకు ఎప్పటికైనా ప్రత్యర్థే అని కాంగ్రెస్ భావిస్తోంది. అందుకే అనేక అంశాల్లో రెండు పార్టీల మధ్య సఖ్యత కుదరడం లేదు. ఈ విషయం తేలితే ప్రతిపక్షాల ఐక్యతలో కీలకమైన ముందడుగు పడ్డట్లే. మరోవైపు ప్రతిపక్షాల కూటమికి చెందిన ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ సోమవారం హైదరాబాద్‌లో తెలంగాణ సీఎం కేసీఆర్‌ను కలిశారు. ఏ అంశాల ప్రాతిపదికగా కలిశారు అనే విషయంలో స్పష్టత లేదు. ఈ కూటమికి బీఆర్ఎస్ దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఒక్క పార్టీకి కూడా ప్రతిపక్షాల భేటీకి ఆహ్వానం అందలేదు.