karnataka: బెంగళూరులో కాంగ్రెస్ బలప్రదర్శన..! చేతులు కలిపిన ప్రతిపక్షాలు.. ఈ ఐక్యతారాగం ఎంతవరకు..?
ఒక్క గెలుపు.. ఒకే ఒక్క గెలుపు దేశ రాజకీయాన్ని మార్చేసేలా కనిపిస్తోంది. ఎన్నాళ్లో వేచిన ఉదయం కాంగ్రెస్‌కు కొత్త ఊపిరిలూదడమే కాదు.. ప్రతిపక్షాల ఐక్యతకు జీవం పోసింది. ఇంతకాలం ఎడమొహం, పెడమొహంగా ఉన్న విపక్షాలు బెంగళూరు వేదికగా చేతులు కలిపాయి.
karnataka: కాంగ్రెస్ బల ప్రదర్శన చేసింది. ప్రతిపక్షాలను ఏకతాటిపైకి తెచ్చింది. 2024 ఎన్నికలకు బెంగళూరు వేదికగా సమరశంఖం పూరించింది. మరి ఇప్పుడు కలిసిన చేతులు 2024వరకు అలానే ఉంటాయా..? ఈ ఐక్యత బీజేపీకి ప్రమాదమా..?
ఒక్క గెలుపు.. ఒకే ఒక్క గెలుపు దేశ రాజకీయాన్ని మార్చేసేలా కనిపిస్తోంది. ఎన్నాళ్లో వేచిన ఉదయం కాంగ్రెస్‌కు కొత్త ఊపిరిలూదడమే కాదు.. ప్రతిపక్షాల ఐక్యతకు జీవం పోసింది. ఇంతకాలం ఎడమొహం, పెడమొహంగా ఉన్న విపక్షాలు బెంగళూరు వేదికగా చేతులు కలిపాయి. సిద్ధరామయ్య ప్రమాణస్వీకారం వేళ నేతలంతా ఐక్యతారాగం ఆలపించారు. ఇప్పటి వరకు తలోదారిలో నడిచిన విపక్షాలు ఇప్పుడు ఏకమవడం బీజేపీకి ప్రమాదకర సంకేతాలు పంపుతున్నాయి.
సిద్ధరామయ్య ప్రమాణస్వీకార వేళ కాంగ్రెస్ అగ్రనేతలతో పాటు ప్రతిపక్ష ముఖ్యులంతా ఒకే వేదికపై కనిపించారు. రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీ, ఖర్గే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులే కాకుండా మిత్రపక్షాల సీఎంలు తరలివచ్చారు. బిహార్ సీఎం నితీష్ కుమార్, తమిళనాడు సీఎం స్టాలిన్, రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్, ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేష్, హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్‌విందర్ సింగ్ హాజరయ్యారు. ప్రమాణస్వీకారానికి తేజస్వీ, ముఫ్తీ, ఏచూరి, డి.రాజా, కమల్ హాసన్ సహా విపక్ష నేతలంతా వచ్చారు. మమతా బెనర్జీ తరపున ఆ పార్టీ సీనియర్ నేత హాజరయ్యారు.
2014 తర్వాత ప్రతిపక్ష నేతలంతా ఇలా ఒకే వేదికపై కలసి కనిపించడం ఇదే మొదటిసారి. ఇంతకాలం ఒకరు ఒక అడుగు ముందుకేస్తే మరొకరు వెనకడుకు వేసేవారు. కాంగ్రెస్ నాయకత్వాన్ని కొందరు వ్యతిరేకిస్తే మరికొందరు సమర్ధించేవారు. దీంతో ప్రతిపక్షాల ఐక్యత ఎండమావిలా మారింది. కానీ ఇప్పుడు పరిస్థితి మారినట్లే కనిపిస్తోంది. కర్ణాటక ఎన్నికల ఫలితం ప్రతిపక్షాల మైండ్‌సెట్‌నే మార్చింది. మోదీని ఓడించలేం అన్న భావన నుంచి అందరం కలిస్తే కొట్టడం కష్టం కాదనే సంకేతాలు పంపింది. కర్ణాటకలో ప్రధాని మోదీ విస్తృత ప్రచారం చుట్టారు. రాష్ట్రాన్ని చుట్టేశారు. ఏ ప్రధాని కూడా గతంలో ఈ స్థాయిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొనలేదనేలా సాగింది మోదీ ప్రచారం. ఇక కమలం ముఖ్యులంతా కర్ణాటకపై దండయాత్ర చేసినా విజయం మాత్రం సాధ్యం కాలేదు. బీజేపీ ఓటమి ప్రతిపక్షాలకు భవిష్యత్తుపై ఆశలు రేకెత్తించింది.
కర్ణాటక విజయంతో కాంగ్రెస్‌లో కొత్త ఉత్సాహం వచ్చింది. అస్థిత్వమే ప్రమాదంలో పడ్డ సమయంలో కన్నడిగులు కాంగ్రెస్‌లో కొత్త జీవాన్ని నింపారు. ఈ ఏడాది చివరలో 4 రాష్ట్రాల ఎన్నికలు జరగనున్నాయి. మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్‌గఢ్, మేఘాలయ, తెలంగాణలో ఎన్నికలు జరుగుతాయి. ఇదే ఊపుతో ఆ రాష్ట్రాల్లోను పాగా వేయాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఆ తర్వాత రెట్టించిన ఉత్సాహంతో 2024 లోక్‌సభ ఎన్నికలకు వెళ్లాలని కాంగ్రెస్ ఆలోచిస్తోంది. విపక్షాలతో కలిసి లోక్‌సభ ఎన్నికల్లో మోదీని ఢీ కొట్టాలన్నది కాంగ్రెస్ ప్లాన్. 2014 ఎన్నికల తర్వాత గెలుపు కోసం కాంగ్రెస్ మొహం వాచిందనే చెప్పాలి. అక్కడక్కడా ఒకటీ రెండు విజయాలు తప్ప పెద్దగా చెప్పుకోదగ్గ స్థాయిలో గెలుపనేది లేదు. కానీ కర్ణాటక ఆ లోటును తీర్చింది. నిజానికి ప్రజలు దాన్ని కాంగ్రెస్ గెలుపు అనేకంటే కూడా బీజేపీ ఓటమిగానే ఎక్కువగా చూశారు.
మరి ఇప్పుడు కలిసిన చేతులు 2024 లోక్‌సభ ఎన్నికల వరకూ ఇలానే ఉంటాయా అన్నది పెద్ద సందేహం. ఈ ఏడాది చివర్లో జరిగే రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటితే ప్రతిపక్ష కూటమి దిశగా మరిన్ని అడుగులు పడతాయి. ఓటమి పునరావృతమైతే మాత్రం ప్రతిపక్షాల ఐక్యత కలగానే మిగిలిపోతుంది. మమతా బెనర్జీ ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో ఎవరికీ తెలియదు. శరద్ పవార్ ప్రస్తుతం కమలంవైపు మొగ్గుతున్నారు. వీరంతా కలిస్తేనే బీజేపీని ఢీకొట్టాలన్న ప్రతిపక్షాల ప్రయత్నం ఫలిస్తుంది. లేదంటే షరా మామూలే.. మరోసారి మోదీ మ్యాజిక్ తప్పదు.