Parliament Inauguration: రాష్ట్రపతికి అవమానం.. పార్లమెంట్ భవన ప్రారంభానికి అందని ఆహ్వానం.. మైలేజీ కోసమే మోదీ పాట్లు!
రాష్ట్రపతికి పార్లమెంట్ నూతన భవన ప్రారంభోత్సవానికి ఆహ్వానం అందలేదు. అంతేకాదు.. మాజీ రాష్ట్రపతినీ ఆహ్వానించలేదు. పైగా ఈ భవనాన్ని ప్రధాని మోదీ ప్రారంభించబోతున్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రపతిని ఆహ్వానించకపోవడం కచ్చితంగా రాష్ట్రపతిని అవమానించడమే అంటూ విమర్శిస్తున్నాయి ప్రతిపక్షాలు. రాష్ట్రపతికి ప్రభుత్వం సముచిత గౌరవం ఇవ్వడం లేదని కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.

Parliament Inauguration: దేశంలోనే ప్రథమ పౌరురాలు రాష్ట్రపతి. అలాంటి అత్యున్నత స్థానంలో ఉన్న రాష్ట్రపతికి పార్లమెంట్ నూతన భవన ప్రారంభోత్సవానికి ఆహ్వానం అందలేదు. అంతేకాదు.. మాజీ రాష్ట్రపతినీ ఆహ్వానించలేదు. పైగా ఈ భవనాన్ని ప్రధాని మోదీ ప్రారంభించబోతున్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రపతిని ఆహ్వానించకపోవడం కచ్చితంగా రాష్ట్రపతిని అవమానించడమే అంటూ విమర్శిస్తున్నాయి ప్రతిపక్షాలు. రాష్ట్రపతికి ప్రభుత్వం సముచిత గౌరవం ఇవ్వడం లేదని కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.
దేశానికి మూల స్తంభాల్లో ఒకటైన పార్లమెంట్‌కు కొత్త భవనం రాబోతుంది. ఈ నెల 28న ఈ భవన ప్రారంభోత్సవం జరుగుతుంది. దేశ చరిత్రలో ఇదో చారిత్రక ఘట్టం. ఈ కార్యక్రమాన్ని రాజకీయాలకు అతీతంగా నిర్వహిస్తే బాగుండేది. కానీ ఇప్పుడీ అంశం రాజకీయ రంగు పులుముకుంది. కారణం.. ప్రధాని నరేంద్ర మోదీ ఈ భవనాన్ని ప్రారంభించడమే. అంతేకాదు.. దీనికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఆహ్వానం అందలేదు. మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కూడా ఆహ్వానించలేదు. వివిధ పార్టీలు, ప్రతిపక్షాలకు మాత్రం ఆహ్వానాలు అందాయి. దీనిపైనే కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ, ఎంఐఎంసహా ఇతర పక్షాలు మండిపడుతున్నాయి. ఇంత భారీ కార్యక్రమానికి రాష్ట్రపతిని ఆహ్వానించకపోవడంపై విమర్శలు చేస్తున్నాయి.
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, అసదుద్దీన్ ఒవైసీ వంటి నేతలు సోషల్ మీడియా వేదికగా దీనిపై అభ్యంతరం వ్యక్తం చేశారు. దళితులు, గిరిజనులను బీజేపీ, మోదీ ప్రభుత్వం కేవలం రాజకీయ అవసరాలకే వాడుకుంటోందని, వారికి తగిన గౌరవం ఇవ్వడం లేదని ఖర్గే విమర్శించారు. పార్లమెంట్ భవనం దేశ అత్యున్నత శాసన వ్యవస్థ అని, రాష్ట్రపతి దేశంలోని పార్టీలు, ప్రజలందరి ప్రతినిధి అని, అలాంటి రాష్ట్రపతిని ఈ కార్యక్రమానికి ఆహ్వానించకపోవడం సరికాదని ఖర్గే అన్నారు. రాష్ట్రపతిని ఈ కార్యక్రమానికి ఆహ్వానించడంతోపాటు, ద్రౌపది ముర్ముతోనే ఈ భవనం ప్రారంభించాలని ఆయన డిమాండ్ చేశారు. ద్రౌపది ముర్ము ఈ భవనాన్ని ప్రారంభిస్తేనే ప్రజాస్వామ్య విలువలు, రాజ్యాంగ వ్యవస్ధలకు ప్రభుత్వం కట్టుబడి ఉన్నట్లు అర్థం అని ఆయన అన్నారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కూడా రాష్ట్రపతితోనే పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించాలని సూచించారు. పలువురు ప్రతిపక్ష నేతలు కూడా రాష్ట్రపతితోనే పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించాలని డిమాండ్ చేస్తున్నారు.
మైలేజీ కోసం మోదీ ప్రయత్నం
దేశంలోనే ప్రతిష్టాత్మక పార్లమెంట్ భవనాన్ని రాష్ట్రపతి ప్రారంభిస్తేనే బాగుంటుందన్నది చాలా మంది అభిప్రాయం. దీనివల్ల రాజకీయాలకు తావు లేకుండా ఉంటుంది. ఎందుకంటే పార్లమెంట్ ఏ ఒక్క పార్టీ సొత్తు కాదు. ఇది అన్ని పార్టీలదీ. ఆ మాటకొస్తే ప్రజలది. ఈ భవనాన్ని ప్రధాని ప్రారంభించడం సముచితం కాదన్నది చాలా మంది అభిప్రాయం. ఈ భవనం మోదీ హయాంలోనే నిర్మితమై ఉండొచ్చు. ప్రధాని పదవి ఉన్నతమైందే కావొచ్చు. కానీ, ప్రధాని ఒక పార్టీకి ప్రతినిధి. అదే రాష్ట్రపతికి ఏ పార్టీతోనూ సంబంధం లేదు. అన్ని పార్టీలకు వేదికగా నిలిచే పార్లమెంట్ భవనాన్ని రాష్ట్రపతి ప్రారంభిస్తే పార్టీలకు అతీతంగా, ప్రజాస్వామ్య విలువలకు తావిచ్చినట్లవుతుంది. కానీ, మోదీ ఈ విషయం గురించి ఆలోచించడం లేదు. పార్లమెంట్ భవన నిర్మాణం క్రెడిట్ పూర్తిగా తానే తీసుకోవాలి అనుకుంటున్నారు. అసలే ఇది ఎన్నికల టైం.
ఇలాంటి సమయంలో పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించడం వల్ల వచ్చే మైలేజీని వదులుకోవడం ఆయనకు ఇష్టం లేనట్లు ఉంది. ప్రధానికి ఈ విషయంలో ఆహ్వానం పంపింది లోక్‌సభ సెక్రటరీయే కావొచ్చు. కానీ, ప్రభుత్వ పెద్దల సూచన మేరకే ప్రధానికి ఆహ్వానం అందింది. రాష్ట్రపతిని విస్మరించారు. మోదీ తాను ప్రారంభించాలి అనుకున్నారు కాబట్టే.. తనకు ఆహ్వానం అందేలా చూశారు. లేకుంటే ఆహ్వానం వచ్చిన వెంటనే దాన్ని తిరస్కరించి, రాష్ట్రపతి పేరు సూచించేవారు. కానీ, మోదీ ఆ పని చేయకుండా తానే ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. ఒకవేళ రాష్ట్రపతే ప్రారంభిస్తే వచ్చే ఇబ్బంది ఏంటో బీజేపీ చెప్పడం లేదు. దీనిపై సరైన వివరణ కూడా ఇచ్చుకోలేని స్థితిలో బీజేపీ ఉంది.