INDIA: పేరు మారింది.. ఫేట్ మారుతుందా..? ప్రతిపక్షాల కూటమికి చిక్కులెన్నో..!

విపక్షాలకు ఉమ్మడి శత్రువు బీజేపీ. కమలం వాడకపోతే తాము వికసించలేమని ఆ పార్టీలకు తెలుసు. అందుకే బలవంతంగా అయినా చేతులు కలిపాయి. అయితే కూటమిలోని కొన్ని పార్టీలది కక్కలేని, మింగలేని పరిస్థితి. పైగా పోరాటానికి సిద్ధమని చెబుతున్నా అది ఎక్కడ తమ కొంప ముంచుతుందోనన్న టెన్షన్ ఉంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: July 19, 2023 | 10:47 AMLast Updated on: Jul 19, 2023 | 10:47 AM

Oppositions Name Changed From Upa To India But Rivalry Between Parties Is Big Problem

INDIA: మోదీని ఢీకొట్టడానికి ప్రతిపక్షాలన్నీ ఏకమయ్యాయి. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అంటూ సమరభేరిని మోగిస్తున్నాయి. మరి ఇప్పుడు చేతులు కలిపిన పార్టీలన్నీ చివరిదాకా ఉంటాయా….? వాటిలో అవి కొట్టుకోకుండా ఉంటాయా..? రాష్ట్రాల్లో సయోధ్య సాధ్యమేనా..?
కొత్త సీసాలో పాత సారా..! ప్రతిపక్ష కూటమికి ఇది సరిగ్గా సరిపోతుంది. కూటమికి కొత్త పేరు పెట్టి, కొత్త కలరింగ్ ఇచ్చేసి.. బీజేపీని, ముఖ్యంగా ప్రధాని నరేంద్రమోదీని ఢీకొట్టడానికి సిద్ధమయ్యాయి. కానీ కూటమిలోని పార్టీలది విచిత్ర పరిస్థితి. శత్రువును గెలవాలంటే ముందుగా తమలో తాము కొట్లాడుకోవడం ఆపాల్సిన పరిస్థితి. ఇంకా చెప్పాలంటే జాతీయ స్థాయిలో భాయి భాయి అనుకుని ప్రాంతీయ స్థాయిలో కత్తులతో కొట్లాడుకోవాల్సిన పరిస్థితి. ఏదో ఓ పార్టీది కాదు ఇండియా (కొత్త కుంపటి)లోని చాలా పార్టీల సీన్ అదే. విపక్షాలకు ఉమ్మడి శత్రువు బీజేపీ. కమలం వాడకపోతే తాము వికసించలేమని ఆ పార్టీలకు తెలుసు. అందుకే బలవంతంగా అయినా చేతులు కలిపాయి. అయితే కూటమిలోని కొన్ని పార్టీలది కక్కలేని, మింగలేని పరిస్థితి. పైగా పోరాటానికి సిద్ధమని చెబుతున్నా అది ఎక్కడ తమ కొంప ముంచుతుందోనన్న టెన్షన్ ఉంది. కూటమిలో పార్టీల్లో కొన్నింటి మధ్య తీవ్ర వైరం ఉంది. ప్రాంతీయంగా ఆ పార్టీలు బద్ధ శత్రువులు. మరి రేపు సార్వత్రిక సమరంలో ఆ పార్టీలు చేతులు కలుపుతాయా..?
కూటమిలో ఓ కీలక పార్టీ తృణముల్ కాంగ్రెస్. బెంగాల్‌లో కమ్యూనిస్టులను కుప్పకూల్చి, కోలుకోలేని దెబ్బతీసింది మమత. అక్కడ కాంగ్రెస్‌ కూడా మమతకు శత్రువే. కాంగ్రెస్‌ను దాదాపు చంపేసింది మమత. ఇప్పుడు ఈ మూడు వర్గాలు ఒకే చట్రంలో ఉన్నాయి. మరి రేపు ఎన్నికల్లో ఈ మూడు పార్టీలు కలసి పోటీ చేస్తాయా..? అసలు అది సాధ్యమా..? చంపుకొని చచ్చే బెంగాల్‌లో కార్యకర్తలు స్నేహహస్తం చాస్తారా..? డౌటే… ఇప్పటికిప్పుడు నేతలు చేతులు కలిపినంత ఈజీ కాదని మమతకు తెలుసు, కాంగ్రెస్‌కూ తెలుసు.
జమ్మూకశ్మీర్‌ను తీసుకుంటే అక్కడ నేషనలిస్ట్ కాంగ్రెస్, పీడీపీ మధ్య రాజకీయ వైరం ఉంది. కేసులు పెట్టుకుని మరీ వేధించుకున్నాయి. మరి ఆ రెండూ చేతులు కలపడం సాధ్యమేనా..? బీజేపీని దెబ్బతీయడం రెండు పార్టీల లక్ష్యమే అయినా అది తమ అస్తిత్వాన్ని దెబ్బతీస్తుందన్న భయం వాటికి ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీది కూడా అదే పరిస్థితి. పంజాబ్‌లో ఆప్, కాంగ్రెస్, బీజేపీ మధ్య త్రిముఖ పోరు ఉంది. కాంగ్రెస్ సర్కార్‌ను కూల్చి ఆప్ అధికారంలోకి వచ్చింది. అలాగే ఢిల్లీలో కూడా ఆప్‌, కాంగ్రెస్ మధ్య పోటీ ఉంది. మరి ఈ పార్టీలు బీజేపీని ఓడించడం కోసం మనస్పూర్తిగా చేతులు కలపగలవా..? కేరళలో తీసుకుంటే కమ్యూనిస్టులు, కాంగ్రెస్ మధ్యే పోరాటమంతా. అక్కడ బీజేపీకి ఇప్పటికైతే స్కోప్ లేదు. రాష్ట్రంలో ఆ రెండు పార్టీలు కత్తులు దూసుకుంటాయి. మరి ఇప్పుడు జాతీయ స్థాయిలో పోరాటం కోసం చేతులు కలుపుతాయా..? అలా కలిపేసి తాము తోకపార్టీలన్న అపవాదును మరోసారి నిజం చేస్తాయా..? ఎన్సీపీ, శివసేనలు చీలికలైపోయాయి. ఓ వర్గం అటు.. మరొకటి ఇటు ఉన్నాయి. శరద్ పవార్ రేపు తన అన్న కొడుకు అజిత్ పవార్‌తో రాజీకి వచ్చి బీజేపీ కూటమిలో చేరబోరన్న గ్యారెంటీ లేదు.
అధికారపక్షం నుంచే కాదు ప్రజల నుంచి కూడా ప్రతిపక్షాల ఐక్యతపై బలమైన ప్రశ్నలు వస్తున్నాయి. దీంతో దానికి సమాధానం ఇచ్చే ప్రయత్నం చేశారు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే. కొన్ని పార్టీల మధ్య విభేదాలు ఉన్నా దేశ ప్రయోజనాల కోసం వాటిని పక్కన పెట్టాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. కానీ అది ఆచరణలో మాత్రం అసాధ్యంగా కనిపిస్తోంది. లోక్‌సభ ఎన్నికల్లో ఈ పార్టీలన్నీ కలసి పనిచేయాలి. ఉమ్మడిగా అభ్యర్థుల్ని నిలబెట్టాలి. కానీ ఎవరికి వారే పైచేయి చూపించాలనుకునే పార్టీలు ఓ మెట్టు తగ్గుతాయా అంటే అనుమానమే. జాతీయ స్థాయిలో పోరాటం కోసం రాష్ట్ర స్థాయిలో తమ బలాన్ని దెబ్బతీసుకోవడానికి మమత లాంటి నేతలు ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించరు. గతంలో ఇందిరను ఎదుర్కోవడానికి ఉమ్మడి పోరాటం చేసిన సమయంలో పరిస్థితి వేరు. అప్పుడు జాతీయ పార్టీల బలమెక్కువ. ప్రాంతీయ పార్టీలు ఏదో ఓ జాతీయ పార్టీతో అంటకాగాలి. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ కొన్ని రాష్ట్రాల్లో ఏదో ఓ ప్రాంతీయ పార్టీ అండతోనే అడుగులు వేసే స్థాయికి పడిపోయింది.
కూటమి పెట్టాలన్న ఆలోచన బాగానే ఉంది. ఉమ్మడి పోరాట వ్యూహమూ బాగుంది. కానీ ఆచరణలోకి తీసుకు రావడం, అతుకుల బొంతను ఆఖరిదాకా తీసుకెళ్లడం అంత సులభమేం కాదు. మరి ఈ సమస్యకు ముంబై సమావేశంలో అయినా సమాధానం దొరుకుతుందా..?