హైదరాబాద్ లో ఆకాశానికి ఇళ్ల అద్దెలు ,వేలకు వేలు చెల్లిస్తున్న సామాన్యులు
ఏం కొనేటట్లు లేదు...ఏం తినేటట్లు లేదు...అన్న సామెత హైదరాబాద్ లో అక్షరాలా నిజమవుతోంది. ఒకవైపు నిత్యావసరాలు మండిపోతున్నాయి.

ఏం కొనేటట్లు లేదు…ఏం తినేటట్లు లేదు…అన్న సామెత హైదరాబాద్ లో అక్షరాలా నిజమవుతోంది. ఒకవైపు నిత్యావసరాలు మండిపోతున్నాయి. ధరలు సామాన్యులకు భారంగా మారుతున్నాయి. అదే స్థాయిలో ఇళ్ల అద్దెలు కూడా ఉండటంతో…మధ్య తరగతి జనం పరిస్థితి ఎవరికి చెప్పుకోలేని విధంగా మారుతోంది. అంతంతమాత్రమే జీతాలున్న మిడిల్ క్లాస్ ప్రజలకు..అద్దెలు తలకు మించిన భారంగా మారుతున్నాయి. ఇళ్ల అద్దెలను ప్రభుత్వం నియంత్రించాల్సిన అవసరం ఉందని కోరుతున్నారు. ఇలాగే ధరలు పెరుగుతూ పోతే…గ్రామాలకు వెళ్లిపోవాల్సిన పరిస్థితులు వస్తాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
హైదరాబాద్…ఐటీ రంగానికి కేరాఫ్ అడ్రస్. పదేళ క్రితం వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు రాజధాని. రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణకు కేపిటల్. దినదిన ప్రవర్తమానంగా వెలుగోందుతోంది. జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు ఎన్నో ఉన్నాయి. బెంగళూరు తర్వాత ఐటీ ఎగుమతులు ఇక్కడి నుంచే జరుగుతున్నాయి. ఒకటా రెండా…లెక్కలేనన్ని కంపెనీలు ఇక్కడ ఉన్నాయి. అదే స్థాయిలో ఇళ్ల అద్దెలు పేలిపోతున్నాయి. సొంత ఇల్లు లేని సామాన్యులు జీవించాలంటే గగనమవుతోంది. ఐదంకెల జీతం తీసుకుంటున్న వారు సైతం…బాబోయ్ మేం చెల్లించలేం అద్దెలు అనే పరిస్థితి ఎదురవుతోంది. సింగిల్ బెడ్రూంకు 8 నుంచి 10 వేల చెల్లించాల్సి వస్తోంది. స్లమ్ ఏరియాల్లో అయితే 6 నుంచి 8 వేలు ఉంటోంది. అదే సింగిల్ బెడ్రూం ఐటీ కారిడార్ కు సమీపంలో ఉంటే…అద్దె గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక డబుల్ బెడ్రూం అద్దెలపై ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని నిపుణులు చెబుతున్నారు.
హైదరాబాద్ లో కొంతకాలంగా రియల్ ఎస్టేట్ పడిపోయింది. ఇండిపెండెంట్ హౌస్ లు, ఆపార్ట్ మెంట్లలో ఫ్లాట్లను కొనేందుకు జనం మొగ్గు చూపడం లేదు. గతం కంటే 5 నుంచి పది శాతం తక్కువ ధరకు లభ్యమవుతున్నా…పట్టించుకోవడం లేదు. భాగ్యనగరం నలువైపులా భారీగా అపార్ట్ మెంట్లు, విల్లాలు, ఇండిపెండెంట్లు ఇళ్లు అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి. హైడ్రా భయంతో కొత్త ఇంటిని కొనుగోలు చేయాలంటే వణికిపోయే పరిస్థితి ఏర్పడింది. వేలలో ఇల్లు అందుబాటులో ఉన్నా…మధ్య తరగతి ప్రజలతో ఓ మోస్తరు ఉద్యోగులు…అద్దె ఇళ్లకే తమ ఓటు అంటున్నారు. పదవీ విరమణ చేసిన వారు…సామాన్యులు…అడంబరాలు పోవడం ఎందుకని భావిస్తున్నారు. ఈ కారణంతోనే డబుల్ బెడ్రూం, సింగిల్ బెడ్రూం ఇళ్ల అద్దెలు గతం కంటే పెరిగాయి.
దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో హైదరాబాద్ ముందు వరుసలో ఉంది. ఐటీ, ఫార్మా, విద్య, వైద్య రంగాల్లో ప్రముఖ సంస్థలు…తమ కొత్త ఆఫీసులను హైదరాబాద్ కు తరలిస్తున్నాయి. మరికొన్ని ఇక్కడే మెయిన్ ఆఫీసులను తెరుస్తున్నాయి. దీంతో దేశం నలుమూలల నుంచి ఉద్యోగులు అధిక సంఖ్యలో నగరానికి వస్తుండటంతో… అద్దెలు ఆకాశానికి చేరుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. ప్రధానంగా టెక్ కారిడార్ లో ఇంటి అద్దెలు గణనీయంగా పెరుగుతున్నాయి. డబుల్ బెడ్ రూమ్, ట్రిపుల్ బెడ్ రూమ్ అపార్ట్ మెంట్ అద్దెలు 10 – 15% పెరిగాయని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఐటీ కారిడార్ లో డబుల్ బెడ్రూం అపార్ట్ మెంట్ లు నెలకు రూ.40,000 వరకూ ఉంటోంది. అదే సమయంలో 3 బీహెచ్కే అపార్ట్ మెంట్స్ అయితే మెయింట్ నెన్స్ ఛార్జీలు మినహాయించి 50 వేల వరకు పలుకుతోంది. గేటేడ్ కమ్యునిటీలో 70 వరకూ అద్దెలు వసూలు చేస్తున్నారు.
ఇళ్ల అద్దెలు ఈ స్థాయిలో పెరగడానికి కారణం…డిమాండ్ కు తగ్గట్లుగా సప్లై లేకపోవడం ప్రధాన కారణం. మరరోవైపు గృహ రుణాలపై వడ్డీ రేట్లు పెరగడం కూడా మరో కారణమని నిపుణులు చెబుతున్నారు. దీంతో అద్దెదారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అద్దెల్లో వార్షిక పెరుగుదల 3వేల నుంచి 5వేల వరకు ఉంది. రెండేళ్ల క్రితం గచ్చిబౌలిలోని ఓ కాలనీలో 25,000 అద్దెకు డబుల్ బెడ్ రూమ్ ప్లాట్ దొరికితే…ఇప్పుడు 35వేలు చెల్లించాల్సి వస్తోంది. ఇళ్ల యజమానులు…అద్దెలను ఇష్టానుసారంగా పెంచేస్తున్న ప్రభుత్వం మాత్రం తమకేం పట్టనట్లు వ్యవహరిస్తోంది. వేలకు అద్దెలు పెరుగుతున్నా…జీతాలు మాత్రం అదే స్థాయిలో పెరగడం సామాన్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వస్తున్న జీతంలో సగం రెంట్లకే చెల్లించాల్సి వస్తోందని…అద్దెలను ప్రభుత్వం నియంత్రించాల్సిన అవసరం ఎంతైనా ఉందని కోరుతున్నారు.