Manipur Violence: అవును మాకు సిగ్గూ శరం లేవు.. ఆ ఇద్దరు మహిళలకు క్షమాపణలతో…!

బేటీ బచావో.. బేటీ పడావో అంటూ పెద్ద పెద్ద ప్రకటనలు చేస్తారు. ఆడ పిల్లల భవిష్యత్తు కోసం, ఈ దేశ యువత కోసం మీరు మొసలి కన్నీళ్లు కారుస్తున్నారేమోనని ఇలాంటి ఘటనలు చూసినప్పుడు మాకందరికీ అనిపిస్తుంది. బేటీ బచావో అని నినదించిన మీకు.. మణిపూర్‌లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించినప్పుడు మాత్రమే నోరు ఎందుకు పెకిలింది‎?

dialtelugu author

Dialtelugu Desk

Posted on: July 21, 2023 | 01:28 PMLast Updated on: Jul 21, 2023 | 1:29 PM

Outrage In India Over Video Of Manipur Women Paraded Naked Raped Shame On Our Country And Politicians

Manipur Violence: మనం కడుపుకు అన్నమే తింటున్నామా.. లేక అశుద్ధాన్ని భుజిస్తున్నామా.‎.? ఒక వేళ మనం తినేది అన్నమే అయితే ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించే అవమానకర ఘటనలను ఎందుకు నిరోధించలేకపోయాం. అంటే అలా జరగాలని.. ఆ జాతికి చెందిన మహిళలను వివస్త్రలను చేసి ఊరేగించాలని మనం కోరుకున్నామా..? చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. ఈ దేశాన్ని.. ఈ దేశ ప్రజలను శాశ్వతంగా మతం మత్తులో ముంచేసి, రాజ్యాధికారం చెలాయించాలనుకుంటున్న విశాలమైన ఛాతిగల వ్యక్తికి అసలు మణిపూర్‌లో ఏం జరుగుతుందో తెలుసా..? తెలియకుండా ఎందుకుంటుంది..? కచ్చితంగా ఆయనకు, ఆయన పరివారానికి అంతా తెలుసు. బహూశా అలా జరగాలని.. కొన్ని వర్గాలు లేదా జాతులు మణిపూర్‌లో తుడిచిపెట్టుకుపోవాలని వారు కోరుకున్నారేమో! 56 ఇంచుల ఛాతి గల ఆ పెద్దాయనకు మణిపూర్‌లో జరుగుతున్న పరిణామాలపై స్పందించడానికి 79 రోజులు పట్టింది. నేరం చేసిన వాళ్లను వదిలిపెట్టబోమని.. తాను బాధితుల పక్షానే ఉన్నానని చెప్పడానికి ఆయనకు ఇంతకాలం పట్టింది. మతతత్వపు వ్యూహాలు రచించడంలో, ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో ఓట్ల వేటతో పాటు విదేశీ పర్యటనలతో బిజీగా ఉన్నప్పుడు ఆ మాత్రం సమయం పడుతుంది మరి. మనమే అర్థం చేసుకోవాలి.
వైఫల్యం ఎక్కడుంది ? ఎవరు బాధ్యులు ?
కారణాలు ఏమైనా కావొచ్చు.. దానికి దారితీసిన పరిస్థితులు ఏమైనా అయి ఉండొచ్చు.. కానీ మెజారిటీ, మైనారిటీ వర్గాల మధ్య ఘర్షణ తలెత్తినప్పుడు.. అది రోజులు, వారాలు కాకుండా నెలల తరబడి సాగుతుందంటే.. బయట ప్రపంచం దానిని రెండు రకాలుగా చూడాలి. రక్తం ఏరులై పారుతున్నా.. ఒక వర్గం ప్రజలను మరోవర్గం బతకనీయకుండా చేస్తున్నా.. వేలాది మంది తాము పుట్టిన ప్రాంతాన్ని వదిలి ప్రాణభయంతో వలసపోతున్నా.. ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు ఉందంటే.. అది కచ్చితంగా శాంతిభద్రతలను కాపాడాల్సిన రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యంగానే చూడాలి. కానీ మణిపూర్‌లో జరిగింది అది కాదు. ఎందుకంటే మణిపూర్ అలా తగలబడిపోవాలని.. కుకీ ప్రజలు ఆ మంటలకు బలైపోవాలని.. జాతుల మధ్య సంఘర్షణను మత రాజకీయంగా మార్చాలని మెజారిటీ హిందూ వర్గాలను మైనార్టీ గిరిజన ప్రజలపైకి ఎగదోయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను నడుపుతున్న డబుల్ ఇంజిన్ పార్టీ కోరుకుంది. అందుకే దాదాపు మూడు నెలలుగా మణిపూర్‌లో గిరిజన, గిరిజనేతర ప్రజల మధ్య అగ్గి రాజుకుని వందలాది మంది చనిపోతున్నా.. వేలాది మంది రాష్ట్రం వదలి వెళ్లిపోతున్నా.. దాన్ని అదుపు చేయాల్సిన రాష్ట్ర ముఖ్యమంత్రితోపాటు ఈ దేశ ప్రధాని కూడా చోద్యం చూస్తూ ఉండిపోయారు.
బేటీ బచావో అంటే ఇదేనా ప్రధాని గారూ..
దేశ ప్రధానిగా తొమ్మిదేళ్లుగా మీ నట విశ్వరూపాన్ని మేం చూస్తూనే ఉన్నాం. బేటీ బచావో.. బేటీ పడావో అంటూ పెద్ద పెద్ద ప్రకటనలు చేస్తారు. ఆడ పిల్లల భవిష్యత్తు కోసం, ఈ దేశ యువత కోసం మీరు మొసలి కన్నీళ్లు కారుస్తున్నారేమోనని ఇలాంటి ఘటనలు చూసినప్పుడు మాకందరికీ అనిపిస్తుంది. బేటీ బచావో అని నినదించిన మీకు.. మణిపూర్‌లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించినప్పుడు మాత్రమే నోరు ఎందుకు పెకిలింది‎? ఆ పరిస్థితి వచ్చే వరకూ మీరు మౌనంగా ఎందుకున్నారు..? ఇద్దరు మహిళలను బట్టలు ఊడదీసి.. వారి ప్రైవేటు పార్ట్స్‌ను తడుముతూ ఊరేగించిన దృశ్యం.. ఈ దేశ ముఖ చిత్రంగా మారిపోవడం వెనుక మీ బాధ్యత లేదంటారా..? రాష్ట్రంలో ఉన్న మీ కాషాయ ప్రభుత్వానికి చేతకాలేదే అనుకుందాం. ఆర్టికల్ 355ని మణిపూర్‌లో ప్రయోగించి రాష్ట్రంలో శాంతిభద్రతల అంశాన్ని తమ పరిధిలోకి తీసుకున్న మీ మిత్రుడు అమిత్ షాకు చెందిన హోంశాఖ ఏం చేయగలిగింది? కేంద్ర బలగాలను రంగంలోకి దించి… రెండు వర్గాలు ఘర్షణకు దిగకుండా.. చేయడం ఈ దేశ ప్రభుత్వానికి చేతగాని వ్యవహారమా..? కానీ అలా ఎందుకు చేయలేకపోయారు..?
కాషాయ జెండా మోసిన వాళ్లే ప్రశ్నిస్తున్నారు కదా..!
ఇలా మిమ్మల్ని గానీ.. మీ పార్టీ నేతలను కూడా ప్రశ్నిస్తే.. వెంటనే వాళ్లపై దేశ ద్రోహులని ముద్ర వేస్తారు. మీ పార్టీ విధానాలను వ్యతిరేకించే వాళ్లే కాదు.. మొన్న మొన్నటి వరకూ మీ కాషాయ జెండాను నెత్తిన పెట్టుకుని ఊరేగిన వాళ్లు కూడా మీ వైఫల్యాలను ఎత్తి చూపుతున్నారు. కనీసం వాటికైనా మీరు సమాధానం చెప్పగలరా..? బీజేపీ క్రిస్టియన్ వ్యతిరేక పార్టీగా మారిపోయిందని.. మణిపూర్ సమస్యను పరిష్కరించడంలో ప్రధానమంత్రి మోదీ రాజ్యాంగ పరంగా, రాజకీయంగా, నైతికంగా విఫలమయ్యారని మీ పార్టీ మిజోరాం మాజీ ఉపాధ్యక్షుడు ఆర్.వన్‌రమ్‌చుంగా సంధించిన ప్రశ్నలకు మీ దగ్గర సమాధానం ఏమైనా ఉందా మోదీ గారూ? గిరిజనులను, క్రిస్టియన్లను ఎందుకు పరిరక్షించలేకపోతున్నారన్న ప్రశ్నకు మీరు ఇప్పటికైనా సమాధానం చెప్పగలరా..? లేక పార్లమెంట్ సమావేశాల ప్రారంభానికి ముందు మీరు నామమాత్రంగా చేసిన ప్రకటనతో సరిపుచ్చుకోవాలా..?
గిరిజనులను, క్రిస్టియన్లను తరిమేస్తారా ?
మయన్మార్‌తో సరిహద్దులను పంచుకుంటున్న మణిపూర్‌లో సగానికి పైగా హిందువుల జనాభానే ఉంది. వీరిలో మెజార్టీలు మైతేయిలు. అయితే 2011 నాటి జనాభా లెక్కల ప్రకారం మణిపూర్‌లో క్రిస్టియన్ పాపులేషన్ క్రమంగా పెరుగుతూ వస్తోంది. గిరిజనులు, క్రిస్టియన్ జనాభా 41 శాతానికి పెరిగిపోయింది. మేలో మొదలైన సంఘర్షణను కేవలం గిరిజనులు, గిరిజనేతరులుగా మాత్రమే చూడలేం. దీని వెనుక మత రాజకీయాలు కూడా కనిపిస్తున్నాయి. మయన్మార్ నుంచి అక్రమంగా వలస వచ్చిన వాళ్లను తిరిగి పంపించే పేరుతో కుకీ తెగ ప్రజలు ఎక్కువగా నివసించే కొండ ప్రాంతాల్లో ప్రభుత్వం సర్వే చేపట్టింది. అయితే అక్రమ వలసదారులను ఏరివేసే పేరుతో మణిపూర్ కొండ ప్రాంతం నుంచి తమను తరిమేసే కుట్రలు జరుగుతున్నాయని, దీని వెనుక మెజారిటీ మైతేయిల హస్తముందని కుకీ, నాగ తెగకు చెందిన ప్రజలు ఆరోపిస్తున్నారు. అందులో భాగంగానే మణిపూర్‌లో చిచ్చు రేపారన్నది వీళ్ల వాదన.

మైతేయిలకు ఎస్టీ స్టేటస్ ఇస్తే.. తాముంటున్న కొండ ప్రాంతాలపై హక్కులు కోల్పోతామన్న భయం కుకీలను ఎప్పటి నుంచో వెంటాడుతూ వస్తోంది. ఇలాంటి సమస్యలను సామరస్య పూర్వకంగా రెండు వర్గాలను కూర్చొపెట్టి పరిష్కరించాల్సిన మన ఘనత వహించిన డబుల్ ఇంజిన్ సర్కార్ వారు.. దీన్ని తమ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకునే ప్రయత్నంలో చివరకు మహిళలను నగ్నంగా ఊరేగించే వరకు తీసుకువచ్చారు. మనుషులను మనుషులుగా చూడకుండా.. వాళ్లను మతాల పేరుతో, జాతుల పేరుతో వేరు చేసి ఓట్లు దండుకోవాలన్న రాజకీయ కుట్రలకు మణిపూర్ బలైపోతోంది. దీనికి బాధ్యత వహించకుండా ముసలి కన్నీరు కార్చినంత మాత్రాన ఈ దేశం వాళ్లను క్షమించదు. మత రాజకీయాలు దేశాన్ని ఏ స్థాయికి తీసుకువెళ్తాయో ఇప్పటికైనా ప్రజలు, ఓటర్లు గమనించకుండా.. వాట్సాప్ యూనివర్శిటీల్లో పట్టాలు పొంది భజన చేసుకుంటూ కూర్చుంటే.. ఈ అమానుషం మణిపూర్ నుంచి ఇతర రాష్ట్రాలకు పాకినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఎందుకంటే ప్రజల మానం కంటే.. వాళ్లకు రాజకీయమే ముఖ్యం కాబట్టి.