హైదరాబాద్ గడ్డపై జనసేన

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వంద శాతం స్ట్రైక్ రేట్ తో ఘన విజయం సాధించిన జనసేన పార్టీ ఇప్పుడు హైదరాబాద్ ఎన్నికల్లో బరిలోకి దిగే ఆలోచనలో ఉంది. ఇప్పటి వరకు తెలంగాణాపై దృష్టి పెట్టని పవన్ కళ్యాణ్... ఇప్పుడు తన పార్టీకి వచ్చిన ఆదరణను వాడుకోవాలని పెద్ద ప్లాన్ వేస్తున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: August 20, 2024 | 12:52 PMLast Updated on: Aug 20, 2024 | 12:52 PM

Paawan Kalyan Plan To Contest In Telangana

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వంద శాతం స్ట్రైక్ రేట్ తో ఘన విజయం సాధించిన జనసేన పార్టీ ఇప్పుడు హైదరాబాద్ ఎన్నికల్లో బరిలోకి దిగే ఆలోచనలో ఉంది. ఇప్పటి వరకు తెలంగాణాపై దృష్టి పెట్టని పవన్ కళ్యాణ్… ఇప్పుడు తన పార్టీకి వచ్చిన ఆదరణను వాడుకోవాలని పెద్ద ప్లాన్ వేస్తున్నారు. దాదాపుగా తెలంగాణా ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, బిజెపి తో కలిసి జనసేన వెళ్ళే అవకాశం ఉందని పవన్ భావిస్తున్నారు. ఇప్పటి వరకు ఆయన బిజెపి కోసం తన పార్టీని ఎన్నికల బరి నుంచి తప్పించారు. ఇక ఇప్పుడు మాత్రం ఆలస్యం చేయవద్దని నిర్ణయానికి వచ్చారట.

త్వరలోనే తెలంగాణా అధ్యక్షుడని నియమించి ఎన్నికల బరిలోకి దిగాలని పవన్ ప్లాన్ లో ఉన్నారట. వచ్చే ఏడాది గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు ఉన్నాయి. ఈ ఏడాది చివర్లో స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఉన్నాయి. ఈ పరిస్థితిని తనకు అనుకూలంగా మార్చుకుంటే తెలంగాణా నాయకులకు కూడా ఒక భరోసా కల్పించినట్టు ఉంటుందని పవన్ యోచిస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కనీసం పది స్థానాల్లో పోటీ చేస్తే మంచిదని, అలాగే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కొన్ని మున్సిపాలిటీలను కైవసం చేసుకుంటే బాగుంటుంది అని పవన్ ప్లాన్ లో ఉన్నారట.

త్వరలోనే బిజెపి, తెలుగుదేశం, జనసేన సమావేశం కానున్నాయి. ఈ సమావేశంలో గ్రేటర్ ఎన్నికల్లో పోటీపై నిర్ణయం తీసుకుంటారు. మేయర్ స్థానం బిజెపికి ఇచ్చే అవకాశం ఉంది. దాదాపు 20 ఏళ్ళ నుంచి తెలంగాణాలో బిజెపి, టీడీపీ అధికారానికి దూరంగా ఉన్నాయి. ఈ ఎన్నికల ద్వారా ఎలా అయినా బలపడాలని భావిస్తున్నాయి. బీఆర్ఎస్ నేతలను కొందరిని బిజెపిలోకి, టీడీపీలోకి తీసుకునే యోచనలో కూడా ఉన్నారట. మరి గ్రేటర్ ఎన్నికల్లో ఎంత వరకు ప్రభావితం చేస్తారు, కాంగ్రెస్ ను ఎదుర్కొని ఎలా నిలబడతారు అనేది చూడాలి.