మూడు ముక్కలు కాబోతున్న పాకిస్తాన్, తాలిబన్లతో యుద్ధమే పాక్ అంతమా?

చెరపకురా చెడేవు.. అన్న సామెత పాకిస్తాన్‌కు అచ్చంగా అతికినట్టు సరిపోతుంది. భారత్ నుంచి కశ్మీర్‌ను విడగొట్టడానికి దశాబ్దాలుగా కుట్రలు చేస్తూ వచ్చిందా దేశం. అందుకు మిలటరీని, నిఘా సంస్థలను ఉసిగొల్పింది. అవి కాస్తా సొంతంగా ఉగ్రవాదమనే భూతాన్ని సృష్టించాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 30, 2024 | 05:46 PMLast Updated on: Dec 30, 2024 | 5:46 PM

Pakistan To Be Divided Into Three Parts Is War With The Taliban The End Of Pakistan

చెరపకురా చెడేవు.. అన్న సామెత పాకిస్తాన్‌కు అచ్చంగా అతికినట్టు సరిపోతుంది. భారత్ నుంచి కశ్మీర్‌ను విడగొట్టడానికి దశాబ్దాలుగా కుట్రలు చేస్తూ వచ్చిందా దేశం. అందుకు మిలటరీని, నిఘా సంస్థలను ఉసిగొల్పింది. అవి కాస్తా సొంతంగా ఉగ్రవాదమనే భూతాన్ని సృష్టించాయి. దాన్ని ఉసిగొల్పి.. జిహాద్ పేరిట విధ్వంసాన్ని సృష్టించారు. కానీ, చేసిన పాపం ఊరికేపోదు కదా.. ఇప్పుడు టీటీపీ రూపంలో తాను తవ్వుకున్న గోతిలోనే తానే పడుతోంది. సింపుల్‌గా చెప్పాలంటే మన దేశాన్ని విడగొట్టాలని పగటి కలలు కన్న పాకిస్తానే మూడు ముక్కలుగా మారేందుకు రంగం సిద్ధమైంది. అందుకు ఆఫ్ఘాన్ తాలిబన్లతో యుద్ధం ఒక ఆరంభం మాత్రమే. ఈ మాట స్వయంగా తాలిబన్ల నోటి నుంచే వచ్చింది. ఆ డీటెయిల్స్ ఇవాల్టి టాప్ స్టోరీలో చూద్దాం..

అది 1971.. తూర్పున ఉన్న బెంగాలీ ప్రాంతం స్వేచ్ఛకోసం పోరాడి భారత సైన్యం సాయంతో స్వతంత్రం సంపాదించుకుంది. బంగ్లాదేశ్‌గా అవతరించింది. పశ్చిమాన ఉన్న ప్రాంతం మాత్రమే పాకిస్తాన్‌గా మిగిలింది. ఇది ఆ దేశ చరిత్రలోనే ఓ పీడకలగా మిగిలిపోయింది. ఇప్పుడు పాకిస్తాన్‌లో మళ్లీ ఆ సిట్యువేషనే కనిపిస్తోంది. ఎందుకంటే, తమ దేశంపై వైమానిక దాడుల తర్వాత పాకిస్తాన్‌పై ప్రతీకార దాడులకు దిగిన తాలిబన్లు ఇప్పుడు మరో సంచలన ప్రకటన చేశారు. పాకిస్తాన్‌లోని కీలక ప్రాంతం ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్స్ తమదే అంటున్నారు. ఈ ప్రకటన స్వయంగా ఆఫ్ఘాన్ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఇనాయతుల్లా ఖ్వారిజ్మీనే చేశారు. అంటే, ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్స్‌ను తాము ఆక్రమించుకోబోతున్నాం అని ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారన్నమాట.

ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్స్ ఆఫ్ఘనిస్తాన్‌ను ఆనుకునే ఉంటుంది. ఈ ప్రాంతంలో పాకిస్తాన్ పెంచి పోషించిన తెహ్రీక్-ఇ-తాలిబన్ల ప్రాబల్యం ఎక్కువ. ఎంతలా అంటే అక్కడి గిరిజన ప్రాంతాల్లో పాకిస్తాన్ చట్టాలకు విలువే ఉండదు. తాలిబన్లు చేసిందే చట్టం, చెప్పిందే న్యాయం, ఇప్పటికే తన ఆర్థిక పరిస్థితి దిగజారపోవడంతో పాకిస్తాన్ ప్రభుత్వం ఏం చేయలేని పరిస్థితి నెలకొంది. 2023 జనవరిలో పాకిస్తాన్ అప్పటి అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి రాణా సనావుల్లా మిలిటరీ యాక్షన్‌పై కామెంట్స్ చేశారు. దీనికి కౌంటర్‌గా తాలిబన్లు 1971లో భారత సైన్యం ముందు లొంగిపోయిన పాకిస్తాన్ ఆర్మీ ఫొటోను షేర్ చేసి.. మరోసారి మిలిటరీ యాక్షన్ అంటే ఇదే రిపీట్ అవుతుందని వార్నింగ్ ఇచ్చారు. ఇప్పుడు అన్నంత పనీ చేయడానికి సిద్ధం అవుతున్నారు. అందులో భాగంగానే ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్స్ తమదే అని తేల్చి చెప్పారు. కానీ, ఖైబర్ ఫఖ్తుంఖ్వాను తాలిబన్లు ఆక్రమించుకున్నంత మాత్రాన పాకిస్తాన్ మూడు ముక్కలు ఎలా అవుతుంది? అసలు కథ ఇప్పుడే మొదలైంది.

పంజాబ్, సింధ్, బలూచిస్తాన్, ఖైబర్ ఫఖ్తుంఖ్వా.. పాకిస్తాన్‌లోని మొత్తం రాష్ట్రాలు ఈ నాలుగే.
పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌‌లో రెండు ప్రాంతాలు ముజఫరాబాద్‌, గిల్గిట్-బాల్టిస్థాన్‌ ఉన్నాయి. ప్రస్తుతం ఒక పంజాబ్‌ మినహాయించి మిగిలిన ప్రాంతాల్లో వేర్పాటువాదం పెచ్చరిల్లుతోంది. ఇది క్రమంగా విస్తరిస్తే ఆ దేశం తన అస్థిత్వాన్నే కోల్పోతుంది. పాక్‌లో పంజాబ్‌ ప్రాంతానికి చెందిన వారి ఆధిపత్యం ఎక్కువగా ఉంది. జనాభాలో ఈ రాష్ట్ర వాటా దాదాపు 40 శాతం. అయితే వనరులు మాత్రం అందుకు సరిపడా లేవు. అందుకే ఇతర రాష్ట్రాల నుంచి వనరులను దోచిపెట్టి పంజాబ్‌కు ఇస్తున్నారనే వాదన ఉంది. సైన్యం, దేశ పాలనలో కూడా వీరిదే సింహభాగం కావడంతో వీరు ఆడిందే ఆట, పాడిందే పాటగా మారింది. ఈ ఆధిపత్య ధోరణికి నిరసనగా వేర్పాటువాదం బలపడింది. అది ఏ స్థాయిలో ఉందీ అంటే పాకిస్తాన్‌లో రక్తపాతం సృష్టిస్తున్న మెజారిటీ దాడులకు వేర్పాటువాదులే కారణం. వారిలో బలూచీలది మొదటి స్థానం.

నిజానికి.. పాకిస్తాన్ ఏర్పాటుకు ముందు బలూచిస్తాన్‌తో ఆ దేశానికి ఎలాంటి సంబంధం లేదు. ఎందుకంటే బ్రిటిష్ పాలనలో బలూచిస్తాన్ ఓ సంస్థానం. పాకిస్తాన్ ఏర్పాటు తర్వాత స్వతంత్రంగా ఉన్న బలూచిస్తాన్‌ను 1948లో ఆక్రమించుకుంది. అప్పటి నుంచి అక్కడి ప్రజలు బలూచ్ లిబరేషన్ ఫ్రంట్ పేరుతో పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. బలూచిస్తాన్‌లో తీవ్రమైన మానవహక్కుల ఉల్లంఘనలకు పాల్పడింది పాక్ ప్రభుత్వం. తమకు ఎదురుతిరిగిన వాళ్లను ఆచూకీ లేకుండా చేసింది. ఎప్పుడైతే అణచివేతలు తీవ్రమయ్యాయో బలూచ్ లిబరేషన్ ఆర్మీ పేరుతో ప్రజలు ఎదురుతిరగడం మొదలుపెట్టారు. ఈ గ్రూపు చైనా-పాకిస్తాన్‌ ఎకనామిక్‌ కారిడార్‌ ప్రాజెక్టులను వ్యతిరేకిస్తోంది. ముఖ్యంగా చైనా పెట్టుబడులను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. బలూచిస్తాన్‌లోని గ్యాస్‌, ఖనిజ వనరులను చైనా, పాక్‌ దోపిడీ చేస్తున్నాయని ఆరోపిస్తోంది. చైనా-పాకిస్తాన్‌ ఎకనామిక్‌ కారిడార్‌‌లో భాగంగా ఇక్కడి గ్వాదర్‌ పోర్ట్‌, ఇతర ప్రాజెక్టుల అభివృద్ధిలో చైనా పాలుపంచుకున్న నేపధ్యంలో ఆ ప్రాజెక్టులే లక్ష్యంగా దాడులు చేస్తోంది.

బలూచ్ తర్వాత ఆజాదీ కోసం పోరాడుతున్న మరో ప్రాంతం సింధ్. బ్రిటిష్ వారు తాము ఆక్రమించిన సింధూ రాజ్యాన్ని బలవంతంగా పాకిస్తాన్‌లో కలిపారు. నాడు మొగ్గ తొడిగిన పోరాటం యాభై ఏళ్లుగా వృద్ధి చెందుతూ వచ్చింది. దేశ విభజన అనంతరం లక్షలాదిమంది ముహజర్లు భారత్‌ నుంచి సింధ్‌కు వచ్చి స్థిరపడ్డారు. వీరిని పంజాబీ పాలకులు చిన్నచూపు చూడటంతో తమకు ప్రత్యేక దేశం ఇవ్వాలన్న ఉద్యమం ప్రారంభమైంది. స్థానిక సింధ్‌ ప్రజల నుంచి ఈ డిమాండ్‌కు పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది. దేశానికి జీవనాడైన కరాచీ పోర్టు ఇక్కడే ఉంది. పాకిస్తాన్ ఇప్పటి వరకూ సుమారు 60 మంది సింధ్ దేశ్ కీలక నేతలను హతమార్చింది. వేల మందిని జైళ్లలో బంధించింది. ప్రభుత్వ అణచివేతకు వ్యతిరేకంగా సింధ్ దేశ్ పీపుల్స్ ఆర్మీ లాంటి సంస్థలు దాడులకు పాల్పడుతున్నాయి. ఇలా పంజాబ్ మినహా మిగిలిన మూడు రాష్ట్రాలూ ఎప్పుడు పాక్ చెర నుంచి బయటపడదామా అని చూస్తున్నాయి. ఈ పరిస్థితులకు కారణం ఎవరో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. చెరపకురా చెడేవు అని ఊరికే అనలేదు.