పీవోకే స్వాధీనం దిశగా మాస్టర్ స్ట్రాటజీ పాకిస్తాన్ మైండ్ బ్లాంక్ చేసిన ఇండియా
పాకిస్తాన్ ఇప్పుడో సమస్యల పుట్ట. ప్రజలకు మూడు పూటలా తిండి పెట్టే పరిస్థితి లేదు. కనీస అవసరాలు తీర్చే అవకాశాలు లేవు. ఇది సరిపోదన్నట్టుగా పాలు పోసి పెంచిన ఉగ్రవాదం ఆ దేశంపైనే తిరగబడుతున్న పరిస్థితి.

పాకిస్తాన్ ఇప్పుడో సమస్యల పుట్ట. ప్రజలకు మూడు పూటలా తిండి పెట్టే పరిస్థితి లేదు. కనీస అవసరాలు తీర్చే అవకాశాలు లేవు. ఇది సరిపోదన్నట్టుగా పాలు పోసి పెంచిన ఉగ్రవాదం ఆ దేశంపైనే తిరగబడుతున్న పరిస్థితి. అది కూడా సరిపోదన్నట్టుగా అణచివేస్తున్నారంటూ ఆక్రమిత కశ్మీర్ ప్రజలు ప్రభుత్వంపై విరుచుకుపడున్నారు. మరే దేశానికైనా ఇన్ని సమస్యలుంటే పరిష్కారాల కోసం పాలకులు పని చేస్తారు. ఎలాగోలా ఆ కష్టాల నుంచి దేశాన్ని బటయపడేస్తారు. కానీ, పాకిస్తాన్ పాలకులకు మాత్రం దేశంలో ఎన్ని సమస్యలు ఉన్నా వాటన్నింటికీ ఒక్కటే సొల్యూషన్. అదే కశ్మీర్.! రాజకీయంగా పబ్బం గడుపుకోడానికి కశ్మీర్ అంశం వారికో అక్షయ పాత్రలా మారింది. ఇప్పుడు కూడా అదే చేసి ఇండియాతో చీవాట్లు తింది. ఇంతకూ, కశ్మీర్‌పై పాకిస్తాన్ చేసిన ఆ కుట్రలేంటి? దానికి మోడీ సర్కార్ ఎలాంటి కౌంటర్ ఇచ్చింది? ఇవాల్టి టాప్ స్టోరీలో చూద్దాం..
పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీలో కీలక చర్చ జరుగుతోంది. అప్పుడే ఆ దేశ మంత్రి ఇంజనీర్ అమీర్ ముకమ్ ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఆ తీర్మానం సారాంశం మన కశ్మీర్‌లో ప్రజల హక్కుల కోసం పాక్ నైతిక, రాజకీయ, దౌత్యపరమైన మద్దతు ఇస్తుందని చెప్పడం. అంతేకాదు, కశ్మీర్‌లో ప్రజలు ప్రజాస్వామ్య హక్కులను వినియోగించుకునేందుకు వీలుగా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానాలను భారత్ అమలు చేయాలనీ.. కశ్మీర్‌లో ప్రజాభిప్రాయ సేకరణకు అనుమతించాలని తీర్మానం చేశారు. ఆ తీర్మానా న్ని ఆ దేశ పార్లమెంటు ఏకగ్రీవంగా ఆమోదించింది కూడా. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆ తీర్మానాన్ని అక్కడి విపక్షాలు బాయ్‌కాట్ చేశాయి. ఇదే సమయంలో ఐక్యరాజ్యసమితిలో చర్చ సందర్భంగా పాకిస్తాన్ తీరుపై భారత ప్రతినిధి నిప్పులు చెరిగారు. గతేడాదే కశ్మీర్‌లో ప్రభుత్వాన్ని ఎన్నుకోడానికి ప్రజలు పెద్ద ఎత్తున ఓట్లు వేశారనీ, కొత్తగా ఓటింగ్ నిర్వహించాల్సిన అవసరం లేదన్నారు. కశ్మీర్‌పై పనికి మాలిన ఆరోపణలు మానేసి పాకిస్తాన్ తన అంతర్గత సమస్యలపై ఫోకస్ పెట్టాలని గడ్డి పెట్టారు.
కశ్మీర్‌పై పాకిస్తాన్ తీర్మానం విషయానికి వస్తే.. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానాలను భారత్ అమలు చేయాలనేది దాని అసలు పాయింట్. కాని, అందులో అసలు పాయింటే లేదు. ఒక్కసారి చరిత్రలోకి వెళితే ఆ క్లారిటీ పాకిస్తాన్‌కు వస్తుంది. కశ్మీర్ ఒకప్పుడు స్వతంత్ర సంస్థానం. 1947లో బ్రిటిష్ పాలన ముగిశాక సంస్థానాలపై సర్వాధికారాలు వాటి ప్రభువుల చేతికి వచ్చాయి. భారత్, పాకిస్తాన్ విభజన జరిగిన తర్వాత పూర్వపు సంస్థానాల్లో ఏది ఎటు చేరాలన్న ప్రశ్న వచ్చింది. తమ సంస్థానం భారత్, పాక్ రెండింట్లో ఏ దేశంలో కలిసేదీ నిర్ణయించే అధికారం ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్టు సంస్థానాధీశులకి ఇచ్చింది. ఆ ప్రకారం జమ్మూ కశ్మీర్ మహారాజు హరిసింగ్ నిర్ణయం చేసేలోపే పాకిస్తాన్ దుర్మార్గంగా దండెత్తించింది. జనావాసాలను కబళిస్తూ పాక్ సైన్యం శ్రీనగర్ దరిదాపులకు వచ్చేసింది. ఆ దశలో కశ్మీర్ మహారాజు హరిసింగ్ తన రాజ్యాన్ని భారత్‌లో చట్టబద్ధంగా, యథావిధిగా విలీనం చేశారు. జమ్మూకశ్మీర్ ఎప్పుడైతే భారత్‌లో విలీనమైందో, దాని ప్రాదేశిక సమగ్రతను రక్షించటం భారత ప్రభుత్వ బాధ్యతైంది. ఆ వెంటనే కశ్మీర్‌లోకి దూసుకొస్తున్న పాక్ సైన్యాన్ని అడ్డుకునేందుకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రంగంలోకి దిగింది.
పాకిస్తాన్ ఆక్రమించుకున్న ఒక్కో ప్రాంతాన్నీ సాధించుకుంటూ ఆర్మీ ముందుకు కదిలింది. మరికొన్ని రోజులు అదే పోరాటం జరిగితే ప్రస్తుతం పీవోకేగా చెబుతున్న ప్రాంతం అప్పుడే ఇండియాలో అంతర్భాగమై ఉండేది. కానీ, అలా జరగలేదు. ఆర్మీ జనరల్స్ వద్దన్నా వినకుండా సైనిక చర్యలను అర్ధాంతరంగా ఆపించేశారు నెహ్రూ. పాక్‌పై ఫిర్యాదు చేస్తూ ఐక్యరాజ్యసమితి గడప తొక్కారు. మహారాజు సంతకంతో ఖరారైపోయిన విలీనాన్ని స్వయంగా తానే తిరగదోడారు. ప్రజాభిప్రాయ సేకరణ జరగాలంటూ దేశంలో మరే సంస్థానానికీ పెట్టని షరతు జమ్మూ కశ్మీర్ విషయంలో ఎవరూ అడక్కుండానే చొప్పించారు. ఆక్రమించిన ప్రాంతాలనుంచి పాకిస్తాన్ వైదొలిగాక ప్లెబిసైట్ జరిపించడానికి ఐక్యరాజ్యసమితి సైతం ఓకే చెప్పింది. అయితే, ఆ ప్రకారం వైదొలగడానికి పాకిస్తాన్ నిరాకరించింది. ఇలా మన కశ్మీర్ పాకిస్తాన్‌లో అంతర్భాగమై పడరానిపాట్లు పడుతోంది. ఇది ఎవరూ చెరిపేయలేని నిజం.
నిజానికి.. మెజారిటీ ప్రజలు తమను భారత్‌లో విలీనం చేయాల్సిందిగా ఓటు వేస్తే పీవోకే భారత్‌లో కలిసి తీరాల్సిందే. అందుకు, సంబంధించిన రిజల్యూషన్ 1948లోనే ఆమోదం పొందింది. 1948లో అప్పటి ప్రధాని నెహ్రూ కశ్మీర్ సమస్యని ఐక్యరాజ్యసమితికి నివేదించడం వలన యూఎన్ ఈ రిజల్యూషన్‌ను అమోదించింది. పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో రెఫరెండం నిర్వహించి, ఓటింగ్ ఆధారంగా అక్కడి ప్రజలు ఎటు వైపు ఉండాలో నిర్ణయించు కుంటారనీ, దాని ప్రకారమే పీవోకే భవిష్యత్ నిర్ణయం జరుగుతుందనేది తీర్మానం సారాంశం. పీవోకేలో ప్రజాభిప్రాయ సేకరణ పూర్తయిన తర్వాత భారత్ అధీనంలో ఉన్న కశ్మీర్ ప్రాంతంలో రెఫరెండం నిర్వహించాలని పేర్కొంది ఐక్యరాజ్యసమితి. కానీ అప్పట్లో రెఫరెండం నిర్వహించడానికి పాకిస్తాన్ నిరాకరించింది. ఐక్యరాజ్యసమితి జస్ట్ భారత కశ్మీర్‌లో మాత్రమే రెఫరెండం నిర్వహించాలని తీర్మానం చేసిందనీ, పీవోకేలో కాదని వాదించింది. వాస్తవం ఏంటంటే.. మొదట పాకిస్తాన్ తన అధీనంలో ఉన్న కశ్మీర్, గిల్గిట్ బాల్టిస్టాన్‌లలో రెఫరెండం నిర్వహించాలి. అది కూడా ఐక్యరాజ్యసమితి పరిశీలక బృందం పర్యవేక్షణలోనే జరగాలి. కానీ, ఇప్పటి వరకూ అది జరగలేదు. ఎందుకంటే, రెఫరెండం నిర్వహిస్తే జరిగేదేంటో ఇస్లామాబాద్‌కు తెలుసు కాబట్టి. ఇవన్నీ తెలిసి కూడా పాకిస్తాన్ ప్రజలను మభ్యపెట్టేందుకు మన కశ్మీర్‌పై తీర్మానాలతో టైం వేస్ట్ చేస్తోంది. పాకిస్తాన్‌కు బుద్ధి రావాలంటే పీవోకేను సైనిక చర్యతో భారత్‌లో విలీనం చేయాలి. అప్పుడుకానీ ఇస్లామాబాద్ దారికిరాదు.