Parliament winter session: పార్లమెంట్ నుంచి 142 మంది ఎంపీల సస్పెన్షన్..
సభా కార్యకలాపాలకు ఆటంకం కలిగిస్తున్నారనే కారణంతో వరుసగా ప్రతిపక్ష ఎంపీలను సస్పెండ్ చేస్తున్నారు. సోమవారం వరకు 92 మంది సభ్యుల్ని సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మంగళవారం మరో 49 మంది ఎంపీలపై వేటు పడింది.

Parliament winter session: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు గందరగోళంగా మారాయి. ఈ నెల 13న లోక్‌సభలో జరిగిన దాడిపై విపక్షాలు నిరసన వ్యక్తం చేయడంతో ఉభయ సభలు అట్టుడికిపోతున్నాయి. భద్రతా వైఫల్యంపై హోంమంత్రి సభలో ప్రకటన చేయాలంటూ విపక్ష ఎంపీలు పట్టుబడుతున్నారు. సభలో విపక్ష సభ్యులు ఆందోళన చేస్తుండటంతో గందరగోళం నెలకొంది.
PM MODI: సికింద్రాబాద్ నుంచి మోడీ.. మెదక్ నుంచి సోనియా.. అగ్రనేతలిద్దరూ తెలంగాణ నుంచే పోటీ?
ఈ నేపథ్యంలో సభా కార్యకలాపాలకు ఆటంకం కలిగిస్తున్నారనే కారణంతో వరుసగా ప్రతిపక్ష ఎంపీలను సస్పెండ్ చేస్తున్నారు. సోమవారం వరకు 92 మంది సభ్యుల్ని సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మంగళవారం మరో 49 మంది ఎంపీలపై వేటు పడింది. ఈ మేరకు స్పీకర్ ఆదేశాలు ధిక్కరించిన సభ్యుల సస్పెన్షన్‌కు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రవేశపెట్టిన తీర్మానాన్ని మూజువాణీ ఓటుతో లోక్‌సభ ఆమోదించింది. దీంతో ఈ రోజు కూడా 49 మంది ఎంపీలు సస్పెన్షన్‌కు గురయ్యారు. లోక్‌సభలో 95 మంది ఎంపీలపై, రాజ్యసభలో 46 మంది ఎంపీలపై సస్పెన్షన్ వేటు పడింది. దీంతో ఈ శీతాకాల సమావేశాల్లో మొత్తం 142 మంది విపక్ష ఎంపీలపై వేటు పడినట్లైంది.
మరోవైపు.. సస్పెన్షన్ కు గురైన ఎంపీలు అడిగిన 27 ప్రశ్నలను లోక్ సభ ప్రశ్నల జాబితా నుంచి తొలగించారు. సస్పెన్షన్‌కు గురైన వారిలో ఎంపీలు సుప్రియా సూలే, ఫరూఖ్ అబ్దుల్లా, శశిథరూర్, మనీశ్ తివారీ, కార్తి చిదంబరం, డింపుల్ యాదవ్, డానిష్ అలీ సస్పెండైన వారిలో ఉన్నారు. ఈ సమావేశాల మొత్తానికి వారిని సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ తెలిపారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ఈ నెల 22,శుక్రవారంతో ముగుస్తాయి.
పార్లమెంట్ సమావేశాల బహిష్కరణ
ఉభయ సభల్లో విపక్ష సభ్యుల్ని బహిష్కరించడంపై ప్రతిపక్ష కూటమి ఇండియా ఆగ్రహం వ్యక్తం చేసింది. తాజా పార్లమెంట్ సమావేశాలను బహిష్కరించాలని ఇండియా కూటమి పక్షాలు నిర్ణయించాయి. మల్లికార్జున ఖర్గే ఛాంబర్‌లో భేటీ అయిన ఇండియా కూటమి పక్షాల ఫ్లోర్ లీడర్లు ఎంపీల సస్పెన్షన్‌కు నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నారు. అనంతరం పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద ప్రతిపక్ష ఎంపిలు ఆందోళన చేపట్టారు.