Patnam Mahender Reddy: కాంగ్రెస్‌లోకి పట్నం మహేందర్ రెడ్డి.. బీఆర్ఎస్, బీజేపీకి షాక్ తప్పదా..?
మరో వారంలోనే పొంగులేటి శ్రీనివాస రెడ్డి, జూపల్లి కృష్ణా రావు ఆ పార్టీలో చేరబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మరింత మంది నేతలు కూడా ఆ పార్టీ వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. వికారాబాద్ జిల్లా, తాండూరు నియోజకవర్గానికి చెందిన మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి కూడా త్వరలో కాంగ్రెస్‌లో చేరబోతున్నట్లు ప్రచారం జరిగింది.
Patnam Mahender Reddy: కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం వస్తున్నట్లే ఉంది. పార్టీలో కొత్త జోష్ కనిపిస్తోంది. ప్రజల నుంచి కూడా మంచి ఆదరణ దక్కుతోంది. దీంతో వరుసగా నేతలు కాంగ్రెస్‌లోకి క్యూ కడుతున్నారు. మరో వారంలోనే పొంగులేటి శ్రీనివాస రెడ్డి, జూపల్లి కృష్ణా రావు ఆ పార్టీలో చేరబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మరింత మంది నేతలు కూడా ఆ పార్టీ వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. వికారాబాద్ జిల్లా, తాండూరు నియోజకవర్గానికి చెందిన మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి కూడా త్వరలో కాంగ్రెస్‌లో చేరబోతున్నట్లు ప్రచారం జరిగింది.
2014లో పట్నం మహేందర్ రెడ్డి బీఆర్ఎస్ తరఫున తాండూర్ నుంచి గెలిచి, మంత్రిగా కూడా పని చేశారు. 2018లో ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఇక్కడ్నుంచి కాంగ్రెస్ తరఫున పైలట్ రోహిత్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచాడు. అనంతరం ఆయన బీఆర్ఎస్‌లో చేరారు. దీంతో ఇప్పుడు తాండూర్ నియోజకవర్గం నుంచి రోహిత్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉండగా, పట్నం మహేందర్ రెడ్డి కూడా కీలకమైన నేతగా ఉన్నారు. రాబోయే ఎన్నికల్లో ఇద్దరిలో ఎవరికి టిక్కెట్ వస్తుందనే చర్చ సాగుతోంది. అయితే, కొన్ని రాజకీయ సమీకరణాల వల్ల రోహిత్ రెడ్డివైపే కేసీఆర్ మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. దీంతో తనకు టిక్కెట్ రాకపోవచ్చని నమ్మిన పట్నం.. కాంగ్రెస్ వైపు చూస్తున్నారనే ప్రచారం మొదలైంది. దీనికోసం ఇప్పటికే కాంగ్రెస్ అధిష్టానంతో ఆయన చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. పట్నం చేరికకు అంగీకరించిన కాంగ్రెస్ ఆయనను త్వరలోనే పార్టీలో చేర్చుకోనుంది. పట్నం మహేందర్ రెడ్డి సతీమణి సునీతా రెడ్డి రంగారెడ్డి జిల్లాలో జెడ్పీ చైర్మన్‌గా చేశారు. అలాగే సోదరుడు పట్నం నరేందర్ రెడ్డి కొడంగల్ నుంచి రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ప్రస్తుతం పట్నం నరేందర్ రెడ్డి రాజకీయ భవిష్యత్ కూడా ప్రశ్నార్థకంగానే ఉంది.
కాంగ్రెస్‌లోకి వరుసగా నేతలు చేరుతుండటంతో ఆ పార్టీలో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. బీఆర్ఎస్‌లో సీటు దక్కని అసంతృప్త నేతలు, బీజేపీ నేతలు కూడా కాంగ్రెస్ వైపే చూస్తున్నారు. మరో ఆరు నెలల్లోనే తెలంగాణలో ఎన్నికలు రాబోతున్నాయి. ఈ లోపు తొందరగా అభ్యర్థుల్ని ప్రకటించాలని బీఆర్ఎస్ భావిస్తోంది. ఇదే జరిగితే అక్కడ సీటు దొరకని నేతలంతా కాంగ్రెస్‌లో చేరిపోవడం ఖాయం. త్వరలోనే కాంగ్రెస్‌లో మరింతమంది నేతలు చేరడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక బీజేపీవైపు ఎవరూ కన్నెత్తి చూసే పరిస్థితి కనిపించడం లేదు.