పవన్‌లో పస అయిపోయింది…!
జనసేన 11 ఏళ్లు పూర్తి చేసుకుని 12 ఏటా అడుగుపెడుతున్న సందర్భంగా జరిగిన ఆవిర్భావ సభ... మొత్తం జనానికి బోర్ కొట్టించింది. సభకు వచ్చిన వాళ్ళు ,టీవీ చూసిన వాళ్ళు కూడా పవన్ స్పీచ్ తలనొప్పి తెప్పించిందని తిట్టుకున్నారు.

జనసేన 11 ఏళ్లు పూర్తి చేసుకుని 12 ఏటా అడుగుపెడుతున్న సందర్భంగా జరిగిన ఆవిర్భావ సభ… మొత్తం జనానికి బోర్ కొట్టించింది. సభకు వచ్చిన వాళ్ళు ,టీవీ చూసిన వాళ్ళు కూడా పవన్ స్పీచ్ తలనొప్పి తెప్పించిందని తిట్టుకున్నారు. సభ యావత్తు విపరీతమైన పవన్ కళ్యాణ్ భజన, పవన్ సొంత డబ్బా…100% స్ట్రైక్ రేటు… మెగాస్టార్ కుటుంబ భజన కార్యక్రమంలా కొనసాగింది. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన పవన్ అభిమానులు… జనసేన కార్యకర్తలు చివరికి తిట్టుకుంటూ ఇంటి బాట పట్టారు.9 నెలల కూటమి పాలన గురించి గానీ, తన భవిష్యత్తు ప్రణాళికలు గాని, పిఠాపురం అభివృద్ధి గురించి గానీ, పార్టీ భవిష్యత్తు గురించి గానీ ఒక్క ముక్క మాట్లాడకుండా, కేవలం తన గురించి తాను మరోసారి సొంత డబ్బా కొట్టుకోవడానికి పవన్ ఈ వేదికను పూర్తిగా వాడుకున్నాడు.పిఠాపురంలో జనసేన ఆవిర్భావ సభ పై పార్టీ కార్యకర్తలు, సామాన్య జనం కూడా చాలా అంచనాలు పెట్టుకున్నారు. అందుకు తగినట్టే జనసేన చాలా బాగా జన సమీకరణ చేయగలిగింది. అధికారం ఉంటే ఏదైనా ఎలా సాధ్యమవుతుందో ఈ సభ నిరూపించింది. డబ్బు లేని రాజకీయం చేయాలంటూ నినాదం ఇచ్చిన పవన్ కళ్యాణ్ ఈ సభ నిర్వహణకు మాత్రం కోట్ల రూపాయలు ఎందుకు ఖర్చు పెట్టారో, ఎక్కడి నుంచి తెచ్చి ఖర్చు పెట్టారో చాలామందికి అర్థం కాలేదు.
వేదికపై ఉన్న నాయకులు అంతా పవన్ భజన చేయడానికి సమయం మొత్తం వినియోగించారు.సరే కార్యకర్తలు…. ఎమ్మెల్యేలు… నేతలు అధినాయకుని భజన చేయడం, పొగడటం ఎక్కడైనా జరిగేది. ఇక్కడ మాత్రం పరస్పర డబ్బాతో పాటు స్వడబ్బా కూడా మార్మోగిపోయింది. పాడిందే పాట పాచిపళ్ళ దాసరి తరహాలో 11 ఏళ్లుగా చెప్పిన పురాణమే చెప్పి తలనొప్పి తెప్పించాడు పవన్. ఎప్పటిలాగే నెల్లూరు పురాణం వినిపించాడు. డాక్టర్ కరీముల్లా … ఆస్తమా మెడిసిన్ కథ మనకు తెలిసిందే. పవన్ కళ్యాణ్ చిన్నప్పటి కథలు… ఆయన విన్యాసాలు… మార్షల్ ఆర్ట్స్…. అన్ని గతంలో కొన్ని వందలసార్లు పవన్ కళ్యాణ్ జనానికి చెప్పి చెప్పి బోర్ కొట్టిచ్చాడు. మళ్లీ తన ఆత్మ కథనే ఆవిర్భావ సభలోనూ వినిపించాడు.ఇక్కడితో అయిపోలేదు. మళ్లీ ఎప్పటిలాగే…. మెగా కుటుంబ చరిత్ర,పవన్ కళ్యాణ్ తండ్రి వెంకట్రావు గారి క్రమశిక్షణ, పవన్ డిగ్రీ చదువుకోలేకపోవడం, చిరంజీవి త్యాగాలు, నాగబాబు అందించిన జ్ఞానోదయం…. మెగా కుటుంబ కదంబం లా సాగింది పవర్ స్పీచ్.
450 మంది జన సైనికులు బలయ్యారు అంటూ పవన్ కళ్యాణ్ చెప్పిన కొత్త విషయం…. కొద్దిసేపు అందరినీ కంగారు పెట్టేసింది. అసలు జనసేన కార్యకర్తలు ఉద్యమాలు ఎప్పుడు చేశారు? 450 మంది జన సైనికులు బలైపోవడం ఏమిటి? ఇది ఎప్పుడు జరిగింది? అని జనం అంతా బెంబేలెత్తిపోయారు. తీరా చూస్తే…. గడచిన 11 ఏళ్లలో ఆ పార్టీకి సంబంధించి 450 మంది కార్యకర్తలు రకరకాల కారణాలతో సహజ మరణం పొందారు. కొందరు ప్రమాదాల్లో చనిపోయారు. వాళ్లకు పార్టీ ఇన్సూరెన్స్ చేయించడం వల్ల ఆర్థిక సహాయం అందింది. అంతేగాని వాళ్లెవరో ఉద్యమాలు చేసి వీరమరణం పొందలేదు. ఆ విషయం స్పష్టంగా చెప్పలేకపోయాడు పవన్ కళ్యాణ్
పదహారేళ్లు రాజకీయాల్లో ఉన్నప్పటికీ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి లాగే పవన్ కళ్యాణ్ ఇంకా పేపర్ల పై రాసి కొచ్చి ప్రసంగిస్తున్నాడు. పిఠాపురం సభ లో ఆయన ప్రసంగం మొత్తం పేపర్ పై రాసుకొని వచ్చి చదివాడు. అట్లాగే గుంటూరు శేషేంద్ర శర్మ, గీతాంజలి లో ఒక నాలుగు లైన్లు, చివర్లో శ్రీశ్రీ పద్యం… తో ముగిసింది పవన్ ప్రసంగం. ఇవన్నీ పవన్ కళ్యాణ్ సొంతమాటలు కాదని త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎక్కడి నుంచో ఎత్తి రాసినవని జనం అందరికీ తెలిసిందే. అర్థం కూడా తెలియకుండా… పదాలు బాగున్నాయని మళ్లీ మళ్లీ అదే చెప్తే… జనం నవ్వుకోరా?పవన్ ప్రసంగంలో 40 ఏళ్ల టిడిపిని నేనే బతికించాను అంటూ పదేపదే చెప్పుకోవడం వికారం పుట్టించింది.100% స్ట్రైక్ రేట్ టిడిపి ఓట్లు లేకుండానే వచ్చిందా? జనసేన కార్యకర్తలను ఉత్తేజపరచడానికి ఇలాంటి మాటలు పనికొస్తాయేమో తప్ప…. టిడిపి తో దూరం పెంచుతాయని పవన్ ఎందుకు గుర్తించడు? 40 ఏళ్ల చరిత్ర ఉన్న
టిడిపిని అవమానించినట్లు కాదా?
ఇంత పెద్ద సభని నాగబాబు ఒక్క మాటతో కంపు చేసి పడేసాడు. పిఠాపురం వర్మని వెక్కిరిస్తూ పవన్ కళ్యాణ్ గెలుపులో నీకు ప్రమేయం లేదని పరోక్షంగా తిట్టిపోశాడు. తద్వారా రగులుతున్న వివాదాన్ని మరింత రాజేశాడు.ఈ తొమ్మిది నెలల కూటమి పాలన ఎలా సాగింది? ప్రజలకు ఏమేం చేసాం? రాబోయే నాలుగేళ్లలో ఏం చేయబోతున్నాం? తన రాజకీయ విధానం ఏంటి? పార్టీని మరింత ఎలా బలోపేతం చేయబోతున్నాం? తనను గెలిపించిన పిఠాపురం నియోజకవర్గానికి ఏం చేయబోతున్నాం అనేవి పవన్ తన స్పీచ్ లో ఎక్కడ చెప్పలేకపోయాడు.జనానికి అర్థం కాని , అవసరం లేని సనాతన ధర్మం గురించి పదే పదే చెబుతూ తాను పూర్తిగా బిజెపి డైరెక్షన్లో ఉన్నానని విషయాన్ని మాత్రం స్పష్టం చేయగలిగాడు పవన్ కళ్యాణ్.తమ్ముడి ప్రసంగం చూసి తాను పులకరించి పోయానని ట్విట్ చేశాడు చిరంజీవి . అట్టర్ ప్లాప్ అయిన సినిమా కూడా సూపర్ హిట్ అయింది అని చెప్పడం సినిమా వాళ్లకు అలవాటైన పనే కదా
ఈ ఓవరాల్ ఎపిసోడ్ ని మొత్తం చూసి నవ్వుకుంటున్న ఒకే ఒక వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఇప్పటికీ… ఎప్పటికీ ఎదగని పవన్ కళ్యాణ్
ఇలాగే ఉండాలి అని, స్పష్టత లేని విధానాలతో చిందరవందర రాజకీయం చేస్తూ ఉండాలని చంద్రబాబు నాయుడు గారు మనసులో అనుకుంటూ ఉండొచ్చు.