నన్ను పోర్టు కి రానివ్వడా..? వాడిని పీకెయ్యండి..! సీఎం తో డిప్యూటీ సీఎం భేటీ..
ఆంధ్రప్రదేశ్ లో కాకినాడ పోర్ట్ వేదికగా కీలక రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కాకినాడ పర్యటన తర్వాత రాజకీయంగా కాస్త ఏం జరగబోతుంది అనే ఆసక్తి పెరిగిపోయింది.
ఆంధ్రప్రదేశ్ లో కాకినాడ పోర్ట్ వేదికగా కీలక రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కాకినాడ పర్యటన తర్వాత రాజకీయంగా కాస్త ఏం జరగబోతుంది అనే ఆసక్తి పెరిగిపోయింది. కాకినాడ పర్యటనలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు, ఆ తర్వాత పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బయటపెట్టిన కీలక అంశాలు ఇప్పుడూ ఏపీ రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపుతున్నాయి. ముఖ్యంగా కాకినాడలో అక్రమ రేషన్ బియ్యం దందా వ్యవహారంలో అసలు కీలక వ్యక్తులు ఎవరున్నారు… అలాగే దీని వెనక ఉన్నతాధికారులు ఉన్నారా…? గత ప్రభుత్వంలో ఎవరు ఈ రేషన్ బియ్యం దందా వ్యవహారంలో కీలకంగా వ్యవహరించారు అనే అంశాలపై ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టింది.
అలాగే రేషన్ బియ్యం సరఫరా వాహనాల ద్వారా గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి కాకినాడ పోర్టుకు పెద్ద ఎత్తున అక్రమ రేషన్ బియ్యం తరలిస్తున్నట్టుగా పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. దీనితో ఈ అక్రమ రేషన్ బియ్యం దందాలో కీలకంగా మారిన వాహనాలపై ఇప్పుడు అధికారులు ఫోకస్ పెట్టారు. ఇక రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు కూడా వ్యవహారంపై సీరియస్ గా ఉండటంతో క్షేత్రస్థాయిలో పరిస్థితుల్లో మార్పు మొదలైనట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ తరుణంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ కానున్నారు. సోమవారం మధ్యాహ్నం జరగనున్న ఈ భేటీ తర్వాత పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనే ఆసక్తి రాజకీయ వర్గాలతో పాటుగా సామాన్య ప్రజల్లో కూడా నెలకొంది.
కాకినాడ పర్యటనలో పవన్ కళ్యాణ్ కీలక విషయాలను స్వయంగా తెలుసుకున్నారని, అలాగే అక్కడి క్షేత్రస్థాయి అధికారులతో ఆయన స్వయంగా మాట్లాడి పలు కీలక అంశాలపై ఒక స్పష్టతకు వచ్చారని, ఈ అంశాలపై ఒక నివేదికను స్వయంగా తయారు చేసిన పవన్ కళ్యాణ్ దానిని చంద్రబాబుకు అందించేందుకు సిద్ధంగా ఉన్నారని అంటున్నారు. పలువురు రాజకీయ నాయకులు అలాగే కీలక అధికారులు, జిల్లాలో ఉన్నత పోలీసు అధికారులపై పవన్ కళ్యాణ్ నివేదిక తయారు చేశారు. ముఖ్యంగా ఎస్పీ విషయంలో పవన్ కళ్యాణ్ సీరియస్ గా ఉన్నారు. తాను పర్యటనకు వస్తున్నానని తెలిసిన తర్వాత ఎస్పీ లీవ్ లో వెళ్లడం పై పవన్ కళ్యాణ్ సీరియస్ గా ఉన్నారు.
ఎస్పీ పని తీరుపై ప్రత్యేకంగా ఇప్పటికే ఆయన ఓ నివేదిక తయారు చేసి సిద్ధంగా ఉంచారు. ఇక పవన్ కళ్యాణ్ పర్యటనలో కాకినాడ పోర్ట్ లో పొంతనలేని సమాధానాలు ఇచ్చిన డి ఎస్ సి ఓ ప్రసాద్ పై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ప్రసాద్ ను కమిషనరేట్ లో రిపోర్ట్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఆ పదవిలో లక్ష్మీదేవికి బాధ్యతలు అప్పగించారు. అలాగే పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో బేటి అయిన తర్వాత మరికొందరు అధికారులపై వేటు పడే అవకాశం కనబడుతోంది. ముఖ్యంగా పోలీసు ఉన్నతాధికారులు అలాగే రెవెన్యూ అధికారులు పై చర్యలు తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది.
అలాగే ఈ భేటీలో రాజకీయపరమైన అంశాలు కూడా చర్చకు వచ్చే అవకాశం కనబడుతోంది. త్వరలో జరగనున్న రాజ్యసభ ఎన్నికల్లో అభ్యర్థులను ఖరారు చేసే అంశంపై ఇద్దరు మధ్య చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది. జనసేన తరఫు నుంచి నాగబాబు పోటీ చేస్తారనే వార్తలు కూడా వస్తున్నాయి. అలాగే ఓ స్థానాన్ని బిజెపికిచ్చేందుకు చంద్రబాబు నాయుడు సుముఖంగా ఉన్నారు. ఈ అంశాలపై ఇప్పుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు మధ్య చర్చలు జరగనున్నాయి. అలాగే సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్టులు పెడుతున్న వైసీపీ కార్యకర్తలను గత నెల రోజుల నుంచి పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. ఈ చర్యలపై కూడా ఇరువురి మధ్య కీలక చర్చలు జరగనుంది. అలాగే ఇటీవల పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సందర్భంగా రాష్ట్రానికి కావాల్సిన నిధులుపై కేంద్ర మంత్రులతో చర్చించారు. అలాగే రాజ్యసభ సీటు విషయంలో కూడా ఢిల్లీ పెద్దలతో చర్చలు జరిగిన సమాచారం. తన ఢిల్లీ పర్యటన వివరాలను ముఖ్యమంత్రి చంద్రబాబుకు వివరించేందుకు పవన్ కళ్యాణ్ సిద్ధమయ్యారు.