ఆట మొదలెట్టేశారు . పవన్ బి అలర్ట్

అనుకున్న ప్రకారం టిడిపి ఇక తన అసలు ఆట మొదలుపెట్టిందా? సమయం, సందర్భం లేకుండా... పార్టీలో ఈ కొత్త డిమాండ్ ఏంటి? వ్యూహాత్మకంగా... చంద్రబాబు స్టెప్ బై స్టెప్ వేసుకెళ్తున్నారా ?ఒకపక్క ఎల్లో మీడియా అదే డిమాండ్..

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 23, 2025 | 01:00 PMLast Updated on: Jan 23, 2025 | 1:00 PM

Pawan Kalyan Be Alert In Ap Politics

అనుకున్న ప్రకారం టిడిపి ఇక తన అసలు ఆట మొదలుపెట్టిందా? సమయం, సందర్భం లేకుండా… పార్టీలో ఈ కొత్త డిమాండ్ ఏంటి? వ్యూహాత్మకంగా… చంద్రబాబు స్టెప్ బై స్టెప్ వేసుకెళ్తున్నారా ?ఒకపక్క ఎల్లో మీడియా అదే డిమాండ్… మరోవైపు పార్టీ లీడర్లంతా అదే డిమాండ్… లోకేష్ ని డిప్యూటీ సీఎం చేయాలన్న డిమాండ్ వెనక ఏం జరుగుతుంది? చంద్రబాబు రాజకీయ చరిత్ర తెలిసిన వాళ్లంతా పవన్ కళ్యాణ్ బి అలెర్ట్ అని అంటున్నారు.

తెలుగుదేశం పార్టీ దేశంలో అత్యంత నిర్మాణాత్మకమైన ప్రాంతీయ పార్టీ. ఆ పార్టీ స్ట్రక్చర్ సాదాసీదాగా ఉండదు. టిడిపి లో కమ్మ సామాజిక వర్గం అంతర్భాగంగా ఉంటుంది. పార్టీని , కమ్మ కులాన్ని, ఎల్లో మీడియాని విడదీసి చూడలేం. ఆ మూడు తాడులో పెన వేసుకుని ఉండే దారం పోగులు లాంటివి . మరోవైపు బలమైన క్యాడర్ తోపాటు బీసీ నేతల అండ తో కట్టిన కంచుకోట లాంటిది టిడిపి. ఆ పార్టీలో ఎవరు ఎలా పడితే అలా మాట్లాడరు. ఒక స్ట్రక్చరల్ లైన్ అప్ తో ప్రతి మాట బయటకు వస్తుంది. గెలుపు ఓటముల మాట ఎలా ఉన్నా… అంత కంస్ట్రక్టివ్ గా ఆ పార్టీని బలోపేతం చేశారు చంద్రబాబు. అలాంటి పార్టీలో హఠాత్తుగా బాబు ముందే సీనియర్ నేతలు లోకేష్ ని డిప్యూటీ సీఎంని చేయాల్సిందే అని బహిరంగంగా డిమాండ్ చేస్తున్నారు.ఆ డిమాండు రావడానికి కొన్ని రోజులు ముందే ఎల్లో మీడియా దానిని వ్యూహాత్మంగా లేవదీసింది. అంటే అటు ఎల్లో మీడియా… ఇటు పార్టీ నేతలు ఒకే డిమాండ్ ని ఒకేసారి వినిపిస్తున్నారు. ఇలా ఎవరి ప్రమేయం లేకుండా జరగడం టిడిపిలో అసాధ్యం. అందుకే ఈ కొత్త డిమాండ్ పై ఏపీ రాజకీయాల్లో విపరీతంగా చర్చ జరుగుతుంది. పవన్ కళ్యాణ్ జోరుని కంట్రోల్ చేయడానికి టిడిపి అధిష్టానమే నేతలతో ఈ డిమాండ్ లేపిందా అనే సందేహం అందరికీ వస్తోంది.
కడపలో పార్టీ సమావేశం సందర్భంగా సీనియర్ నేత శ్రీనివాస్ రెడ్డి ఈ డిమాండ్లు లేపారు. లోకేష్ ని డిప్యూటీ సీఎంని చేయాలని చంద్రబాబు నాయుడు ముందే ఆయన బహిరంగంగా విజ్ఞప్తి చేశారు.

శ్రీనివాస్ రెడ్డి చిన్న నాయకుడు ఏం కాదు. కడప ఎమ్మెల్యే, ఫైర్ బ్రాండ్ మాధవి రెడ్డి భర్త. టిడిపి జిల్లా అధ్యక్షుడు కూడా. వైయస్ రాజశేఖర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి కుటుంబాల్ని అడ్డుకొని కడపలో రాజకీయం చేస్తున్న వాళ్ళు. అలాంటి నాయకుడు డిమాండ్ వెనక కచ్చితంగా ఏదో ఒక వ్యూహం ఉంటుంది. శ్రీనివాస్ రెడ్డి డిమాండ్ రాగానే… ఏదో సిగ్నల్ అందినట్టు పార్టీలో మిగిలిన నాయకులు కూడా అదే స్టేట్మెంట్ ని రిపీట్ చేశారు. నెల్లూరు సీనియర్ నేత ,మంత్రి… సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కూడా లోకేష్ బాబుని డిప్యూటీ సీఎంని చేయాల్సిందే అని ఎక్స్ లో ట్వీట్ చేశాడు. ఆ వెంటనే పిఠాపురం వర్మ ఆ డిమాండ్ ని సమర్థించారు.

పిఠాపురంలో జనసేనని పవన్ కళ్యాణ్ ని దగ్గరుండి గెలిపించిన వర్మ నోటి నుంచి ఆ డిమాండ్ రావడమే చాలా ఆశ్చర్యం కలిగించింది.
లోకేష్ ని డిప్యూటీ సీఎం నీ చేయాలన్న, డిమాండ్ ని మరికొందరు పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు పోటీలు పడి జనంలోకి వదిలారు.

ఈ పోటీ ఎక్కువ అవ్వడంతో మంత్రి టీజీ భరత్ ఒక అడుగు ముందుకు వేశారు. ఏకంగా దావోస్ లో…. అంతర్జాతీయ వేదికపై గళం విప్పారు. లోకేష్ సీఎం మెటీరియల్ అని… ఆయన కచ్చితంగా ఏపీకి ముఖ్యమంత్రి కావాల్సిందేనని ముందు బహిరంగంగా డిమాండ్ చేశారు.

ఆ వెంటనే …. వ్యవహారాన్ని ఎక్కువ లాగొద్దని…. మరి లాగితే తెగుద్ది అంటూ పార్టీ కార్యాలయం నుంచి హెచ్చరిక వచ్చింది. ఈ డిమాండ్ ఆపాలంటూ ఆదేశాలు విడుదలయ్యాయి. కానీ ఇప్పటికే టిడిపి నేతలు, ఎల్లో మీడియా తాము చేయాల్సిన కార్యక్రమాన్ని పూర్తి చేసేశారు.

అసలు ఇదంతా ఎందుకు వస్తుంది? పార్టీలో ఏం జరుగుతుంది? పరిపాలన వ్యవహారాలను గాలికి వదిలేసి… ఈ పొలిటికల్ డిమాండ్లు ఏంటి? ఇది ఇప్పుడు జనంలో జరుగుతున్న చర్చ. ఏపీ పంచాయతీ రాజ్, అటవీ పర్యావరణ శాఖ మంత్రిగా, డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ కాస్త స్పీడ్ గానే కదులుతున్నారు. ఎక్కువగా జనంలో ఉంటున్నారు. అంతేకాదు ఇతర శాఖలపై కూడా అజమాయిషి చేస్తున్నారు. మంత్రులను హెచ్చరిస్తున్నారు. హోం శాఖ మంత్రి అనితకు పబ్లిక్ గానే వార్నింగ్ ఇచ్చారు. సివిల్ సప్లైస్ మంత్రి నాదెండ్ల మనోహర్ని వెంటబెట్టుకుని వెళ్లి కాకినాడలో రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. ఆదివాసి గ్రామాలకు వెళ్లి రోడ్లు పరిశీలించి వచ్చారు. ఇలా పవన్ కళ్యాణ్ నిత్యం జనంలో తిరుగుతూ…. తాను ఆక్టివ్ లీడర్ ని… సినిమా సెలబ్రిటీ ని కాదు అని పదే పదే నిరూపించుకుంటున్నారు. అంతేకాదు తన సోదరుడు నాగబాబుకి వాటా ప్రకారం రాజ్యసభ సీటు ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు.

అది సాధ్యం కాకపోవడంతో ఏపీ క్యాబినెట్లో మంత్రిగా, ఎమ్మెల్సీగా నాగబాబు పేరు ఖరారు చేయించుకున్నారు. అంటే ఏపీలో కూటమి క్యాబినెట్లో తమ్ముడు డిప్యూటీ సీఎం గా, అన్న మంత్రిగా కొనసాగుతారు. మరోవైపు చంద్రబాబు సీఎంగా, ఆయన కుమారుడు లోకేష్ మంత్రిగా కీలక శాఖలు నిర్వహిస్తున్నారు. నాగబాబు మంత్రివర్గంలో ఎంట్రీ అవుతాడు అనే ప్రకటన వచ్చిన నాటి నుంచి పార్టీలో విస్తృత చర్చ జరుగుతోంది.21 సీట్లున్న పార్టీకి డిప్యూటీ సీఎం, నాలుగు మంత్రి పదవులు… అందులో మళ్ళీ రెండు ఒకే కుటుంబానికి తీసుకున్నప్పుడు… లోకేష్ ని డిప్యూటీ సీఎం ఎందుకు చేయకూడదు అనే చర్చ మొదలైంది. నిజానికి ఏపీలో లోకేష్ ఇప్పుడు షాడో సీఎంగానే అన్ని వ్యవహరిస్తున్నారు.2014 –19 మధ్య ఆయన మంత్రిగా ఉన్నప్పుడు అన్ని ఓపెన్ ఓపెన్ గానే వ్యవహరించేవారు. కానీ ఈసారి మాత్రం లోప్రొఫైల్ మైంటైన్ చేస్తూ… తాను ఎక్కువ అన్నిట్లోనూ జోక్యం చేసుకున్నట్టుగా కనిపించకుండా జాగ్రత్త పడుతున్నారు. అల్లరి కావడానికి ఆస్కారం లేకుండా వ్యవహరిస్తున్నారు.

కానీ ప్రతి కీలక నిర్ణయం , ప్రతి ముఖ్యమైన ఫైల్ , ప్రతి ప్రాజెక్టు అనుమతులు వెనక లోకేష్ పాత్ర కచ్చితంగా ఉంటుంది. చంద్రబాబు సీఈవో స్థాయిని దాటి ఒక సంస్థ అధినేత లాగా మారారు. ఈ టర్మ్ లో ఆయన ఎక్కువగా మానవీయ విలువలు ఉన్న గొప్ప నాయకుడిగా, హ్యూమన్ టచ్ తో, ప్రోగ్రెసివ్ థింకింగ్ తో ఉన్నట్లుగా కలరింగ్ ఇస్తున్నారు. ఒకవేళ ముఖ్యమంత్రిగా తనకు ఇదే చివరి టర్మైతే తెలుగు చరిత్రలో ఒక గొప్ప దార్శనికుడిగా నిలిచి పోవాలి అనే యావ చంద్రబాబులో బాగా కనిపిస్తుంది. అందుకే ఇంతకుముందు కన్నా జనంలోకి ఎక్కువగా వెళ్తున్నారు. ఒక సంస్కరణ వాదిగా తనను ప్రమోట్ చేసుకుంటున్నారు. తెర వెనక పాత్ర మొత్తం లోకేష్ కే వదిలేసారు. పైకి తాను ఎస్టాబ్లిష్ కాకుండా తెర వెనుక వ్యవహారాలన్నీ లోకేష్ నడిపిస్తున్నారు. కానీ లోకేష్ కి హోదా లేకపోవడం అనేది చంద్రబాబు కుటుంబాన్ని ఆలోచనలో పడేసింది. ఇప్పటి నుంచే డిప్యూటీ సీఎం హోదా లో లోకేష్ ఉంటే రేపు భవిష్యత్తులో సీఎంగా ప్రమోట్ కావడానికి మార్గం సుగమం అవుతుంది. అంతేకాక డిప్యూటీ సీఎం హోదాలో పవన్ పూర్తిస్థాయి సీఎం లాగే కొన్నిసార్లు వ్యవహరిస్తున్నారు. ప్రతి విషయాన్ని చాలా ఓపెన్ గానే మాట్లాడుతున్నారు తిరుపతిలో తొక్కిసలాట జరిగితే… క్షమాపణ చెప్తారా ?చెప్పరా? అంటూ టీటీడీ ఈవోని ,జేఈఓ ని, చైర్మన్ బి ఆర్ నాయుడు ని బహిరంగంగా నిలదీశారు. ఆ దెబ్బకి టీడీపీ షాక్ అయిపోయింది.

పవన్ నీ ఇలాగే వదిలేస్తే సీఎం అనే ఒక్క కుర్చీ … హోదా తప్ప మిగిలినవన్నీ చక్కపెట్టేస్తాడా అనే భయం పార్టీలో మొదలైంది. బాబు కుటుంబంలో కూడా ఇదే చర్చ జరిగింది. పవన్ కళ్యాణ్ ఇప్పుడు డిఫరెంట్ పాలిటిక్స్ చేస్తున్నాడు. జనంతో మమేకమై పోతున్నాడు. అవసరమైతే సంక్షోభం లో తాను జనానికి క్షమాపణ చెప్తున్నాడు. ఇదంతా చూస్తుంటే భవిష్యత్తులో పవన్ సీఎం మెటీరియల్ అయినా ఆశ్చర్యం లేదు. అంతేకాదు కళ్యాణ్ వెనుక bjp ఎలాగూ ఉంటుంది. క్రమంగా జనంలో పవన్ పై… అతని అడ్మినిస్ట్రేటివ్ క్యాపబిలిటీస్ పై నమ్మకం పెరిగితే ….ఏంటి పరిస్థితి? అందుకే మన వాడిని కాస్త ముందుకు నెట్టాలి. డిప్యూటీ సీఎం హోదాలో కూర్చోబెడితే భవిష్యత్తులో సీఎం రేసులో ఈజీగా వెళ్ళిపోగలుగుతాడు.

ఇదే ఆలోచనతో టిడిపి ఉంది. అంతే కాదు చంద్రబాబు సతీమణి భువనేశ్వరి ఒత్తిడి కూడా ఉన్నట్లు సమాచారం. అందుకే టిడిపి హై కమాండ్ డైరెక్షన్ తోనే పార్టీలో నేతలంతా లోకేష్ డిప్యూటీ సీఎం నినాదాన్ని ఒక్కసారిగా అందుకున్నారు. మరోవైపు ఎల్లో మీడియా కూడా చంద్రబాబుకు బహిరంగంగానే సలహాలు ఇవ్వడం మొదలుపెట్టింది. జగన్నీ పూర్తిగా, రాజకీయంగా భూస్థాపితం చేయాలని,మరో వైపు పవన్ కళ్యాణ్ ని కంట్రోల్ చేయాలని, లోకేష్ నీ ఇప్పటి నుంచే సిద్ధం చేయాలని కమ్మ సామాజిక వర్గం తరఫున తమ డిమాండ్ చంద్రబాబు ముందు పెట్టింది ఎల్లో మీడియా. వీటన్నిటి బ్యాక్ గ్రౌండ్ తో వచ్చిందే లోకేష్ డిప్యూటీసీఎం డిమాండ్.

పొలిటికల్ గా చంద్రబాబు వ్యూహాలు, స్టెప్పులు తెలిసిన వాళ్లకు ఇదంతా చాలా తేలిగ్గా అర్థం అయిపోతుంది. ఆయన ఏదైనా చేయాలనుకుంటే పార్టీలోని సీనియర్ నేతలతో ముందే ఎక్కడో ఒక చోట ప్రస్తావించేలా ఏర్పాటు చేస్తారు. ఒకసారిగా డిమాండ్ వచ్చిన తర్వాత దానిపై ఎల్లో మీడియా రచ్చ చేస్తుంది చేస్తుంది. ఆ తర్వాత చంద్రబాబు తాను అనుకున్న దాన్ని అమలు చేస్తారు. ఇలాంటివి గతంలో చాలా సందర్భాల్లో జరిగాయి. ఇప్పుడు కూడా లోకేష్ నీ డిప్యూటీ సీఎం చేయాలి అనే డిమాండ్ స్వతహాగా నేతల నుంచి వచ్చింది కాదని,అది ఎక్కడో డిజైన్ చేసి నేతలతో అనిపిస్తున్నారని తెలుస్తుంది.

జీవితంలో,రాజకీయాల్లో విశ్వసనీయత అనేది ఉండదు అనేది చంద్రబాబు బలంగా నమ్ముతారు. ఆయన జీవితంలో అదే ఫార్ములాని మొదటి నుంచి అమలు చేస్తూ వచ్చారు. చంద్రబాబు రాజ్యాంగంలో అవసరాన్ని బట్టి మానవ సంబంధాలు, రాజకీయ సంబంధాలు ఉంటాయి. వాడిని జనం చేత కూడా అలాగే ఆమోదింప చేస్తారాయన. ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడిచి… జనం నుంచి ఆమోదం తెచ్చుకోగలిగారు బాబు.2014లో మోడీని పొగిడి 2019లో అదే మోడీని బండబూతులు తిట్టింది కూడా చంద్రబాబే. మళ్లీ ఇప్పుడు ప్రధాని మోడీ ని ఆహా ఓహో అంటూ ఆకాశానికి ఎత్తిస్తుంది చంద్రబాబే. అందువల్ల పవన్ కళ్యాణ్ తో ఎప్పుడూ ఒకే రకంగా చంద్రబాబు ఉంటారు అని అనుకోలేం. లోకేష్ ని డిప్యూటీ సీఎం చేయాలని నినాదం భవిష్యత్తులో ఎటువంటి రాజకీయ మార్పులకైనా దారి తీయొచ్చు.