TOP STORY; లడ్డు ఎపిసోడ్ లో జోకర్ గా మిగిలిన పవన్…
ఏ పవన్ నహి.... ఆంధీ హై... అంటూ ప్రధాని మోడీ పవన్ కళ్యాణ్ ను తుఫాన్ తో పోలుస్తూ చెప్పిన మాటలు విని అభిమానులు, సాధారణ ప్రజానీకం కూడా పొంగిపోయారు. నిజంగానే తాను తుఫాన్ లాంటివాడిని పవన్ కళ్యాణ్ ప్రాక్టికల్ గా నిరూపించాడు.
ఏ పవన్ నహి…. ఆంధీ హై… అంటూ ప్రధాని మోడీ పవన్ కళ్యాణ్ ను తుఫాన్ తో పోలుస్తూ చెప్పిన మాటలు విని అభిమానులు, సాధారణ ప్రజానీకం కూడా పొంగిపోయారు. నిజంగానే తాను తుఫాన్ లాంటివాడిని పవన్ కళ్యాణ్ ప్రాక్టికల్ గా నిరూపించాడు. ఒక విధానం అంటూ లేకుండా, రోజుకో మాట… పూటకో పాట తో దారి తెన్ను లేని పద్ధతులతో తుఫాన్ లాగే ఎలా పడితే అలా చెలరేగిపోయి ఇప్పుడు పబ్లిక్ కి వెగటు పుట్టిస్తున్నాడు. తిరుమల లడ్డు ఎపిసోడ్లో జనం ముందు జోకర్ గా నిలబడ్డాడు పవన్ కళ్యాణ్. సెప్టెంబర్ 18న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుమల లడ్డులో జంతువుల కొవ్వు కలిసిందని ఆధారాలు లేని ఒక ప్రకటన చేయగానే, పవన్ కళ్యాణ్ కి ఎక్కడలేని పూనకం వచ్చింది. బహుశా బిజెపి అధిష్టానం ఆదేశించిందో, లేక చంద్రబాబు సలహా ఇచ్చాడో కానీ, తిరుమల లడ్డు కల్తీ వల్ల… భారతీయ సనాతన ధర్మానికి కీడు జరిగిందని…. గగ్గోలు పెడుతూ… వెంటనే కాషాయ వస్త్రాలు వేసుకొని…11 రోజుల దీక్ష కూర్చున్నాడు పవన్ కళ్యాణ్.
అంతేకాక ప్రాయశ్చిత్తం చేస్తూ బెజవాడ దుర్గమ్మ గుడిమెట్లను శుద్ధి చేశాడు. అసలు ఈ వ్యవహారంతో సంబంధం లేని తమిళ హీరో కార్తీ ని ఆవేశంతో తూలనాడాడు. ఇక నటుడు ప్రకాష్ రాజ్ నైతే ఏకంగా వార్నింగ్ ఇచ్చాడు. పవన్ కళ్యాణ్ డ్రామా చూసి జనం అందరికీ చికాకు వచ్చింది. సినిమా ప్రమోషన్ కోసం వచ్చిన కార్తీ… లడ్డు సెన్సిటివ్ ఇష్యూ అన్నందుకు అకారణంగా అతని నిందించాడు పవన్. కార్తీ విషయంలో పవన్ ప్రవర్తన చాలామందికి బాధ కలిగించింది. నిన్నటి వరకు కులంతో ఆడుకున్న ఈ నాయకుడు హఠాత్తుగా స్వామీజీ వేషధారణలో వచ్చి సనాతన ధర్మం గురించి చెప్తుంటే, ఆవేశంతో ఊగిపోతుంటే …వీడి ఓవరాక్షన్ తగలడా అని తిట్టుకున్నారు కూడా. జనం మొన్నటి ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ని ఎన్నుకున్నది సనాతన ధర్మాన్ని కాపాడడం కోసం కాదు. ఇది క్లియర్. పవన్ కళ్యాణ్నీ ఎన్నుకున్నది…. రాజమండ్రి కాకినాడ మధ్య రోడ్డు వేయించడానికి, పిఠాపురాన్ని బాగు చేయడానికి, తప్పి పోయిన 30 వేల మంది అమ్మాయిల్ని వెతికి తీసుకురావడానికి.. ఏపీకి ప్రత్యేక హోదా సాధించడానికి, స్టీల్ ప్లాంటును ప్రవేట్ పరం కాకుండా కాపాడడానికి. అవన్నీ గాలికి వదిలేసి సనాతన ధర్మం అంటూ జనం పైకి కొత్త ఫార్ములా ను వదలడానికి కాదు. తిరుమల లడ్డు ఎపిసోడ్లో పవన్ వ్యవహరించిన తీరు చూస్తే…. అతనికి స్థిరమైన అభిప్రాయాలు, విధానాలు ఉండవని మరోసారి రుజువు అయింది.
2014లో టిడిపి బిజెపిలకు మద్దతు పలికిన పవన్, 2019 నాటికి వామపక్ష పార్టీలతో, బీఎస్పీతో పొత్తు పెట్టుకున్నాడు.2024 వచ్చేనాటికి మళ్లీ బిజెపి టిడిపి తో చేతులు కలిపాడు. ఇప్పుడు వైసీపీ వాళ్లను, అవినీతిపరుల్ని జనసేనలో చేర్చుకుంటున్నాడు. 2019లో వామపక్ష భావజాలాలు ఉన్న వ్యక్తి 2024 కి వచ్చేనాటికి కాషాయ భావజాలాన్ని అలాగా ప్రేమించాడో అర్థం కాదు. చే గువేరా నాకు ఆదర్శం అని చెప్పుకున్న వ్యక్తి, గద్దర్ నుంచి ఎన్నో నేర్చుకున్నాను అని చెప్పిన నాయకుడు, హిందూ మత పరిరక్షణ కి ముందుకి దూసుకొచ్చేశాడు. ఎక్కడి చేగువేరా? ఎక్కడ హిందూమతం? ఈ రెండిటికి ఎక్కడైనా లింక్ ఉందా? నమ్ముకొని వెంట తిరిగిన వాళ్ళు అతనిలో పూటకో విధానం.. రోజుకో మాట మాట్లాడలేక పోతున్నారు.
నాకు మతం మీద కులం మీద నమ్మకం లేదన్న మనిషి ఇప్పుడు హిందూ మతం కోసం చచ్చిపోతాను అంటున్నాడు. నేను చాలా ఉద్యమాలు చేశాను అంటాడు. గడచిన 30 ఏళ్లలో ఆయన ఏ ఉద్యమంలో ఉన్నాడో చరిత్ర మొత్తం తిరగేసిన కనబడదు. నేను చావుకు సిద్ధమంటాడు… ఈరోజు వరకు జీవితంలో ఆయన శరీరంపై చిన్న కత్తి ఘాటు కూడా పడలేదు. అసలు పవన్ కళ్యాణ్ ని చంపాల్సిన అవసరం ఎవరికి వస్తుంది? ఆయన ఏ ఉద్యమాలు చేశాడు? ఎప్పుడు అడవుల్లో ఉన్నాడు? కేవలం సినిమా పాపులారిటీతో నాయకుడైనంత మాత్రాన జనం ఆయన ఉద్యమకారుడు గాను, చావుకి సిద్ధమైన నాయకుడు గాను భావిస్తారా? సనాతన ధర్మం గురించి చెప్పే వ్యక్తి మూడు పెళ్లిళ్లు ఎందుకు చేసుకున్నాడని ఎవరైనా ప్రశ్నిస్తే పవన్ కళ్యాణ్ దగ్గర సమాధానం ఉంటుందా? ఒక హీరోయిన్ ప్రతిరోజు నీకు, నీ స్నేహితునికి వ్యతిరేకంగా ఎందుకు ట్వీట్లు పెడుతోంది…. మీరు ఆమెను ఏం చేశారు అని ప్రశ్నిస్తే ఈ సనాతన వాది సమాధానం చెప్పగలడా? రష్యన్ అయినా ఆయన మూడో భార్య తిరుమల వచ్చి డిక్లరేషన్ ఇచ్చి దర్శనం చేసుకోగలరా? ఇలాంటి ప్రశ్నలు చాలా ఉన్నాయి పవన్ కళ్యాణ్ ని నిలదీయడానికి.
ప్రజలు తనని ఎందుకు ఎన్నుకున్నారో… వాళ్లు ఎన్ని ఆశలు పెట్టుకున్నా రో అవన్నీ మర్చిపోయి…. తాడు బొంగరం లేని ఒక లడ్డు కల్తీ ఆరోపణను పట్టుకొని దానిపై దీక్ష…11 రోజులు సమయం వృధా.. దానికి సనాతన ధర్మ పరిరక్షణ అని పేరు పెట్టడం పవన్ కళ్యాణ్ ఎంత అవకాశవాదో చెబుతోంది. నిజంగా నెయ్యిలోను ,లడ్డులోనో కల్తీ జరిగితే ఆ సమస్యని పరిష్కరించడం, దానికి బాధ్యులైన వాళ్ళ పై చర్యలు తీసుకోవడం వదిలేసి, దీక్షలు చేయడం కెమెరాలు ముందు షో చేయడం ,తోటి నటుల్ని కించపరచడం ఇవన్నీ జోకర్ వేషాలు కాకపోతే ఇంకేంటి.? జనం తన గురించి ఏమనుకుంటున్నారని పవన్ కళ్యాణ్ ఒక ఫీడ్ బ్యాక్ తెప్పించుకుంటే బాగుండేది.100% స్ట్రైక్ రేట్ తో జనం జనసేన ని ఎందుకు గెలిపించారు.? ప్రభుత్వంలోనూ అధికారంలోను ఉండి దీక్షలు చేయడానికా? ఆంధ్రప్రదేశ్లో సమస్యలే లేవా? 11 రోజులు దీక్ష అని పేరు చెప్పి సినిమా షూటింగ్ చేసుకోవచ్చా? అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు అవుతుంది. జనానికి ఉపయోగపడే నిర్ణయం ఒకటి లేదు. ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నెరవేర్చలేదు. నేను జనంలోకి వస్తే వరద సహాయక పనులు ఆగిపోతాయి అన్న పెద్దమనిషి, గుడి మెట్లు కడిగితే, తిరుమల మెట్లు ఎక్కితే జనానికి ఇబ్బంది కలగదా? నేను గొడ్డు మాంసం తింటాను, నా భార్య క్రిస్టియన్, నా కూతురికి బాప్టిజం ఇప్పిచ్చాను ఇలాంటి కబుర్లు చెప్పే పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం గురించి మాట్లాడుతుంటే జనం నవ్వుకుంటున్నారు. మీద జనం ఎన్ని ఆశలు పెట్టుకున్నారు.
చంద్రబాబు, టిడిపి అంటే అసహ్యించుకునే వాళ్ళు కూడా కేవలం పవన్ కళ్యాణ్ ని నమ్మి తెలుగుదేశానికి జనసేనకి ఓట్లు వేసి చరిత్రలో కనివిని ఎరగని విజయాన్ని ఇచ్చారు. జగన్ అరాచక పాలనను మరిపించి జనరంజకపాలన అందిస్తారని ఆశించారు. జనం ఓడించిన జగన్ మోహన్ రెడ్డిని రోజుకో కొత్త వివాదంతో తిట్టిపోవడం తప్ప కూటమి సర్కారు చేసింది ఏమీ లేదు. చివరికి పవన్ కళ్యాణ్ లడ్డు కల్తీ వివాదాల్లో దూరి దానికి సనాతన ధర్మం అనే టైటిల్ తగిలించి తిరుమలలో కూడా బ్రష్టు పట్టించాడు. ప్రతి మనిషికి ఓ చరిత్ర ఉంటుంది. అది అతన్ని వెంటాడుతూనే ఉంటుంది. అవన్నీ మర్చిపోయి పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం గురించి మాట్లాడుతుంటే జనం జోకర్ లాగే చూస్తుంటారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరగాల్సింది సనాతన ధర్మ పరిరక్షణ కాదు. ఉద్యోగ కల్పన, అవినీతి నిర్మూలన, విద్యాసంస్థల స్థాపన, రోడ్లు, పోలవరం నిర్మాణం, ప్రత్యేక హోదా, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అడ్డుకోవడం,…. ఇవన్నీ మర్చిపోయి డైవర్షన్ పాలిటిక్స్ కోసం చివరికి వెంకటేశ్వర స్వామిని కూడా బ్రష్టు పట్టించాలనే ప్రయత్నం చేసేవాడు జోకర్ లాగే మిగిలిపోతాడు.