Pawan Kalyan: ఇంకెప్పుడు తెలుసుకుంటారు పవనూ..!
రాజకీయ నేతలు ఆవలిస్తే పేగులు లెక్కపెట్టాలి. కానీ పవన్ కల్యాణ్ కు పూసగుచ్చినట్లు ఎవరైనా చెప్తే తప్ప తెలుసుకునే స్థితిలో లేరని అర్థమవుతోంది. అందుకే ఇప్పటికీ ఎప్పుడు ఎలా, ఎవరితో ఉంటారో ఆయనకే క్లారిటీ ఉండట్లేదు.

ఆంధ్రప్రదేశ్ రాజకీయ పార్టీల్లో జనసేన కూడా ఒకటి. ఇప్పుడున్న పార్టీలన్నీ దిక్కుమాలిన రాజకీయం చేస్తున్నాయని, అందుకే ప్రత్యామ్నాయ రాజకీయ వేదికను ఏపీ ప్రజలకు పరిచయం చేసేందుకే జనసేన ఏర్పాటు చేశానని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ చెప్తుంటారు. అయితే ఆ ప్రత్యామ్నాయం ఏంటో, అది ఎలా ఉంటుందో.. ఆయనకు తప్ప మరెవరికీ తెలీదు. ఇప్పుడున్న పార్టీలతోనే కలిసి పనిచేసేందుకు ఆయన ఉబలాటపడుతుంటారు తప్పా సొంతంగా తాను అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చుకోవడంలో మాత్రం పవన్ ఇప్పటికీ ఫెయిల్ అవుతూనే ఉన్నారు.
జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం గత నెలలో మచిలీపట్నంలో జరిగింది. అప్పుడు ఈసారి గతంలో చేసిన తప్పులు చేయనని, వైసీపీని గద్దె దించేందుకు ఎవరితో అయినా కలుస్తానని చెప్పారు. అంతవరకూ బాగానే ఉంది. అదే వేదికపై బీజేపీపై అసహనం, అసంతృప్తి వ్యక్తం చేశారు పవన్. ఆ పార్టీ బాగుంటే ఇప్పుడు రాష్ట్రానికి, తనకు ఈ గతి పట్టి ఉండేది కాదన్నారు. రోడ్ మ్యాప్ అడిగితే ఇంతవరకూ ఇవ్వలేదన్నారు. అమరావతిని కాపాడుకునేందుకు మార్చే చేపడదామని చెప్తే బీజేపీ పట్టించుకోలేదని విమర్శించారు పవన్. దీంతో ఈసారి ఆ పార్టీతో పని చేసేది లేదని చెప్పేశారు.
ఇంతలోనే పవన్ ఎవరికీ చెప్పాపెట్టకుండానే ఢిల్లీలో దర్శనమిచ్చారు. రెండ్రోజులు ఢిల్లీలోనే మకాం వేసి బీజేపీ పెద్దలను కలవాలనుకున్నారు. కానీ ఆయన ప్లాన్ వర్కవుట్ కాలేదు. మోదీ, అమిత్ షా లాంటి వాళ్లు అపాయింట్ మెంట్ ఇవ్వలేదేమో పాపం. చివరకు నడ్డాతో ఎలాగోలా భేటీ అయ్యారు. అక్కడ కూడా రెండు పార్టీల పొత్తులపై క్లారిటీ తీసుకురావడంలో రెండు పార్టీలూ విఫలమయ్యాయి. తాము సొంతంగా ఎదగాలనుకుంటున్నామని నడ్డా చెప్పినట్టు పవన్ బయట మీడియాకు వెల్లడించారు. అప్పుడైనా పవన్ కు అర్థం కావాలి కదా.. బీజేపీ తనను దేకట్లేదని.. సొంతంగా ఎదగాలనుకుంటోందని..!
రాజకీయ నేతలు ఆవలిస్తే పేగులు లెక్కపెట్టాలి. కానీ పవన్ కల్యాణ్ కు పూసగుచ్చినట్లు ఎవరైనా చెప్తే తప్ప తెలుసుకునే స్థితిలో లేరని అర్థమవుతోంది. అందుకే ఇప్పటికీ ఎప్పుడు ఎలా, ఎవరితో ఉంటారో ఆయనకే క్లారిటీ ఉండట్లేదు. పూటకోమాట మాట్లాడుతుంటారు. రాజకీయాల్లో ఈ వైఖరి చాలా ప్రమాదకరం. జనాల్లో పలుచన అయిపోతుంటారు. ఇప్పటికైనా పవన్ కల్యాణ్ ఈ విషయం గ్రహించి.. సొంతంగా అడుగులు వేయాలి. లేకుంటే ఎన్నేళ్లయినా ఇలాగే బీ-టీం కింద ఉండిపోవాల్సి వస్తుంది.