Pawan Kalyan: బీజేపీని పవన్ పట్టించుకోవడం లేదా..? కొత్త స్ట్రాటజీ ఏంటి..?
పవన్ ఆదివారం కృష్ణా జిల్లా అవనిగడ్డలో వారాహి విజయ యాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా టీడీపీ-జనసేన పొత్తు గురించి మరోసారి స్పష్టంగా చెప్పారు. బీజేపీ కూడా తమ కలిసి వస్తుందని భావిస్తున్నట్లు చెప్పారు. అంటే.. ఈ విషయంలో నిర్ణయం తీసుకోవాల్సింది బీజేపీనే అని తేల్చేశారు.
Pawan Kalyan: ఏపీలో జనసేన-టీడీపీ పొత్తు ఖరారైంది. రాబోయే ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేయడం గ్యారెంటీ. అయితే, ఇక్కడే ఒక అనుమానం కలుగుతోంది. ఈ రెండు పార్టీలతో బీజేపీ కలుస్తుందా..? లేదా..? అనేదే సందేహంగా ఉంది. ఈ విషయంలో ఇంకా బీజేపీ నుంచి ఎలాంటి స్పష్టతా రాలేదు. ఒకవైపు జనసేనతో కలిసి ఉన్నామని చెబుతోంది కానీ.. టీడీపీ కూటమిలో చేరడం గురించి మాత్రం చెప్పడం లేదు. దీంతో బీజేపీ వైఖరి ఏంటో అర్థం కావడం లేదు. ఇదే సమయంలో బీజేపీని పవన్ తేలిగ్గా తీసుకున్నట్లు అర్థమవుతోంది.
పవన్ ఆదివారం కృష్ణా జిల్లా అవనిగడ్డలో వారాహి విజయ యాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా టీడీపీ-జనసేన పొత్తు గురించి మరోసారి స్పష్టంగా చెప్పారు. బీజేపీ కూడా తమ కలిసి వస్తుందని భావిస్తున్నట్లు చెప్పారు. అంటే.. ఈ విషయంలో నిర్ణయం తీసుకోవాల్సింది బీజేపీనే అని తేల్చేశారు. బీజేపీ నిర్ణయంపైనే మూడు పార్టీలు కలిసి పోటీ చేసే అంశం ఆధారపడి ఉంది. నిజానికి ఏపీలో జనసేన-టీడీపీ కూటమితో బీజేపీ కలవడం వల్ల పెద్దగా ఉపయోగం లేదు. అంతే కాదు.. కొన్ని సీట్లు కూడా ఆ పార్టీకి కేటాయించాల్సి ఉంటుంది. దీనివల్ల కూటమికి అదనంగా వచ్చే ఓట్లు, సీట్లు అంటూ ఏమీ లేవు. జనసేన-టీడీపీ ఓట్లే బీజేపీకి బదిలీ అవ్వాలి. బీజేపీకి ఓటు బ్యాంకు లేదు. కాబట్టి, ఆ పార్టీ ఓట్లేమీ కూటమికి పడవు. అందువల్ల కూటమి ద్వారా లబ్ది పొందేది బీజేపీ మాత్రమే. పైగా బీజేపీతో పొత్తు పెట్టుకుంటే ముస్లింలు, క్రిస్టియన్లు వ్యతిరేకంగా మారే అవకాశం ఉంది. బీజేపీతో పొత్తు వల్ల లాభం లేకపోగా.. నష్టం కలిగే ఛాన్స్ కూడా ఉంది. అందుకే పవన్.. బీజేపీతో పొత్తుపై అంతగా ఆసక్తి చూపడం లేదు.
కేంద్రంలో సహకారం కోసమే
బీజేపీతో ఉపయోగం లేదని తెలిసినా.. ఆ పార్టీ మద్దతు కోరడానికి కారణం ఉంది. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉండటమే దీనికి కారణం. ప్రస్తుత ట్రెండ్ చూస్తే రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మోదీ.. మరోసారి గెలవడం, బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం. దీంతో ఇప్పుడప్పుడే టీడీపీ, జనసేన.. చివరకు వైసీపీ కూడా మోదీకి, బీజేపీకి వ్యతిరేకంగా పని చేసే అవకాశం లేదు. కేంద్రంతో సఖ్యతతో ఉండటం ఏ పార్టీకైనా అవసరం. అందువల్లే పెద్దగా ఉపయోగం లేదని తెలిసినా.. బీజేపీతో కలిసి పని చేస్తోంది జనసేన. అయితే, బీజేపీ తమతో కలిసి రాకపోయినా.. ఎలాంటి నష్టం లేదని పవన్ భావిస్తున్నారు. అందుకే ఆ పార్టీని సంప్రదించకుండానే, టీడీపీతో పొత్తుపై ప్రకటన చేశారు. నిజానికి గత ఎన్నికల్లో మైనారిటీలు వైసీపీకి మద్దతు తెలిపారు. ఆ పార్టీ విజయంలో ముస్లింలు, క్రిస్టియన్ల పాత్ర కీలకం. ఈసారి బీజేపీ తమతో వస్తే వారి ఓట్లు మళ్లీ వైసీపీ వైపు మళ్లే అవకాశం ఉంది. అందుకే, బీజేపీ తమతో రాకపోతేనే మేలనే అభిప్రాయం జనసేన నేతల్లో కనిపిస్తోంది. మరి ఈ విషయంలో బీజేపీ ఏం చేస్తుందో చూడాలి.