Pawan Kalyan: బీజేపీతో వెళ్తే ఒక సమస్య.. వెళ్లకపోతే మరో సమస్య..! డైలమాలో పవన్ కల్యాణ్?
బీజేపీ మాత్రం వైసీపీతో సత్సంబంధాలు కలిగి ఉంది. దీంతో వైసీపీ ఓడిపోయినా, గెలిచినా తమకు వచ్చే నష్టం లేదనుకుంటోంది. కానీ టీడీపీ గెలిస్తే తమకు లేనిపోని సమస్యలు వస్తాయనే ఫీలింగ్ లో ఉంది. అందుకే పవన్ కల్యాణ్ ను కూడా టీడీపీతో కలవద్దని హెచ్చరిస్తోంది.

జనసేన అధినేత పవన్ కల్యాణ్ నిన్న టీడీపీ అధినేత చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఇద్దరు రాజకీయ నేతలు భేటీ అయినప్పుడు కచ్చితంగా రాజకీయల ప్రస్తావన ఉంటుంది. వాళ్లిద్దరూ కూడా రాష్ట్ర రాజకీయాలపై మాట్లాడుకున్నారు. అయితే ఏం మాట్లాడుకున్నారనేది ఆసక్తి కలిగించే అంశం. ఎన్నికలు సమీపిస్తుండడంతో అధికారం కోసం టీడీపీ, జనసేన గట్టిగా ట్రై చేస్తున్నాయి. రెండు పార్టీల లక్ష్యం ఒకటే. ఎలాగైనా ఈసారి జగన్ ను గద్దె దించాలి. ఇందుకోసం ఏదైనా చేయాలి.. ఎవరితోనైనా కలవాలి..
జనసేన అధినేత పవన్ కల్యాణ్ మొదటి నుంచి జగన్ ను ఓడించాలని గట్టి కసితో ఉన్నారు. జగన్ పాలనపై ప్రతిసారీ విరుచుకు పడుతూనే ఉన్నారు. ఇక ప్రతిపక్షంగా టీడీపీ కూడా వైసీపీని ఏమాత్రం సహించే పరిస్థితి లేదు. దీంతో ఇద్దరు కలిస్తే వైసీపీని ఓడించడం పెద్ద కష్టంకాదనుకుంటున్నారు. అయితే తమతో పాటు బీజేపీని కూడా కలుపుకుపోవాలనేది వాళ్ల ఆలోచన. కానీ బీజేపీ మాత్రం చంద్రబాబు ఉండే కూటమిలోకి అడుగు పెట్టబోనని తేల్చిచెప్తోంది. బీజేపీని నానా తిట్లు తిట్టిన బాబుతో మళ్ళీ కలవడం ఆ పార్టీకి ఏమాత్రం ఇష్టం లేదు. ఇదే విషయాన్ని పవన్ కల్యాణ్ కు చెప్పేసింది.
పవన్ కల్యాణ్ మాత్రం బీజేపీని కూడా తమ కూటమిలోకి తెచ్చి వైసీపీని ఓడించాలనుకుంటున్నారు. కానీ బీజేపీ మాత్రం వైసీపీతో సత్సంబంధాలు కలిగి ఉంది. దీంతో వైసీపీ ఓడిపోయినా, గెలిచినా తమకు వచ్చే నష్టం లేదనుకుంటోంది. కానీ టీడీపీ గెలిస్తే తమకు లేనిపోని సమస్యలు వస్తాయనే ఫీలింగ్ లో ఉంది. అందుకే పవన్ కల్యాణ్ ను కూడా టీడీపీతో కలవద్దని హెచ్చరిస్తోంది. ఒకవేళ తమను కాదని టీడీపీతో వెళ్తే కొన్ని ఇబ్బందులు ఎదుర్కోక తప్పదని కూడా పరోక్షంగా వార్నింగ్ ఇచ్చింది. దీంతో పవన్ కల్యాణ్ కు ఏం చేయాలో అర్థం కాని త్రిశకుస్వర్గంలో పడిపోయారు.
బీజేపీని కాదని టీడీపీతో వెళ్తే తనకు కొన్ని సమస్యలు వస్తాయని పవన్ కల్యాణ్ గ్రహించారు. సినిమా రంగంలో ఉన్నందున కొన్ని ఫేస్ చేసేందుకు పవన్ కల్యాణ్ సిద్ధం కావాల్సి ఉంటుంది. దీనికి పవన్ కల్యాణ్ సిద్ధమవుతున్నారేమో అనిపిస్తోంది. బీజేపీ చెప్పినట్లు వెళ్తే వైసీపీని ఓడించడం కష్టం. అదే జరిగితే మరో ఐదేళ్లు రాష్ట్రంలో ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. కానీ అందుకు కేడర్ సిద్ధంగా లేదు. అందుకే టీడీపీతో వెళ్లేందుకే పవన్ సిద్ధమయ్యారు. వైసీపీని ఓడించాలనే పట్టుదలతో ఉన్నారు. బీజేపీ ఇబ్బందులు పెట్టినా సరే తను అనుకున్న లక్ష్యాన్ని మాత్రం చేరాలనుకుంటున్నారు పవన్.