Pawan Kalyan: ఢిల్లీ టూర్‌తో పవన్‌లో గందరగోళం.. బీజేపీని వదల్లేడు.. టీడీపీతో కలవలేడు!
టీడీపీ, జనసేన దోస్తీ దాదాపు కన్ఫార్మ్.. సీట్ల పంపకాల పంచాయితీ ఒక్కటే బ్యాలెన్స్ అనుకుంటున్న సమయంలో.. సేనాని హస్తిన పర్యటన రాజకీయంలో కొత్త మలుపునకు కారణం అయింది. వైసీపీని అధికారంలోంచి దింపడమే లక్ష్యంగా బీజేపీ పెద్దల ముందు.. పవన్ కొన్ని ప్రతిపాదనలు పెట్టారు.
Pawan Kalyan: మింగమంటే కప్పకు కోపం.. వదలమంటే పాముకు కోపం… కప్ప ఎవరు, పాము ఎవరు కాదు ఇక్కడ మ్యాటర్. వదలమని, పట్టుకోమని చెప్తున్న వాళ్ల ఇబ్బందే ఇక్కడ అసలు విషయం. జనసేన పరిస్థితి కాస్త అటు ఇటుగా ఇలానే ఉంది ఇప్పుడు ! వాళ్లను వదల్లేని స్థితి.. వీళ్లను వదులుకోకూడని పరిస్థితి. అడకత్తెరలో పోకచెక్కలా అయిపోయింది పవన్ సీన్ ఒకరకంగా! ఏపీ రాజకీయం రోజుకో మలుపు తిరుగుతోంది. ముఖ్యంగా పొత్తుల విషయంలో కనిపిస్తున్న ఎత్తులు అన్నీ ఇన్నీ కావు. టీడీపీ, జనసేన దోస్తీ దాదాపు కన్ఫార్మ్.. సీట్ల పంపకాల పంచాయితీ ఒక్కటే బ్యాలెన్స్ అనుకుంటున్న సమయంలో.. సేనాని హస్తిన పర్యటన రాజకీయంలో కొత్త మలుపునకు కారణం అయింది. వైసీపీని అధికారంలోంచి దింపడమే లక్ష్యంగా బీజేపీ పెద్దల ముందు.. పవన్ కొన్ని ప్రతిపాదనలు పెట్టారు. బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి సాగితే.. ఆపేది ఎవరు అని ఓ ప్రతిపాదన కూడా పెట్టారు బీజేపీ ముందు ! కట్ చేస్తే.. ఢిల్లీ పర్యటన ముగిసింది.. పవన్ రిటర్న్ అయ్యారు. దీంతో ఇప్పుడేం జరగబోతోంది అన్నదే హాట్‌టాపిక్‌గా మారింది.
టీడీపీని వదిలేస్తారా?
టీడీపీని వదులుకుంటే నష్టం అని పవన్‌కు తెలుసు.. ప్రయోగాలు చేయను అన్నది కూడా అందుకే ! అదే సమయంలో బీజేపీతో కలిపి కూటమి ఏర్పాటు చేయడం కూడా కష్టమే. టీడీపీతో కలిసేందుకు కమలం పార్టీ ససేమిరా అంటోంది. దీంతో పవన్ కల్యాణ్ ఇప్పుడు ఇబ్బందుల్లో పడినట్లు కనిపిస్తున్నారు. సైకిల్ సవారీ చేద్దామని బీజేపీని ఒప్పించలేరు.. అలా అని కమలానికి కటీఫ్ చెప్పి.. పసుపు పార్టీకి దగ్గర కాలేరు. వాళ్లకు తెగేసి చెప్పలేరు. టీడీపీతో కలిసి తెగింపు చూపలేరు. దీంతో ఏం చేయాలో పాలుపోని పరిస్థితుల్లో పవన్ పడిపోయారు.
ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోవద్దని.. దానికోసం ముగ్గురం కలిసి పోటీచేయాలన్నది పవన్ ప్రతిపాదన. ఐతే దీనికి బీజేపీ ఏ మాత్రం అంగీకరించడం లేదు. అటు ఢిల్లీ పెద్దలు కూడా ఈ పరిణామాలపై ఆచితూచి రియాక్ట్ అవుతున్నారు. పొత్తుల సంగతి తేల్చేందుకు ఏమాత్రం తొందరపడటం లేదు. ఉందిలే మంచి కాలం.. ముందు ముందు అనుకుంటున్నారే తప్ప.. దోస్తీ మీద ఏ మాత్రం ఓ మాట జారడం లేదు. కొద్దిరోజులు ఓపిక పడితే చాలు.. మంచిరోజులు వస్తాయ్ అనేది కమలం పార్టీలో చాలామంది వాదన. 2029 వరకు ఆగితే టీడీపీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుందని.. అప్పుడు చక్రం తిప్పేది, రాజ్యం ఏలేది మనమేనని.. పవన్ కూడా సీఎం అవుతారని.. అప్పటివరకు ఓపిక పట్టాలని అంటున్నారు.
తొమ్మిదేళ్లైనా మారని పార్టీ పరిస్థితి!
పార్టీ స్థాపించి తొమ్మిదేళ్లు దాటింది.. అధికారం లేక, ఆర్థికబలం లేక, క్షేత్రస్థాయిలో అండ లేక.. ఆగం అయిపోయిది జనసేన! అలాంటిది ఇంకో ఆరేళ్లు ఆగడం అంటే.. అధికారం అని బీచ్‌లో ఇసుక మీద పేరు రాసుకున్నట్లే! ఏదైతే అది అయింది.. తెగించేసి బీజేపీకి బైబై చెప్పేద్దామా అంటే సాధ్యం కాని పరిస్థితి. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీని ఎదిరించడం అంటే.. మళ్లీ అదో సమస్య. దీంతో పవన్ ఇప్పుడు గందరగోళంలో పడిపోయారు. అసలే ఎన్నికల మూడ్ స్టార్ట్ అయిపోయింది. ఇలాంటి సమయంలో సేనాని నిర్ణయాలు ఎలా ఉంటాయ్.. ధైర్యం చేస్తారా.. వాళ్లు కాంప్రమైజ్ అవుతారా.. వీళ్లు రెడ్ కార్పెట్ రెడీ చేసుకున్నారా అనే చర్చ జరుగుతోంది. ఐతే పొత్తు పరిణామాలను, మూడు పార్టీల పరిస్థితులను వైసీపీ ఆసక్తిగా గమనిస్తోంది. దీంతో రాబోయే రాజకీయం మరింత రసవత్తరంగా మారడం ఖాయంగా కనిపిస్తోంది.