Pawan Kalyan: పవన్‌కు పెరిగిపోతున్న ఫ్రస్ట్రేషన్‌.. ఓటమి నింద జనాలపై వేస్తున్నాడా ?

చిన్న గ్యాప్ తీసుకొని పవన్ మళ్లీ వచ్చారు. వైసీపీని మళ్లీ టార్గెట్‌ చేస్తున్నారు. పొత్తులపై ఎప్పుడూ చెప్పే మాటలు మళ్లీ చెప్పారు.. కాకపోతే ఈసారి కాస్త కొత్తగా అంతే తేడా ! ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనిచ్చేది లేదని మళ్లీ చెప్పిన పవన్‌.. టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి పోటీ చేసేలా ప్రయత్నాలు చేస్తానని హామీ ఇచ్చారు. తానేంటో, తన సత్తా ఏంటో చూపించిన తర్వాతే సీఎం పదవి అడుగుతానని భారీ డైలాగులు వదిలారు సేనాని.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: May 13, 2023 | 12:13 PMLast Updated on: May 13, 2023 | 12:13 PM

Pawan Kalyan In Frestation

పవన్ మాటల్లో ఆవేదన కంటే ఆక్రోశం ఎక్కువ కనిపించింది అదేంటో ! తప్పులు మళ్లీ చేయనని చెప్తూనే.. తప్పు చేసిందంతా మీరే అన్నట్లు జనాన్ని ఓ మాట అనేశారు. తాను ఒక్క కులానికి చెందిన నాయకుడిని కాదని చెప్తూనే.. 60శాతం కాపులు ఎందుకు వైసీపీకి ఓటేశారని నిలదీశారు. ఇలా కొంచెం కన్ఫ్యూజన్‌, ఇంకొంచెం కంగారు.. చాలా ఆక్రోశం అన్నట్లుగా సాగింది పవన్ కల్యాణ్ ప్రసంగం. ఒక్కటి మాత్రం నిజం. వైసీపీ మీద పవన్ రగిలిపోతున్నారు. తన సినిమాలను టార్గెట్ చేశారనో.. తన పార్టీని టార్గెట్‌ చేశారనో.. లేదంటే పర్సనల్ విషయాలు తీసుకున్నారనో.. కారణం ఏదైనా అధికార పార్టీపై కారాలు మిరియాలు నూరుతున్నారు. ఫ్యాన్‌ పార్టీని ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రానీయకుండా చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

పవన్ తలుచుకుంటే అది అవుతుంది కూడా ! ఏపీ ప్రస్తుత రాజకీయాల్లో జనసేన ఒకరకంగా డిసైడింగ్ ఫ్యాక్టర్ ఇప్పుడు ! ఇది పవన్‌కు కూడా తెలుసు. అందుకే గెలుపు కోసం నెగ్గేందుకు, తగ్గేందుకు సేనాని సిద్ధం అవుతున్నాడని తన మాటలతో అర్థం అవుతోంది. ఐతే కన్ఫ్యూజన్‌లో ఫ్రస్ట్రేషన్‌లోకి వెళ్లిపోతున్నాడేమో అనిపిస్తోంది పవన్ ఇప్పుడు ! గెలిపించలేదని జనాలపై నిందలు వేస్తున్నారు ఏకంగా. తనను ఓడించి.. జనమే తప్పు చేశారు అన్నట్లుగా మాట్లాడుతున్నారు. ఎంఐఎంలాంటి పార్టీకి ఇన్ని సీట్లు వచ్చాయ్‌. తమిళనాడులో విజయ్‌కాంత్‌ పార్టీ స్థాయి కూడా కాదా నాది అంటూ.. సెంటిమెంట్‌ పండించి జనాలనే కార్నర్‌ చేసే ప్రయత్నం చేస్తున్నారు పవన్.

ఇన్నిరోజులు పవన్ మాటల్లో ఆవేశం కనిపించేది.. ఫస్ట్ టైమ్ ఆక్రోశం వినిపించింది. ఇదే ఇప్పుడు ఏపీ రాజకీయవర్గాల్లో కొత్త చర్చకు కారణం అవుతోంది. ఏపీ ఎన్నికల మూడ్‌లోకి వెళ్లిపోయింది. ముందస్తు అంటున్నారు పైగా ! ఇలాంటి సమయంలో ప్రతీ మాట కీలకమే. ఒక్క చిన్న పొరపాటు దొర్లినా.. అది ప్రత్యర్థికి ఆయుధంగా మారుతుంది. పవన్ గుర్తుంచుకోవాల్సింది ఇదే అనే చర్చ జరుగుతోంది ఏపీ రాజకీయాల్లో !