మొన్నటి వరకు కులం…. ఇప్పుడు మతం పవన్ ఓవరాక్షన్ తట్టుకోలేకపోతున్నాం బిజీ

చంద్రబాబు నాయుడు వెనక ఉండి ఆడిస్తున్నా డో, లేక బిజెపి డైరెక్షన్ ఇస్తుందో కానీ... లడ్డు కల్తీ వ్యవహారంలో ఏపీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తున్న తీరు చూస్తే జనానికి యావగింపస్తోంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: September 25, 2024 | 01:52 PMLast Updated on: Sep 25, 2024 | 1:52 PM

Pawan Kalyan Over Reaction On Laddu Issue

చంద్రబాబు నాయుడు వెనక ఉండి ఆడిస్తున్నా డో, లేక బిజెపి డైరెక్షన్ ఇస్తుందో కానీ… లడ్డు కల్తీ వ్యవహారంలో ఏపీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తున్న తీరు చూస్తే జనానికి యావగింపస్తోంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల వరకు తనకు కులం లేదంటూనే ప్రతిరోజు కులం గురించి మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు క్రమంగా తన డైరెక్షన్ మతం వైపు మార్చుకున్నట్లు ఉంది. సనాతన ధర్మం పేరుతో అర్థం లేని ఆవేశం ప్రదర్శిస్తుంటే, పవన్ కేదో తేడా కొట్టిందని జనం నవ్వుకుంటున్నారు. ప్రకాష్ రాజ్, హీరో కార్తీపై విరుచుకుపడుతున్న తీరు చూసి నీ ఓవరాక్షన్ తట్టుకోలేకపోతున్నా మరా బాబు అంటున్నారు.

తిరుమల లడ్డులో వాడే నెయ్యిలో కల్తీ జరిగిందని ఆరోపణలు రావడం, ఎన్ డి డి బి రిపోర్టులో అనుమానాలు వ్యక్తం కావడంతో తెలుగు రాష్ట్రాల్లో అందరూ ఆందోళన చెందుతున్నారు. దీనిపై సామాన్య ప్రజల కంటే పొలిటికల్ పార్టీలే విపరీతంగా రియాక్ట్ అయిపోతున్నాయి. ఈ ఓవరాల్ ఎపిసోడ్ లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పరిమితికి మించి స్పందించడం చూస్తే ఇప్పటివరకు లడ్డు కల్తీ నిజమే అని నమ్మిన వాళ్లు కూడా, వీళ్ళిద్దరి వ్యవహారం శైలి చూసి కొత్త అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అసలు పవన్ కళ్యాణ్ అతి మాటలు,చేష్టలు చూస్తే లడ్డు కల్తీ వ్యవహారంలో ఆవేశము, ఆవేదన కన్నా రాజకీయమే ఎక్కువగా కనిపిస్తోంది. ఈ ఆవేశం, ఆవేదన వరదల్లో చిక్కుకుపోయిన జనాన్ని పరామర్శించడానికి ఎందుకు ప్రదర్శించలేదని జనం మాట్లాడుకుంటున్నారు.

తిరుమల లడ్డు కల్తీ వ్యవహారం బయటపడగానే పవన్ ఏ ఎన్ ఐ కెమెరాను పిలిపించుకొని దేశమంతా తన వాయిస్ వెళ్లేటట్లుగా ఇంగ్లీషులో మాట్లాడారు. అప్పుడే అందరికీ అనుమానం వచ్చింది. తిరుమల ఆలయ సంప్రోక్షణ, మహా శాంతి యాగం పేరుతో లడ్డు వివాదాన్ని జనంలోకి మరింత తీసుకెళ్లడానికి…. మరి కొన్నాళ్ళు పొడిగించడానికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చేసిన ప్రయత్నం ఒక రాజకీయ ప్రయత్నంగానే జనానికి కనిపిస్తోంది. అన్నిటికన్నా వింత 11 రోజుల పవన్ దీక్ష. దీక్షలో భాగంగా అమ్మవారి ఆలయంలో మెట్లను శుభ్రపరుస్తూ చేసిన ఆవేశ ప్రసంగాలు. అంతేకాక ఈ వ్యవహారంతో సంబంధం లేని హీరో కార్తీ, ప్రకాష్ రాజులపై విరుచుకుపడడం చూస్తే ఊర్లో డ్రామా ప్రదర్శనలాగే అనిపిస్తుంది. నిజానికి హీరో కార్తీ లడ్డు గురించి ఎక్కడ అపహస్యం చేస్తూ మాట్లాడలేదు. ప్రజలెవరికీ కార్తీ అపహాస్యం చేస్తున్నట్లుగా అనిపించలేదు. ఒక్క పవన్ కళ్యాణ్ కి తప్ప.

అలాగే ప్రకాష్ రాజ్ పవన్ కళ్యాణ్ నీ ఉద్దేశించి చేసిన ట్వీట్లో హిందూ మతాన్ని తక్కువ చేసి ఏం మాట్లాడలేదు. రాష్ట్రానికి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా మీరు ఇటువంటి సమయంలో సమస్య పరిష్కార దిశగా ప్రయత్నించాలి అంతేగాని మీరే బయటపడి అరుపులు కేకలు పెడితే అది సభ్యతగా ఉండదు అని సూచించారు. దానికే చాలా ఆవేశ పడిపోయి ఏకంగా ప్రకాష్ రాజ్ కి వార్నింగ్ ఇవ్వడం మొదలుపెట్టాడు పవర్ స్టార్.

పవన్ కళ్యాణ్ కి విషయపరిజ్ఞానం లేదు అనే విషయాన్ని ఇన్ డైరెక్ట్ గా తన ట్వీట్ వీడియో ద్వారా పక్క ప్రకాష్ రాజ్ చెప్పకనే చెప్పాడు. సనాతన ధర్మం ….సనాతన ధర్మం అంటూ గొంతు చించుకొని అరుస్తున్న పవన్ కళ్యాణ్…. ఇటీవల జరిగిన పరిణామాలపై ఎందుకు నోరు విప్పడం లేదని…. పవన్ కి సామాజిక ధర్మం అవసరం లేదా అని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఆయన అనుచరుడు, జనసేన నాయకుడు జానీ మాస్టర్ ఒక ఆడపిల్లను ఐదేళ్లుగా వంచించి లోబరుచుకుంటే… బయట ఇంత అల్లరి అవుతుంటే, దానిపై ఒక్కసారి కూడా రియాక్ట్ కాలేదు పవన్ కళ్యాణ్. జానీ మాస్టర్ ఇంటికెళ్లి అక్కడ సంప్రోక్షణ, దీక్ష చేసి ఉంటే బాగుండేది. పవన్ కళ్యాణ్ మిత్రుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పై పూనం కౌర్ చేసిన ఆరోపణకి ఎక్కడో ఒకచోట స్పందిస్తే ఇంకా బాగుండేది. అంతేకాదు కాకినాడ రూరల్ జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ ఒక వైద్యున్ని లం… కొడకా అని తిడుతూ ఎగబడి కొడితే కనీసం ఖండించని పవన్ కళ్యాణ్ తిరుమల నెయ్యి కల్తీ గురించి మాత్రం నానా హంగామా చేస్తున్నాడు.

వరదల్లో చిక్కుకున్న జనాన్ని పరామర్శించడానికి నేను వస్తే… అక్కడ సహాయ చర్యలకు ఆటంకం కలుగుతుంది అని వివరణ ఇచ్చుకున్న పవన్ , దుర్గగుడి మెట్లు శుభ్రం చేస్తే మిగిలిన భక్తులకు ఆటంకం కలగదా,? రేపు తిరుమల నడిచి వెళ్లి షో చేస్తే అక్కడ సామాన్య భక్తులకు ఇబ్బంది కలగదా? ప్రశ్నించడానికి పార్టీ పెట్టాను… రాజకీయాల్లోకి వచ్చాను అని చెప్పిన వ్యక్తి ఇప్పుడు అందర్నీ శాసిస్తుంటే ఆశ్చర్యం కలుగుతుంది. వాడి తోలు తీస్తా… వీడి తోలు తీస్తా… సనాతన ధర్మం కోసం చావడానికి సిద్ధం ఇలాంటి మాటలు జనానికి వెగటు పుట్టిస్తున్నాయి. అధికారం వచ్చిన తర్వాత ప్రజల కోసం పనిచేయకుండా… రోడ్లెక్కి హంగామా చేస్తుంటే దీన్ని రాజకీయ ప్రచారం కాక మరి ఏమంటారు? నిన్నటి వరకు కులాన్ని…. ఇప్పుడు మతాన్ని జనంలోకి ఎక్కించాలని చేసే ప్రయత్నాన్ని పవన్ కళ్యాణ్ ఆధునిక సనాతన ధర్మం అనే పిలుస్తారా?