Pawan Kalyan: టీడీపీతోనా.. బీజేపీతోనా.. త్వరలో తేలుస్తాం.. పొత్తులపై పవన్ కీలక వ్యాఖ్యలు..!

పొత్తులు, ఏపీ పరిస్థితులపై పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో వైసీపీ పోయి.. కొత్త ప్రభుత్వం రావాలన్నదే తమ లక్ష్యమన్నారు. ఇందుకోసం బీజేపీతోనే వెళ్లడమా, లేక జనసేన, టీడీపీ, బీజేపీ కలిసి కూటమిగా ఏర్పడటమా.. అన్నది చర్చల ద్వారా నిర్ణయిస్తామన్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: August 18, 2023 | 05:10 PMLast Updated on: Aug 18, 2023 | 5:10 PM

Pawan Kalyan Sensational Comments On Alliance With Tdp And Bjp

Pawan Kalyan: ఏపీలో పొత్తుల అంశంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీతో కలిసి వెళ్తామా.. లేక టీడీపీ, బీజేపీలతో కలిసి వెళ్తామా అనేది త్వరలో తేలుతుందన్నారు. ఈ అంశంపై ఇరు పార్టీలతో చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. శుక్రవారం పవన్ కళ్యాణ్ మీడయా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పొత్తులు, ఏపీ పరిస్థితులపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో వైసీపీ పోయి.. కొత్త ప్రభుత్వం రావాలన్నదే తమ లక్ష్యమన్నారు.

ఇందుకోసం బీజేపీతోనే వెళ్లడమా, లేక జనసేన, టీడీపీ, బీజేపీ కలిసి కూటమిగా ఏర్పడటమా.. అన్నది చర్చల ద్వారా నిర్ణయిస్తామన్నారు. తనకు సీఎం పదవిపై ఉన్న ఆసక్తి గురించి ఇప్పటికే చెప్పానన్నారు. పదవి తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతికి పాలకులను బాధ్యుల్ని చేస్తామన్నారు. పొత్తుల విషయంలో పవన్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా ఉన్నాయి. పవన్ తన మాటల్లో టీడీపీతో కచ్చితంగా పొత్తు ఉంటుంది అని స్పష్టంగా చెప్పలేదు. చర్చలు మాత్రమే జరుగుతున్నాయన్నారు. అలాగే జనసేన, బీజేపీ మాత్రమే పొత్తులో ఉండొచ్చని కూడా వివరించారు. అంటే.. ఇంకా, పొత్తులపై టీడీపీ, జనసేన మధ్య ఒక అవగాహన కుదరలేదని అర్థమవుతోంది. టీడీపీతో జనసేన పొత్తు పెట్టుకుంటే.. తక్కువ సీట్లు ఇవ్వాలని చంద్రబాబు భావిస్తున్నారు. దీనికి జనసేన సిద్ధంగా లేదు. పైగా వారాహి యాత్ర ద్వారా గతంతో పోలిస్తే జనసేన బలం పెరిగింది.

ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఒకరకంగా జనసేన ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ఉభయగోదావరి జిల్లాలు, కాకినాడ, విశాఖపట్నంలలో జనసేన ప్రభంజనం సృష్టించే అవకాశం ఉంది. ఈ స్థితిలో తక్కువ సీట్లతో జనసేన సరిపెట్టుకునే అవకాశం లేదు. పొత్తు విషయంలో రెండు పార్టీల మధ్య అవగాహన కుదరకుంటే.. అది వైసీపీకే లాభం. ఒకవైపు కావాల్సినన్ని సీట్లు దక్కించుకోవాలని పవన్ కోరుకుంటూనే.. మరోవైపు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని కూడా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో జనసేన, టీడీపీ, బీజేపీ ఏ మేరకు పొత్తులపై అవగాహన కుదర్చుకుంటాయో చూడాలి.