Pawan Kalyan: పవన్ కల్యాణ్ రెండో విడత వారాహి యాత్ర షెడ్యూల్ ఖరారు

ఇప్పటికే మొదటి దశ వారాహి యాత్ర విజయవంతమైన నేపథ్యంలో రెండో దశ యాత్రను ఆదివారం నుంచి ప్రారంభించనున్నారు. ఈ మేరకు పవన్ కల్యాణ్, జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్‌ ఈ పర్యటనపై చర్చించి, తాజాగా షెడ్యూల్ విడుదల చేశారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: July 8, 2023 | 12:44 PMLast Updated on: Jul 08, 2023 | 12:44 PM

Pawan Kalyan Varahi Yatra Second Shedule Released The Shedule Is

Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏపీలో రెండో విడత వారాహి యాత్రకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే మొదటి దశ వారాహి యాత్ర విజయవంతమైన నేపథ్యంలో రెండో దశ యాత్రను ఆదివారం నుంచి ప్రారంభించనున్నారు. ఈ మేరకు పవన్ కల్యాణ్, జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్‌ ఈ పర్యటనపై చర్చించి, తాజాగా షెడ్యూల్ విడుదల చేశారు. దీని ప్రకారం.. జూలై 9 ఆదివారం, ఏలూరు నుంచి వారాహి రెండో దశ యాత్ర ప్రారంభమవుతుంది.

సాయంత్రం ఐదు గంటలకు ఏలూరులో బహిరంగ సభ నిర్వహిస్తారు. ఏలూరుతో పాటు దెందులూరు, తాడేపల్లిగూడెం, ఉంగుటూరు, తణుకు నియోజక వర్గ నేతలు, వీర మహిళలను జనసేనాని పవన్ కళ్యాణ్ కలుస్తారు. అక్కడి రాజకీయ పరిస్థితులపై వారితో చర్చిస్తారు. రాబోయే ఎన్నికల్లో గెలుపు కోసం చేపట్టాల్సిన వ్యూహాలను వారికి పవన్ వివరిస్తారు. 9న బహిరంగ సభ అనంతరం, 10న మధ్యాహ్నం జనవాణి కార్యక్రమం నిర్వహిస్తారు. స్థానిక సమస్యల గురించి ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తారు. సాయంత్రం ఆరు గంటలకు నియోజకవర్గ నేతలతో సమావేశమవుతారు. 11న దెందులూరు నియోజక వర్గ ముఖ్య నాయకులు, వీర మహిళలతో సమావేశమవుతారు. అనంతరం సాయంత్రం 5 గంటలకు తాడేపల్లిగూడెం చేరుకుంటారు. అక్కడే బస చేస్తారు. మరుసటి రోజు అంటే 12న సాయంత్రం 5 గంటలకు తాడేపల్లిగూడెంలో బహిరంగ సభ నిర్వహిస్తారు. మొత్తంగా 9, 10, 11, 12 తేదీల్లో.. అంటే నాలుగు రోజులపాటు ఈ పర్యటన ఉంటుంది.

గత నెల 14వ తేదీన అన్నవరంలో ప్రారంభించిన మొదటి దశ వారాహి యాత్ర విజయవంతమైంది. ప్రజల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. దాదాపు పది రోజుల పాటు విజయవంతంగా యాత్రను పూర్తి చేశారు. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వంపై ఘాటైన విమర్శలు చేశారు. వాటికి సమాధానం చెప్పుకోలేక వైసీపీ నేతలు ఇబ్బంది పడ్డారు. చివరకు సీఎం జగన్ కూడా ఎలాంటి బదులు ఇవ్వలేక.. పవన్‌పై వ్యక్తిగత విమర్శలకు దిగారు. దీనివల్ల పవన్ ఇమేజ్ డ్యామేజ్ అవుతుందనుకుంటే.. పవన్‌పై సానుభూతి పెరిగింది. ఏదేమైనా.. వారాహి విజయ యాత్ర ద్వారా వచ్చిన ఊపును పవన్ తగ్గించకూడదనుకుంటున్నారు. అందుకే వెంటవెంటనే యాత్ర ప్లాన్ చేస్తూ, ప్రజల మధ్యలో ఉండేందుకు ప్లాన్ చేస్తున్నారు.