Pawan Kalyan: సీఎం రేసులోకి పవన్.. ఒక్కఛాన్స్ అంటున్న జనసేనాని.. బాబుకు చిక్కు తప్పదా..?

ప్రస్తుత పరిస్థితుల్లో పవన్ సీఎం కావాలనుకుంటున్నారు. ఈ విషయాన్ని పవన్ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తున్నారు. దీంతో పవన్ సీఎం అభ్యర్థిగా రేసులో నిలవబోతున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఎలా వ్యవహరిస్తారనేది ఆసక్తిగా మారింది. బాబు మరోసారి సీఎం కావాలి అనుకునేబదులు.. పవన్‌కు అవకాశం ఇస్తే బాగుంటుందన్నది మెజారిటీ అభిప్రాయం.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: June 19, 2023 | 09:50 AMLast Updated on: Jun 19, 2023 | 9:50 AM

Pawan Kalyan Wants To Become Cm Of Ap Is It Shock To Chandrababu Naidu

Pawan Kalyan: ఏపీ రాజకీయాల్లో జనసేనాని పవన్ వ్యూహం ప్రస్తుతం సంచలనంగా మారింది. ఇటీవలి వారాహి యాత్రలో పవన్ మాట్లాడుతూ పొత్తుల గురించి ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. దీంతో టీడీపీకి షాక్ తగిలినట్లైంది. నిన్నటిదాకా పవన్ కల్యాణ్ తమతోనే ఉంటాడని భావించిన టీడీపీకి పవన్ వ్యాఖ్యలు షాక్‌నిచ్చాయి. మరోవైపు తమతో బీజేపీ కలిసొస్తుందో.. లేదో ఇంకా స్పష్టత లేదు. ఈ నేపథ్యంలో చంద్రబాబు తన పార్టీ భవిష్యత్‌పై ఆందోళనతో ఉన్నారు.
ఏపీలో వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన కలిసి పోటీ చేస్తాయని అందరూ నమ్మిన విషయమే. పైగా ఈ కూటమిలోకి బీజేపీని తెచ్చేందుకు కూడా పవన్ ప్రయత్నిస్తున్నారు. అన్నీ కుదిరితే ఈ మూడు పార్టీలూ కలిసి పోటీ చేయొచ్చు. మరోవైపు ఇప్పటికే జనసేన-బీజేపీ కలిసి పని చేస్తున్నట్లు ఆ రెండు పార్టీల నేతలు ప్రకటించారు. టీడీపీతో పొత్తుకు అనుకూలంగా గతంలోనే పవన్ పరోక్ష సంకేతాలిచ్చారు. దీంతో పవన్ తమవాడే అని టీడీపీ భావించింది. జనసేనకు ఎన్నోకొన్ని సీట్లు ఇచ్చి, వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేసి అధికారం దక్కించుకోవాలని టీడీపీ ఆశించింది. బీజేపీ కూడా కలిసొస్తే తిరుగే ఉండదనుకుంది. కానీ, ప్రస్తుతం బాబు సహా టీడీపీ నేతలకు పవన్ షాకిచ్చారు. పొత్తుల గురించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. దీంతో బాబుకు ఈ పరిణామం మింగుడుపడటం లేదు.
సీఎం రేసులోకి పవన్
పొత్తులు లేకపోతే ఎక్కువగా నష్టపోయేది టీడీపీనే. గత ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోవడానికి కారణాల్లో పొత్తు లేకపోవడం కూడా ఒకటి. జనసేన-టీడీపీ మధ్య చాలా చోట్ల ఓట్లు చీలిపోయాయి. ఈసారి అలాంటి పొరపాటు జరగకూడదని జనసేనతో పొత్తుకోసం పాకులాడారు. పవన్ నుంచి సానుకూల నిర్ణయం వచ్చింది. దీంతో ఇక పొత్తు ఖాయమే అనుకున్నారంతా. దీని ప్రకారం.. చంద్రబాబే సీఎం అవుతారని అంతా భావించారు. కానీ, ఇప్పుడు పవన్ స్వరం మార్చారు. పొత్తుల గురించి చెప్పకపోగా.. తనకు సీఎంగా ఒక్క అవకాశం ఇచ్చి చూడాలని అడుగుతున్నారు. అంటే సీఎం రేసులో తాను కూడా ఉన్నట్లు పవన్ ప్రకటించుకున్నారు. ఇంతకాలం సీఎం పదవిపై ఆశలేదని చెప్పిన పవన్ ఒక్కసారిగా.. తనను సీఎం చేయాలని కోరుతున్నారు. ఏపీని అభివృద్ధి చేస్తానంటున్నారు. ఇది కచ్చితంగా టీడీపీని ఇబ్బందిపెట్టే అంశమే. టీడీపీ-జనసేన పొత్తులో జనసేనకు తక్కువ సీట్లిచ్చి, మెజారిటీ సీట్లు గెలిచి సీఎం కావాలనేది బాబు ప్లాన్. కానీ, ఇప్పుడు పవన్ కూడా సీఎం కావాలని ఆశపడుతుండటంతో బాబుకు ఏం చేయాలో పాలుపోవడం లేదు. మరోవైపు బీజేపీతో కూడా పొత్తు విషయంలో స్పష్టత లేదు. ఒకవేళ పొత్తు లేకుండా నష్టపోయేది టీడీపీనే.
పవన్‌ను సీఎంగా ప్రకటిస్తారా..?
ప్రస్తుత పరిస్థితుల్లో పవన్ సీఎం కావాలనుకుంటున్నారు. ఈ విషయాన్ని పవన్ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తున్నారు. దీంతో పవన్ సీఎం అభ్యర్థిగా రేసులో నిలవబోతున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఎలా వ్యవహరిస్తారనేది ఆసక్తిగా మారింది. ఇప్పటికే బాబు మూడుసార్లు సీఎంగా చేశారు. మరోసారి సీఎం కావాలి అనుకునేబదులు.. పవన్‌కు అవకాశం ఇస్తే బాగుంటుందన్నది మెజారిటీ అభిప్రాయం. రెండు పార్టీల మధ్య పొత్తు ఉన్నాసరే.. పవన్‌ను సీఎంగా ప్రకటిస్తే కలిసొస్తుందని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. పైగా చంద్రబాబును సీఎం చేసేందుకే పవన్ పార్టీని నడిపిస్తున్నారనే విమర్శలకు దీని ద్వారా సమాధానం చెప్పినట్లవుతుంది. పవన్‌ను సీఎంను చేసి, ప్రభుత్వంలో సీనియర్‌గా బాబు సేవలందించవచ్చు. అయితే, పవన్‌ను సీఎం చేసేందుకు బాబు అంగీకరిస్తారా అనేదే అనుమానం. ఎందుకంటే బాబు.. తానో లేదా తన కొడుకు లోకేషో సీఎం కావాలని అనుకుంటారు. అలాంటిది పవన్‌కు అవకాశమిస్తారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
వైసీపీ హ్యాపీనా..?
టీడీపీ-జనసేన కలవకూడదని వైసీపీ బలంగా కోరుకుంటోంది. జనసేనకు ఒంటరిగా పోటీచేసే దమ్ముందా అంటూ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోంది. 175 నియోజకవర్గాల్లో అభ్యర్థులే లేరని, ఒంటరిగా వెళ్లే ధైర్యం లేదని ఎద్దేవా చేస్తోంది. పొత్తుల గురించి పవన్ స్పష్టత ఇవ్వకపోవడంతో వైసీపీ నేతల్లో ఆనందం వ్యక్తమవుతోంది. పొత్తు కుదరకపోతే మంచిదనుకుంటున్నారు. అయితే, ఇదంతా పవన్-బాబు కలిసి పన్నిన వ్యూహమా.. నిజంగానే పవన్ సీఎం కావాలనుకుంటున్నారా.. త్వరలో తేలుతుంది.