Pawan Kalyan: భీమవరం నుంచే పవన్ పోటీ చేయబోతున్నారా.. సభతో క్లారిటీ ఇస్తారా..?

తాను పోటీ చేయబోయే స్థానం గురించి భీమవరం వేదికగానే పవన్ క్లారిటీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో భీమవరంతో పాటు గాజువాక నుంచి పోటీ చేసిన పవన్‌.. రెండు చోట్లా ఓడిపోయారు. పోగొట్టుకున్న చోటే వెతుక్కుందాం అని పదేపదే అంటున్న పవన్.. భీమవరం నుంచి మళ్లీ పోటీ చేస్తారా అనే చర్చ మొదలైంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: June 29, 2023 | 02:55 PMLast Updated on: Jun 29, 2023 | 2:55 PM

Pawan Kalyan Will Contest From Bheemavaram Local People Wants Him To Contest From There

Pawan Kalyan: ఏపీ రాజకీయాలు హాట్‌హాట్‌గా కనిపిస్తున్నాయి. వారాహి యాత్ర మొదలుపెట్టిన పవన్.. జగన్‌ సర్కార్‌కు, వైసీపీకి ఊపిరాడకుండా కామెంట్లు చేస్తున్నారు. అంశాల వారీగా విమర్శలు గుప్పిస్తూ.. అధికార పార్టీని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. వైసీపీ నుంచి కూడా అదే రేంజ్‌ రియాక్షన్ వస్తోంది. దీంతో రాజకీయం రోజురోజుకు వేడెక్కుతోంది. ఉభయగోదావరి జిల్లాల్లో పవన్ యాత్రకు జనాలు నీరాజనం పడుతున్నారు. ఐతే ఇప్పుడు అందరి దృష్టి భీమవరం మీదే ఉంది.

పవన్ అనారోగ్య కారణాల వల్ల.. భీమవరం సభ వాయిదా పడింది. ఐతే ఈ సభ ఎప్పుడు జరుగుతుంది? పవన్ నుంచి ఎలాంటి ప్రకటన వస్తుందనే ఆసక్తి.. జనసేనవర్గాలతో పాటు.. సామాన్యుల్లోనూ కనిపిస్తోంది. తాను పోటీ చేయబోయే స్థానం గురించి భీమవరం వేదికగానే పవన్ క్లారిటీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో భీమవరంతో పాటు గాజువాక నుంచి పోటీ చేసిన పవన్‌.. రెండు చోట్లా ఓడిపోయారు. పోగొట్టుకున్న చోటే వెతుక్కుందాం అని పదేపదే అంటున్న పవన్.. భీమవరం నుంచి మళ్లీ పోటీ చేస్తారా అనే చర్చ మొదలైంది. గతంతో కంపేర్ చేస్తే ఉభయగోదావరి జిల్లాల్లో జనసేన బలం భారీగా పెరిగింది. భీమవరంలో జనసేన నుంచి ఎవరు నిల్చున్నా.. ఈజీగా విజయం సాధించే పరిస్థితి ఉంది. నిజానికి సర్వేలు చెప్తోంది కూడా అదే..!

అయితే, తాను పోటీ చేసే నియోజకవర్గం విషయంలో పవన్ ముందు రెండు మూడు నియోజకవర్గాలు ఉన్నాయి. ఇక.. భీమవరం జనాలు మాత్రం పవన్ ఇక్కడి నుంచే పోటీ చేయాలని కోరుతున్నారు. పట్టణంలో ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేశారు. దీంతో సేనాని నిర్ణయం ఎలా ఉండబోతుంది అన్నది ఆసక్తికరంగా మారింది. పవన్ నుంచి ఒక్క ప్రకటన వస్తే చాలు ఎవరు ఎన్ని కుట్రలు చేసినా.. ఎలాంటి కుతంత్రాలు ప్లాన్ చేసినా తిప్పి కొడతామని భీమవరం వాసులు అంటున్నారు. నిజానికి గత ఎన్నికల్లో కేవలం 8వేల ఓట్ల తేడాతోనే పవన్ ఓడిపోయారు. రెండు గ్రామాల్లో ఓట్ల తేడా కారణంగానే సేనానిని పరాజయం వెంటాడింది. దీనికితోడు పవన్‌ను ఒంటరి చేసి రాజకీయం చేశారని, వందల కోట్లు వెదజల్లారని, దీనికితోడు ఫేక్‌ ఓట్లు కూడా భారీగానే పోల్ అయ్యాయనే ఆరోపణలు వినిపించాయి.

ఐతే ఇప్పుడు అలాంటి కుట్రలకు ఆస్కారం లేకుండా చూసుకుంటామని భీమవరంవాసులే హామీ ఇస్తున్నారు. ఇక దీనికితోడు గత ఎన్నికల్లో పవన్‌ను దెబ్బతీసిన ఆ రెండు గ్రామాలు కూడా పూర్తిగా జనసేనకు ఫేవర్‌గా మారిపోయాయ్. ఇప్పుడు పోటీ చేసినా.. పవన్‌కు 45వేల మెజారిటీ ఖాయం అని నియోజకవర్గ జనాలే చెప్తున్నారు. భీమవరం నుంచి పవన్ పోటీ చేస్తే విజయాన్ని ఆపడం ఎవరితరం కాదు అన్నది భీమవరంవాసుల అభిప్రాయం. మరి పవన్ నిర్ణయం ఎలా ఉంటుంది అన్నదే ఇప్పుడు ఆసక్తికరం.