Pawan Kalyan: రాజమండ్రి జైలుకు పవన్ కళ్యాణ్.. గురువారం చంద్రబాబుతో ములాఖత్..!
గురువారం చంద్రబాబును పవన్ కలిసి, పరామర్శిస్తారు. దాదాపు 40 నిమిషాలపాటు ఇరువురూ భేటీ కానున్నారని తెలుస్తోంది. ఈ భేటీలో తాజా రాజకీయాలు, అనుసరించాల్సిన వ్యూహాలపై ఇరువురు నేతలు చర్చిస్తారు. స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో చంద్రబాబుకు ఏసీబీ కోర్టు 14 రోజుల జుడీషియల్ రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే.
Pawan Kalyan: రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కలవబోతున్నారు. చంద్రబాబుతో ములాఖత్‌కు జైలు అధికారులు అనుమతించారు. గురువారం చంద్రబాబును పవన్ కలిసి, పరామర్శిస్తారు. దాదాపు 40 నిమిషాలపాటు ఇరువురూ భేటీ కానున్నారని తెలుస్తోంది. ఈ భేటీలో తాజా రాజకీయాలు, అనుసరించాల్సిన వ్యూహాలపై ఇరువురు నేతలు చర్చిస్తారు. స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో చంద్రబాబుకు ఏసీబీ కోర్టు 14 రోజుల జుడీషియల్ రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. దీంతో చంద్రబాబు ప్రస్తుతం రాజమండ్రి జైలులో ఉన్నారు. చంద్రబాబు అరెస్టును పవన్ ఖండించారు.
విజయవాడలో ఉన్న చంద్రబాబును పవన్ కలిసేందుకు వస్తున్నారన్న సమాచారంతో పవన్‌ను విజయవాడ రాకుండా పోలీసులు అడ్డుకున్నారు. పవన్ ప్రత్యేక విమానం టేకాఫ్ అయ్యేందుకు అనుమతివ్వొద్దని హైదరాబాద్‌లోని ఎయిర్‌పోర్టు అధికారులకు ఏపీ పోలీసులు సూచించారు. దీంతో పవన్ రోడ్డు మార్గంలో విజయవాడకు బయల్దేరారు. ఈ క్రమంలో అర్ధరాత్రి పవన్‌ను ఏపీ పోలీసులు రోడ్డుపై అడ్డుకున్నారు. దీంతో పవన్ రోడ్డుపై పడుకుని నిరసన వ్యక్తం చేశారు. అయితే, పవన్ తాను జనసేన కార్యక్రమం కోసం ఏపీ వెళ్తున్నానని చెప్పారు. పోలీసుల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు పవన్. ఆంధ్రప్రదేశ్‌లోకి వచ్చేందుకు వీసా, పాస్‌పోర్టు కావాలా అని ప్రశ్నించారు. మరోవైపు జనసైనికుల రాకతో, పవన్‌ను అడ్డుకున్న చోట ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. దీంతో పవన్‌ను తాడేపల్లిగూడెంలోని జనసేన కార్యాలయానికి తరలించారు పోలీసులు. అనంతరం చంద్రబాబు అరెస్టుపై పవన్ స్పందించారు. చంద్రబాబుకు తన సంపూర్ణ మద్దతు ఉంటుందని ప్రకటించారు.
టీడీపీ ఇచ్చిన బంద్ పిలుపునకు జనసేన సంఘీభావం ప్రకటించింది. నారా లోకేశ్‌కు ఫోన్ చేసి, పవన్ మద్దతు ప్రకటించారు. ఈ అంశంలో అన్ని రకాలుగా చంద్రబాబుకు, టీడీపీకి పవన్ అండగా నిలబడ్డారు. ఈ క్రమంలో పవన్ గురువారం చంద్రబాబును కలవనుండటం ఆసక్తికరంగా మారింది. ఈ ములాఖత్ తర్వాత రెండు పార్టీలు భవిష్యత్తులో ఎలా కలిసి ముందుకెళ్తాయి అనే అంశంపై స్పష్టత రావొచ్చు. రాబోయే ఎన్నికల్లో జనసేన టీడీపీతో కలిసి పోటీ చేయాలని భావిస్తోంది. వీలైతే టీడీపీని కూడా కలుపుకొని వెళ్లాలని ప్రయత్నిస్తోంది. ఈ విషయంలో బీజేపీ నుంచి స్పష్టత రావాల్సి ఉంది.