Pawan Kalyan: అక్టోబర్ 1 నుంచి పవన్ నాలుగో విడత వారాహి యాత్ర.. అవనిగడ్డలో బహిరంగ సభ..!
అక్టోబర్ ఒకటో తేదీ, ఆదివారం నుంచి కృష్ణాజిల్లాలో పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర మొదలు పెడతారు. ఆదివారం సాయంత్రం అవనిగడ్డలో బహిరంగ సభతో యాత్ర ప్రారంభమవుతుంది. టీడీపీ, బీజేపీ, జనసేన కలయికతో ఈసారి వారాహి యాత్ర సాగుతుంది.
Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నాలుగో విడత వారాహి విజయ యాత్రకు సిద్ధమవుతున్నారు. అక్టోబర్ 1 నుంచి కృష్ణా జిల్లాలో ఈ యాత్రం ప్రారంభమవుతుంది. ఈసారి అవనిగడ్డ నుంచి ప్రారంభించే వారాహి యాత్ర మచిలీపట్నం, పెడన, కైకలూరు నియోజకవర్గల మీదుగా కొనసాగనుంది. ఈ సందర్భంగా జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ‘‘అక్టోబర్ ఒకటో తేదీ, ఆదివారం నుంచి కృష్ణాజిల్లాలో పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర మొదలు పెడతారు.
ఆదివారం సాయంత్రం అవనిగడ్డలో బహిరంగ సభతో యాత్ర ప్రారంభమవుతుంది. టీడీపీ, బీజేపీ, జనసేన కలయికతో ఈసారి వారాహి యాత్ర సాగుతుంది. ఈ యాత్ర తరువాత రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు మారతాయి. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం కలిసికట్టుగా పని చేస్తాం. టీడీపీ, జనసేన సమన్వయ కమిటీ సమావేశం త్వరలో జరుగుతుంది. సోషల్ మీడియా వేదికగా మా పొత్తులపై వైసిపి వాళ్లు విష ప్రచారం చేస్తున్నారు. అటువంటి పోస్టులు, వ్యాఖ్యలపై ఎవరూ స్పందించవద్దు. పొత్తులు.. పదవుల కోసం కాదు. రాష్ట్రం, ప్రజల క్షేమం కోసం. త్వరలోనే మన ప్రజా ప్రభుత్వం వస్తుంది.. రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది’’ అని నాదెండ్ల మనోహర్ అన్నారు. ఏపీలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అరెస్ట్ తర్వాత పవన్ కల్యాణ్ చేపడుతున్న మొదటి యాత్ర ఇది. ఇటీవలే పవన్ కళ్యాణ్.. జనసేన-టీడీపీ పొత్తు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ యాత్రకు టీడీపీ, బీజేపీ శ్రేణులు ఏ మేరకు సహకరిస్తాయో చూడాలి.