Pawan Kalyan: వాలంటీర్లపై వెనక్కి తగ్గని పవన్.. పీఎంఓను ట్యాగ్ చేస్తూ మరో ట్వీట్.. వైసీపీకి చిక్కులు తప్పవా..?

ఓవైపు విమర్శల వాన కురుస్తున్నప్పటికీ.. అవకాశం దొరికినప్పుడల్లా వాలంటీర్లపై పవన్ ప్రశ్నలు సంధిస్తూనే ఉన్నారు. తాజాగా శుక్రవారం మరోసారి ట్విట్టర్ వేదికగా పవన్ వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తనను అరెస్టు చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, దీనికి తాను సిద్ధమేనని పవన్ ప్రకటించారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: July 21, 2023 | 06:34 PMLast Updated on: Jul 21, 2023 | 6:34 PM

Pawan Kalyans Stands On His Comments On Volunteers Ycp Govt Move To Court

Pawan Kalyan: వాలంటీర్ల వ్యవస్థపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు వివాదస్పదమైన సంగతి తెలిసిందే. వాలంటీర్ల అంశం ఏపీలో రాజకీయ దుమారానికి కారణమవుతోంది. ఈ విషయంలో అటు పవన్.. ఇటు ప్రభుత్వం.. ఎవరికి వాళ్లు తగ్గేదేలే అంటున్నారు. వాలంటీర్లపై పవన్ చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా కోర్టులో పరువునష్టం కేసు దాఖలు చేసేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమవుతుండగా.. ఈ విషయంలో మరింత దూకుడగా వెళ్లేందుకు పవన్ రెడీ అయ్యారు.
వాలంటీర్ల బాస్ ఎవరు..?
ఓవైపు విమర్శల వాన కురుస్తున్నప్పటికీ.. అవకాశం దొరికినప్పుడల్లా వాలంటీర్లపై పవన్ ప్రశ్నలు సంధిస్తూనే ఉన్నారు. తాజాగా శుక్రవారం మరోసారి ట్విట్టర్ వేదికగా పవన్ వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. “పౌరుల డాటా సేకరణపై వైసీపీ ప్రభుత్వం స్పష్టమైన వివరాలతో ముందుకు రావాలి..? వాలంటీర్లకు బాస్ ఎవరు..? ప్రైవేట్ డాటాను సేకరించాలి అని వారిని ఎవరు ఆదేశించారు..? ఒకవేళ అది ప్రైవేటు సంస్థ అయితే.. దానికి అధినేత ఎవరు..? ఒకవేళ వాలంటీర్లు ప్రభుత్వ శాఖే అయితే.. డాటా కలెక్ట్ చేయాలి అని ఎవరు ఆదేశించారు..? ప్రభుత్వ ప్రధాన కార్యదర్శా..? ముఖ్యమంత్రా..? కలెక్టరా..? ఎమ్మెల్యేనా..? ఎవరు..?” అంటూ పవన్ ట్విట్టర్ ద్వారా ప్రశ్నించారు. అంతేకాదు.. ఈ ట్వీట్‌ను ప్రధాని కార్యాలయ ట్విట్టర్‌కు, హోం మంత్రిత్వ శాఖ ట్విట్టర్‌కు ట్యాగ్ చేశారు. దీంతో వాలంటీర్ల విషయంలో పవన్ తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నట్లు స్పష్టమవుతోంది.
జీవో జారీచేసి మరీ కేసు
మరోవైపు వాలంటీర్లపై పవన్ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా వైసీపీ ప్రభుత్వం మాత్రం గట్టి చర్యలకు సిద్ధమవుతోంది. తప్పుడు ఆరోపణలు చేశారని, అందుకు పవన్‌పై పరువునష్టం కేసు పెట్టాలని ఆదేశిస్తూ ఏకంగా జీవో జారీ చేసింది. దీనిపై కోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమవుతోంది. త్వరలోనే కోర్టులో దీనిపై ప్రభుత్వం కేసు దాఖలు చేయనుంది. ఇప్పటికే పలు చోట్లు పవన్‌పై పోలీసు కేసులు నమోదయ్యాయి. తనను దమ్ముంటే అరెస్టు చేసుకోవచ్చని కూడా ప్రభుత్వానికి పవన్ సవాల్ విసిరారు. తనను అరెస్టు చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, దీనికి తాను సిద్ధమేనని పవన్ ప్రకటించారు.
ప్రభుత్వానికి చిక్కులు తప్పవా..?
పవన్‌పై కేసు పెట్టేందుకు వైసీపీ ప్రభుత్వం సిద్ధమైనప్పటికీ ఈ కేసు ఎంతవరకు నిలబడుతుందన్నది న్యాయ నిపుణుల నుంచి ఎదురవుతున్న ప్రశ్న. ఎందుకంటే పవన్ సంధించిన డాటా ప్రైవసీ గురించిన ప్రశ్నలకు ఇప్పటివరకు వైసీపీ నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. ఏవో వాలంటీర్లతో నిరసనలు వ్యక్తం చేయడం, కేసులు నమోదు చేయించడం, చివరకు వ్యక్తిగత విమర్శలకు దిగడం చేస్తుందే తప్ప.. డాటా విషయంలో ఎలాంటి ప్రకటనా రాలేదు. అంటే పవన్ చేసిన ఆరోపణల్లో చాలా వరకు నిజం ఉండే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఏపీలో వాలంటీర్ల నుంచి సేకరించిన డాటాను హైదరాబాద్‌లోని ఒక ప్రైవేటు సంస్థకు అందజేస్తున్నట్లు పవన్ చెబుతున్నారు.

ప్రజల నుంచి ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, బ్యాంక్ ఖాతా, పాస్‌పోర్ట్, ఆదాయ ధృవీకరణ వంటి వివరాల్ని సేకరిస్తున్నారు. ఈ డేటా అంతా ఎవరి చేతుల్లోకి వెళ్తుంది అనే విషయంలో ఎలాంటి స్పష్టత లేదు. ఏ సంస్థ అయినా.. ఇలాంటి వివరాలు సేకరించే విషయంలో కేంద్ర ప్రభుత్వ నిబంధనలు పాటించాలి. మైక్రో ఫైనాన్స్ సంస్థలుగానీ, ఇతరత్రా సంస్థలు గానీ డేటా సేకరించే విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ డేటా ఇతరుల చేతికి వెళ్లకుండా చూడాలి. ముఖ్యంగా విదేశీ సంస్థలకు ఆ డేటా చేరకుండా చూడాలి. అయితే, వైసీపీ సేకరిస్తున్న డేటా అంత సురక్షితంగా.. ఉందా.. లేదా అన్నది తేలాలి. ఈ విషయంలో ఏమాత్రం నిబంధనలు పాటించలేదనే విషయం బయటపడ్డా వైసీపీ చిక్కుల్లో పడక తప్పదు. పవన్ కూడా ఈ అంశంలో కోర్టుల్ని ఆశ్రయిస్తే వైసీపీకి ఇబ్బందే. కేంద్ర హోం శాఖ జోక్యం చేసుకున్నా ఆ పార్టీకి సమస్యలు తప్పవు. డేటా దుర్వినియోగం అవుతుందన్న పవన్ వాదనలకు బలం చేకూరుతుంది.