Pawan Kalyan: అంతుచిక్కని పవన్ వ్యూహం.. టీడీపీతో పొత్తు ఉన్నట్లా.. లేనట్లా..?
పొత్తు పెట్టుకుంటానో.. ఒంటరిగా పోటీ చేస్తానో ఇంకా తేల్చుకోలేదని పవన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయాల్లో ఆసక్తిని రేపుతున్నాయి. టీడీపీ-జనసేన కలవకూడదని వైసీపీ కోరుకుంటోంది. జనసేన తమతో ఉండాలని టీడీపీ భావిస్తోంది.
Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహి యాత్ర పేరుతో జనాల్లోకి వచ్చేశారు. దీంతో ఏపీలో రాజకీయం వేడెక్కింది. ఈ యాత్ర సందర్భంగా పవన్ తన రాజకీయ వ్యూహాలపై కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. ప్రస్తుతం అవి ఏపీలో చర్చకు దారితీస్తున్నాయి. వైసీపీపై విమర్శలతో విరుచుకుపడుతున్నారు. మరోవైపు పొత్తుల విషయంలో కూడా గతంలోలా కాకుండా భిన్నంగా స్పందించారు. పొత్తు పెట్టుకుంటానో.. ఒంటరిగా పోటీ చేస్తానో ఇంకా తేల్చుకోలేదని పవన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయాల్లో ఆసక్తిని రేపుతున్నాయి. టీడీపీ-జనసేన కలవకూడదని వైసీపీ కోరుకుంటోంది. జనసేన తమతో ఉండాలని టీడీపీ భావిస్తోంది. టీడీపీతో తమతోపాటు బీజేపీ కూడా కలిస్తే బాగుంటుందని జనసేన భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు పవన్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.
టీడీపీతో కలిసి వెళ్లే అంశంపై గతంలోనే పవన్ పరోక్ష సంకేతాలు ఇచ్చారు. దీంతో టీడీపీతో పొత్తు దాదాపు ఖాయమైనట్లే అనుకున్నారు. అయితే, తమ కూటమిలో బీజేపీ కూడా కలిస్తే బాగుంటుందని జనసేనాని అనుకుంటున్నారు. అప్పుడు వైసీపీ వ్యతిరేక ఓటు చీలదని, దీంతో ఆ పార్టీని ఓడించడం సులభమవుతుందని పవన్ కల్యాణ్ ఆలోచన. ఈ విషయంపై బీజేపీకి తన అభిప్రాయాన్ని పవన్ చెప్పారు. గతంలో అయితే బీజేపీ నుంచి దీనిపై సానుకూలత రాలేదు. ఇప్పుడిప్పుడే బీజేపీ వైఖరిలో మార్పు కనిపిస్తోంది. టీడీపీ-జనసేన కూటమిలో బీజేపీ చేరుతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఎన్నికల్లో పొత్తుల గురించి ఇంకా తేల్చుకోలేదని పవన్ చెప్పడం ఒకింత ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
పవన్ వ్యూహమేనా..?
ప్రస్తుత పరిస్థితుల్లో పవన్ అన్ని చోట్లా ఒంటరిగా పోటీ చేసి, గెలిచే పరిస్థితి లేదు. కొన్నిచోట్ల మాత్రమే జనసేన బలంగా ఉంది. మిగతా చోట్ల గెలవాలంటే టీడీపీ వంటి పార్టీ మద్దతు కావాల్సిందే. దీంతో టీడీపీతో పొత్తుకు రెడీ అయ్యారు. అయితే, పవన్ పరిస్థితి చూసిన టీడీపీ జనసేనను వాడుకోవాలని చూస్తోంది. ఆ పార్టీకి తక్కువ సీట్లివ్వాలని భావిస్తోంది. 175 అసెంబ్లీ స్థానాలుండగా జనసేనకు 45 వరకు మాత్రమే స్థానాలు ఇవ్వాలని టీడీపీ అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇదే జనసేనానికి నచ్చడం లేదు. ఇంత తక్కువ సీట్లలో పోటీ అంటే అది పార్టీ స్థాయిని తగ్గించడమే. అందుకే సంఖ్య చెప్పకపోయినా.. గౌరవప్రదమైన సీట్లు కావాలని జనసేనాని ఆశిస్తున్నారు. అంటే మరిన్ని ఎక్కువ సీట్లు ఆశిస్తున్నారు. దీనికి టీడీపీ సిద్ధంగా లేదు. ఎక్కువ సీట్లిచ్చి జనసేన గెలిస్తే ఆ పార్టీ బలపడుతుంది. ఇది భవిష‌్యత్తులో టీడీపీకి ఇబ్బందే. అలాగని తక్కువ సీట్లతోనే సర్దుకునే
ఆలోచన పవన్‌కు కూడా లేదు. అందుకే పొత్తుల విషయంలో పవన్ మైండ్ గేమ్ స్టార్ట్ చేశారని విశ్లేషకులు భావిస్తున్నారు.
టీడీపీకే నష్టం..
పొత్తు కుదరకపోతే జనసేనకంటే టీడీపీకే ఎక్కువ నష్టం. ఒంటరిగా పోటీ చేసినా జనసేన ఎన్నోకొన్ని సీట్లు గెలుస్తుంది. గెలవకపోయినా.. పెద్దగా పోయేదేమీ లేదు. కానీ, ఈసారి టీడీపీ గెలవకుంటే మాత్రం ఆ పార్టీ పని అయిపోయినట్లే. టీడీపీకే జనసేన అవసరం ఎక్కువ ఉంది. గత ఎన్నికల్లో టీడీపీ-జనసేన వేరుగా పోటీ చేయడం వల్లే టీడీపీ ఓడిపోయిందనే అభిప్రాయం ఉంది. ఇప్పుడా పొరపాటు జరగకూడదని టీడీపీ కోరుకుంటోంది. ఇక పొత్తుల విషయంలో పవన్ స్పష్టత ఇవ్వకపోతే టీడీపీ పరిస్థితి గందరగోళంగా తయారవుతుంది. పొత్తు కోసం టీడీపీ ఒప్పించాల్సిన పరిస్థితి వస్తుంది. అదే జరిగితే జనసేన అడిగినన్ని సీట్లు టీడీపీ ఇవ్వకతప్పదు. మరోవైపు అవసరమైతే సీఎం రేసులో కూడా నిలబడేందుకు పవన్ ప్రయత్నిస్తున్నారన్న వాదన కూడా బలంగా వినిపిస్తోంది. తన అవసరం ఉన్న టీడీపీ దగ్గర తానేందుకు తగ్గాలి అని పవన్ భావిస్తున్నట్లుంది. మరోవైపు సీట్ల పంపకం విషయంలో టీడీపీ-జనసేన మధ్య ఏదో తేడా జరిగిందనే ప్రచారం కూడా జరుగుతోంది. అందుకే జనాల్లోకి వెళ్లడం ద్వారా పవన్ తన బలం నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీనివల్ల తనకెంత ఆదరణ ఉందో చూపించి, కావాల్సినన్ని సీట్లు పొందే ఎత్తుగడ పవన్ చేసినట్లు అనిపిస్తోంది.
సీఎం పదవి కోరుతున్న పవన్
ప్రస్తుతం పవన్ వైఖరిలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. రాబోయే ఎన్నికల్లో సీఎం పదవి వస్తే సంతోషంగా స్వీకరిస్తా అంటూ పవన్ వ్యాఖ్యానించారు. 2024, 2029లలో జనసేనకు అధికారం ఇవ్వాలని కోరుతున్నారు. తన మాటల్లో ఎక్కడా టీడీపీ, బీజేపీతో పొత్తు గురించి ప్రస్తావించడం లేదు. ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటూ ప్రజల్ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. పవన్ ఇలా మారడానికి టీడీపీ వైఖరే కారణమని జనసేన వర్గాలు అంటున్నాయి. ఇటీవల టీడీపీ ప్రకటించిన మేనిఫెస్టో ఏకపక్షంగా ఉంది. కలిసి పోటీ చేయాలనుకుంటున్న జనసేనను ఈ విషయంలో టీడీపీ కాస్త కూడా సంప్రదించలేదు. సీట్లు, మేనిఫెస్టో, సీఎం పదవి వంటి అనేక అంశాల్లో ఇరు పార్టీల మధ్య బేధాబిప్రాయాల కారణంగా ప్రస్తుతం జనసేనాని ఒంటరిగానే పోరాటం చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. రాబోయే రోజుల్లో ఇరు పార్టీలు చర్చలు జరిపి, సమస్యను పరిష్కరించుకునే అవకాశం ఉంది.