Pawan Kalyan: విశాఖ నుంచి మూడో విడత వారాహి యాత్ర.. మరో సంచలనం తప్పదా..? వైసీపీ స్ట్రాటజీ ఏంటి..?
తాజా రాజకీయ పరిస్థితులు చూస్తుంటే ఈ యాత్ర రాజకీయంగా ప్రకంపనలు సృష్టించే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ యాత్రను అడ్డుకునేందుకు వైసీపీ శతవిధాలా ప్రయత్నిస్తోంటే.. ఎలాగైనా యాత్రను విజయవంతం చేసి తీరుతామని జనసైనికులు అంటున్నారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మూడో విడత వారాహి విజయ యాత్రను గురువారం విశాఖపట్నం నుంచి ప్రారంభించబోతున్నారు. తాజా రాజకీయ పరిస్థితులు చూస్తుంటే ఈ యాత్ర రాజకీయంగా ప్రకంపనలు సృష్టించే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ యాత్రను అడ్డుకునేందుకు వైసీపీ శతవిధాలా ప్రయత్నిస్తోంటే.. ఎలాగైనా యాత్రను విజయవంతం చేసి తీరుతామని జనసైనికులు అంటున్నారు.
విశాఖ జిల్లాలో ఆగష్టు 10 నుంచి పది రోజులపాటు జనసేనాని పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర చేయబోతున్నారు.
ఈ యాత్ర కోసం జనసేన అన్ని ఏర్పాట్లు చేసింది. యాత్ర రూట్ మ్యాప్ కూడా సిద్ధమైంది. అయితే, యాత్రకు పోలీసుల నుంచి అనేక ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఆంక్షలతో కూడిన అనుమతులే మంజూరు చేసే అవకాశం ఉంది. ఇలాంటి ఎన్ని ఇబ్బందులు ఎదురైనా పవన్ వారాహి యాత్రను షెడ్యూల్ ప్రకారమే కొనసాగిస్తారు. యాత్ర కోసం జనసైనికులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లో సాగిన రెండు విడతల వారాహి యాత్ర విజయవంతం కావడంతో మూడో విడత యాత్ర కూడా అంతకుమించి సక్సెస్ అవుతుందని జనసైనికులు ఆశిస్తున్నారు. మరోవైపు వైసీపీ శ్రేణులు ఈ యాత్రకు ఆటంకాలు సృష్టించేందుకు రెడీ అవుతున్నాయి. ఇటీవల పుంగనూరు తరహాలో హింసాత్మక ఘటనలు జరుగతాయేమో అనే అనుమానాల్ని వ్యక్తం చేస్తున్నారు జనసైనికులు.
పవన్ ప్రసంగాలపైనే ఉత్కంఠ..
మొదటి రెండు విడతల్లో పవన్ లేవనెత్తిన అంశాలపై ఏపీలో గట్టి చర్చే నడిచింది. ముఖ్యంగా వాలంటీర్ల అంశం తీవ్ర చర్చకు దారితీసింది. యాత్ర సందర్భంగా అనేక విషయాల్లో ప్రభుత్వంపై పవన్ తీవ్ర విమర్శలు చేశారు. వాటికి వైసీపీ నుంచి గట్టి కౌంటర్లు పడ్డాయి. ఈసారి పవన్ ఏ అంశాన్ని లేవనెత్తుతారు..? ప్రభుత్వంపై ఎలాంటి ఆరోపణలు చేస్తారు..? అనే విషయంపై రాజకీయవర్గాల్లో ఆసక్తి నెలకొంది. వైసీపీ నాయకులు కూడా ఈ విషయంలో కౌంటర్లు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. ఈసారి విశాఖకు సంబంధించిన అనేక అంశాల్ని పవన్ లేవనెత్తబోతున్నారని తెలుస్తోంది. విశాఖలో భూ కబ్జాలు, శాంతి భద్రతల క్షీణత, భూ దందాలు, ప్రకృతి విధ్వంసం, రుషికొండ ధ్వంసం, జీవీఎంసీలో అవినీతి, స్థానిక పరిశ్రమలతో కాలుష్యం, మత్స్యకారుల సమస్యలు వంటి అనేక అంశాల్ని ప్రస్తావించబోతున్నారు. అలాగే స్థానిక వైసీపీ నేతల అవినీతిపైనా ప్రశ్నించబోతున్నారు.
చిరంజీవి వ్యాఖ్యల నేపథ్యంలో
సినిమా పరిశ్రమపై వైసీపీ వైఖరిపై చిరంజీవి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆ పార్టీ మంత్రులంతా కలిసి చిరంజీవిపై విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. చిరంజీవి తన వ్యాఖ్యల ద్వారా పవన్‌కు పరోక్షంగా మద్దతిచ్చినట్లైంది. ఈ నేపథ్యంలో పవన్ కూడా చిరంజీవికి మద్దతుగా మాట్లాడుతారా..? అని జనసైనికులు ఎదురుచూస్తున్నారు. ఈ విషయంలో కచ్చితంగా పవన్ వైసీపీకి గట్టి సమాధానం చెప్పే అవకాశం ఉంది. ఇక రాజకీయంగా పవన్ విశాఖ జిల్లాపై స్పెషల్ ఫోకస్ చేశారు. గతంలో ఇక్కడి నుంచి నేరుగా పవన్ కళ్యాణే ఓడిపోయినప్పటికీ ఈసారి మాత్రం విశాఖ ఉమ్మడి జిల్లా నుంచి ఒక్క సీటు కూడా వైసీపీ గెలవకూడదని పవన్ భావిస్తున్నారు. దీనికి తగ్గట్లే ఇక్కడ వైసీపీపై స్థానికుల్లో వ్యతిరేకత కనిపిస్తోంది. దీన్ని క్యాష్ చేసుకునేందుకు పవన్ ప్రయత్నిస్తున్నారు.
మళ్లీ రచ్చ జరగడం ఖాయమా..?
గత ఏడాది పవన్ విశాఖలో పర్యటించినప్పుడు జరిగిన రచ్చ గురించి తెలిసిందే. శాంతి భద్రతల పేరుతో పవన్ కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. పవన్‌ను హోటల్ గదికే పరిమితం చేశారు. దీంతో విశాఖ అంతటా ఉద్రిక్త వాతావరణం కనిపించింది. జనసేన శ్రేణులు మాత్రం పవన్‌కు అండగా నిలబడ్డాయి. ఈ సారి కూడా పవన్‌ను అడ్డుకునేందుకు వైసీపీ ప్రయత్నిస్తోంది. అసలే ఇటీవల పుంగనూరులో జరిగిన హింస గురంచి తెలిసిందే. పవన్ పర్యటన విషయంలో వైసీపీ ఎలా ప్రవర్తిస్తుంది అని ఆసక్తి నెలకొంది. వైసీపీ అడ్డుకోవాలని చూస్తే తీవ్ర ప్రతిఘటన ఎదురవ్వడం ఖాయం.