Pawan Kalyan: పవన్ టూర్‌తో అధికారులకు టెన్షన్.. సేనానికి వణికిపోయి ఏం చేశారంటే..
జనసేన అధినేత పవన్ కల్యాణ్... ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలను పరిశీలిస్తారు.. నష్టపోయిన రైతులను పరామర్శించనున్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా జనసేన ప్రకటించింది.. కడియంలో అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు పరామర్శించనున్న పవన్ కల్యాణ్.. కొత్తపేట మండలం ఆవిడిలో రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు.. మధురపూడి విమానాశ్రయం నుండి పవన్ కల్యాణ్ పర్యటన ప్రారంభం కాబోతోంది.
కడియం, కొత్తపేట అనంతరం పి.గన్నవరం మండలం రాజులపాలెంలోనూ పవన్ పర్యటన కొనసాగనుంది.. సాయంత్రం తిరిగి రాజమండ్రికి చేరుకుని విమానంలో హైదరాబాద్ బయల్దేరి వెళ్లనున్నారు పవన్. రాష్ట్రంలో అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఇప్పటికే పలు ప్రాంతాల్లో జనసేన నేతలు పరామర్శించారు. ఇప్పుడు పార్టీ అధినేత పవన్ కల్యాణ్ నేరుగా రైతుల పరిస్థితిని తెలుసుకోవడానికి రంగంలోకి దిగారు. పవన్ రాక కోసం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు. పవన్ పర్యటనతో అధికారులు అలర్ట్ అయ్యారు. ఇదే ఇప్పుడు తీవ్ర విమర్శలకు కారణం అవుతోంది. కొత్తపేట అసెంబ్లీ నియోజకవర్గం ఆవిడలో అధికారులు ఓవరాక్షన్ చేశారు.
పర్యటనలో భాగంగా ఆవిడి గ్రామంలో పవన్ పర్యటిస్తారు. దీంతో అధికారులు హడావుడి మొదలుపెట్టారు. ఇప్పటివరకు లేని పనికి ఆహార పథకాన్ని తెరమీదకు తీసుకువచ్చారు. రైతులకు కూలీలంతా సహకరించాలని పక్క గ్రామాల నుంచి రప్పించారు అధికారులు. రైతుల ధాన్యం దగ్గరకు కొనుగోలు చేస్తామంటూ వ్యవసాయ శాఖ అధికారులతో పాటు.. రెవెన్యూ సిబ్బంది వచ్చారు. దీనిపై రైతులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కోతలే ఇంకా పూర్తి కాలేదు.. పైగా వర్షంతో తడిసిన ధాన్యం కూడా పూర్తిగా ఆరకుండా ఎలా అమ్మకాలు చేయాలంటూ నిలదీశారు. దీంతో ఆవిడిలో ఉద్రిక్త పరిస్థితులు కనిపించాయ్. పవన్ వస్తున్నారని భయపడి.. అధికారులు హడావుడి మొదలుపెట్టారని రైతులు అంటున్నారు.