Pawan Kalyan: పవన్ మిస్టేక్ – టీడీపీ కోసం రాయబారం చేయడమేంటి..?
పవన్ కల్యాణ్ టీడీపీ తరపున రాయబారం చేయడానికి వచ్చారనేది బీజేపీ చెప్తున్న మాట. తమ పార్టీ కోసం కాకుండా టీడీపీ తరపున వకాల్తా పుచ్చుకుని పొత్తులపై చర్చించడానికి వచ్చినట్లు బీజేపీ భావిస్తోంది.

రాజకీయ పార్టీలేవైనా తన సొంత లాభం కోసం ప్రయత్నిస్తుంటాయి. తాము అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తుంటాయి. ఇందుకోసం ఇతర పార్టీలను తొక్కేసి పైకి ఎదగాలనుకుంటాయి. కానీ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) మాత్రం ఇందుకు భిన్నంగా కనిపిస్తున్నారు. పార్టీ పెట్టి పదేళ్లు దాటినా ఇప్పటికీ పూర్తిస్థాయిలో రాజకీయం చేయట్లేదు. విపక్షాలు ఆరోపిస్తున్నట్టు ఇంకా పార్ట్ టైం పొలిటీషియన్ గానే ఉంటున్నారు. పైగా.. పక్క పార్టీలకు మేలు చేసేందుకు తప్ప సొంత పార్టీని బలోపేతం చేసుకునే ఉద్దేశం పవన్ కు ఉన్నట్టు కనిపించట్లేదు. ఇందుకు తాజా ఢిల్లీ పర్యటనే పెద్ద ఉదాహరణ.
పవన్ కల్యాణ్ అకస్మాత్తుగా ఢిల్లీలో దర్శనమిచ్చే సరికి ఏదైనా కీలక పని మీద వెళ్లి ఉంటారని అనుకున్నారు. ముఖ్యంగా ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్నందున బీజేపీ (BJP) నుంచి రోడ్ మ్యాప్ (Road map) కోసం వెళ్లి ఉంటారని భావించారు. ఎందుకంటే బీజేపీ – జనసేన (Janasena) ఇప్పటికీ పైకి కలిసే ఉన్నాయి. రెండుపార్టీల నుంచి అధికారికంగా కటీఫ్ చెప్పుకున్నట్టు ప్రకటన వెలువడ లేదు. కాబట్టి ఆ రెండూ కలిసే ఉన్నాయనుకోవాలి. ఆ మధ్య పార్టీ ఆవిర్భావ సభలో బీజేపీపై పవన్ చేసిన కామెంట్స్ రెండు పార్టీల మధ్య దూరం పెంచాయి. అయినా బీజేపీ మాత్రం తాము జనసేనతో కలిసే ఉన్నామని చెప్పుకుంటూ వస్తోంది.
ఈ పరిస్థితుల్లో పవన్ ఢిల్లీ పర్యటన ఆసక్తి రేపింది. బీజేపీ అగ్ర నేతలను కలిసి తప్పకుండా పొత్తులపై ఒక క్లారిటీతో వస్తారని అందరూ అనుకున్నారు. అయితే ప్రధాని మోదీ (PM Modi) , హోంమంత్రి అమిత్ షా (Amit Shah) అపాయింట్మెంట్ పవన్ కు దక్కలేదు. దీంతో బీజేపీ చీఫ్ నడ్డాతో (JP NAdda) మాత్రమే భేటీ అయ్యారు. తాను చెప్పాలనుకున్నది చెప్పారు. అయతే తమ చర్చల్లో పవన్ కల్యాణ్ ఎక్కువగా టీడీపీ (TDP) ప్రస్తావనే తీసుకొచ్చారన్నది సమాచారం. టీడీపీ- బీజేపీ – జనసేన కలిసి పోటీ చేస్తే బాగుంటుందని.. అప్పుడే వైసీపీని ఓడించ వచ్చని ప్రతిపాదించారు. పవన్ చెప్పిందంతా విన్న నడ్డా.. త్వరలోనే తమ నిర్ణయం చెప్తామని చెప్పి పంపించారట.
పవన్ కల్యాణ్ టీడీపీ తరపున రాయబారం చేయడానికి వచ్చారనేది బీజేపీ చెప్తున్న మాట. తమ పార్టీ కోసం కాకుండా టీడీపీ తరపున వకాల్తా పుచ్చుకుని పొత్తులపై చర్చించడానికి వచ్చినట్లు బీజేపీ భావిస్తోంది. జగన్ అండగా ఉండగా టీడీపీతో కలిసి పని చేసే ఉద్దేశం బీజేపీకి ఎంతమాత్రం ఉండదు. అలాంటప్పుడు పవన్ కల్యాణ్ టీడీపీని వెనకేసుకురావడం, ఆ పార్టీతో పొత్తు పెట్టుకుందామని ప్రతిపాదించడం బీజేపీకి ఏమాత్రం ఇష్టం లేదు. కాబట్టి ఇది జరిగే పని కాదు. ఇదే విషయాన్ని త్వరలోనే అధికారికంగా బీజేపీ నుంచి పవన్ కు రానుంది. మరి అప్పుడు పవన్ ఏం చేస్తారో చూడాలి.