ప్రభుత్వంలో పవన్ వర్సెస్ లోకేష్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఇప్పుడు మంత్రుల మధ్య పోటీ ఆసక్తిని రేపుతోంది. కీలక శాఖల్లో పని చేసే మంత్రులు రాజకీయ పరమైన అంశాల మీద పెద్దగా దృష్టి సారించకుండా తమ పని తీరుని మెరుగుపరుచుకునే కార్యక్రమం చేస్తున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: August 20, 2024 | 02:20 PMLast Updated on: Aug 20, 2024 | 2:20 PM

Pawan Vs Lokesh In Govt

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఇప్పుడు మంత్రుల మధ్య పోటీ ఆసక్తిని రేపుతోంది. కీలక శాఖల్లో పని చేసే మంత్రులు రాజకీయ పరమైన అంశాల మీద పెద్దగా దృష్టి సారించకుండా తమ పని తీరుని మెరుగుపరుచుకునే కార్యక్రమం చేస్తున్నారు. అందులో ఐటి శాఖా మంత్రి నారా లోకేష్, సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి పవన్ కళ్యాణ్ ముందు వరుసలో ఉన్నారు. ఇద్దరి శాఖలు రాష్ట్రానికి అత్యంత కీలకమైనవే. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయంలో కీలక పాత్రలు పోషించేవే. దీనితో ఇద్దరూ కూడా తమ మేధస్సుకు పదును పెడుతున్నారు.

ఐటి మంత్రిగా నారా లోకేష్ కు గత అనుభవం ఉంది. దీనితో ఆయన రాష్ట్రానికి వచ్చే కంపెనీల మీద దృష్టి సారించారు. త్వరలోనే పలు కీలక సంస్థలను వైజాగ్ కు తెచ్చే విధంగా యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తున్నారు. విదేశీ పర్యటనకు కూడా ఆయన వెళ్ళే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. ఇక పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే… రాష్ట్రానికి శాస్త్ర సాంకేతిక రంగాల్లో గొప్ప సంస్కరణలు అందించాలనే ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు. ఇటీవల శ్రీహరి కోట వెళ్ళినప్పుడు అక్కడున్న శాస్త్రవేత్తలతో కూడా ఆయన చర్చించారు.

ఇక అధికారులతో కూడా పలు అభిప్రాయాలను పంచుకుంటున్నారు. ఈసేవలో కొన్ని మార్పులు చేయించే విధంగా పవన్ ప్లాన్ చేస్తున్నారట. ఈసేవలో ఉండే కొన్ని సదుపాయాలు కొన్ని ఇంటి వద్దనే మనం చూసుకునే సౌలభ్యం ఉంది. దీనికి సంబంధించి ఒక మొబైల్ యాప్ ని తయారు చేయించి మరికొన్ని సేవలను అందుబాటులోకి తెచ్చే ఆలోచనలో ఉన్నారట పవన్ కళ్యాణ్. అలాగే అటవీ శాఖకు సంబంధించి కూడా ఒక యాప్ ని తయారు చేయించే ప్లాన్ చేస్తున్నారు. అడవుల్లో ఉండే పర్యాటక ప్రాంతాలను ఆ యాప్ లో చూపిస్తారు.

అలాగే ఎన్ని లక్షల హెక్టార్ల అడవి ఉంది, ఏ ప్రాంత అడవిలో ఏయే వృక్షాలు ఫేమస్ వంటివి, అటవీ జంతు సంపద వంటి కీలక విషయాలను ప్రజలకు అందించే విధంగా ఒక యాప్ ని ఆయన ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇలా సాంకేతిక రంగాల్లో ఇద్దరు మంత్రులు దూకుడుగా ఉండటంతో అధికారులు కూడా మరింత ఉత్సాహంగా పని చేస్తున్నారట. ఈ మధ్య కాలంలో ఇద్దరూ పెద్దగా రాజకీయ పరమైన అంశాల్లో కూడా పెద్దగా జోక్యం చేసుకోవడం లేదనే చెప్పాలి.