చేతులు కాలాక ఆకులు ఆలస్యంగా కదిలిన నానీలు
ఎన్నికల తర్వాత సైలెంటైన నానీ బ్రదర్స్ మళ్లీ తెరపైకి వచ్చారు. తమ నేత జగన్ ను కాపాడేందుకు రంగంలోకి దిగారు. వివాదం రేగిన వారం తర్వాత కళ్లు తెరిచి హడావుడిగా మీడియాతో మాట్లాడేసి,,, టీడీపీపై విమర్శలు సంధించి తమ నోటి దురదను తీర్చుకున్నారు.
ఎన్నికల తర్వాత సైలెంటైన నానీ బ్రదర్స్ మళ్లీ తెరపైకి వచ్చారు. తమ నేత జగన్ ను కాపాడేందుకు రంగంలోకి దిగారు. వివాదం రేగిన వారం తర్వాత కళ్లు తెరిచి హడావుడిగా మీడియాతో మాట్లాడేసి,,, టీడీపీపై విమర్శలు సంధించి తమ నోటి దురదను తీర్చుకున్నారు. కానీ ఆలస్యమైపోయింది ఫోబ్స్… అబ్బే మీరెంత గొంతు చించుకున్నా పట్టించుకునేవాళ్లు లేరు. బెటర్ సైలెంట్.
తిరుమల లడ్డు వివాదం రేగి వారం రోజులు దాటింది. చంద్రబాబు దెబ్బకు చక్రబంధంలో చిక్కుకుని జగన్ గిలగిలా కొట్టుకుంటున్నారు. బాబు అంటించిన మంటలో పవన్ మరింత నెయ్యి పోసి రగిల్చాడు. వెంకన్న ప్రసాదాన్నే అపవిత్రం చేయడంపై దేశవ్యాప్తంగా హిందువులు రగిలిపోతున్నారు. అన్ని కళ్లూ జగన్ ను అనుమానంగా చూస్తున్నాయి. దీంతో ఉక్కిరిబిక్కిరైపోతున్న జగన్… తనను, పార్టీని ఎలా కాపాడాలో అర్థం కాక తలపట్టుకుంటున్నారు. అధికారంలో ఉన్నప్పుడు నోరు పారేసుకున్న నేతలెవరూ ధైర్యంగా మీడియా ముందుకు రాలేకపోతున్నారు. ఏం మాట్లాడితే ఏం వస్తుందో అని సైలెంటైపోయారు. జగన్ పెట్టిన ప్రెస్ మీట్ చప్పగా సాగింది. ఆయనేం చెబుతున్నారో ఆయనకే అర్థం కాలేదు సుబ్బారెడ్డి ఏదో చెప్పినా ఎవరూ పట్టించుకోలేదు. ఇక కరుణాకరరెడ్డిని తిరుపతి వాళ్లే లైట్ తీసుకున్నారు. ఇక అంబటి ఓ ప్రెస్ మీట్ పెట్టినా ఇప్పటికే జోకర్ ముద్ర పడిపోవడంతో ఎవరూ సీరియస్ గా తీసుకోలేదు. ఇక జగన్ నమ్మినబంటు పొన్నవోలు అయితే ఏకంగా ఆవునెయ్యి కంటే పందికొవ్వు రేటెక్కువ అంటూ మరింత ముంచేశాడు, ఇక పరమానందయ్య శిష్యులతో పని కాదనున్న జగన్ తన పాత కాపులు నానీ బ్రదర్స్ ను రంగంలోకి దించారు,
కొడాలి నాని, పేర్ని నానిలతో పాటు మరికొందరిని తన ఆఫీసుకు పిలిపించుకుని మాట్లాడారు జగన్. అంతే ఆ ఇద్దరూ మైకాసురుల్లా మారిపోయి అధికారపార్టీని చెడామడా తిట్టేశారు. తమ పాత స్టైల్లోనే నోరు పారేసుకున్నారు. కానీ ఇప్పటికే ఆలస్యం అయిపోయిందని వారికి అర్థమైనట్లు లేదు. విషయం ఎప్పుడో జగనన్న చేయి దాటిపోయింది. మేటర్ జనంలోకి వెళ్లిపోయింది. జనం తప్పు జరిగిందన్న నిర్ణయానికి వచ్చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల వెళ్లిన ప్రతి ఒక్కరికీ అక్కడి పరిణామాలు ఆవేదన కలిగించాయి. పరమ పవిత్రంగా భావించే లడ్డు, అన్నప్రసాదం నాణ్యతను అటకెక్కించారు. అంతా కల్తీ… అన్నీ కల్తీ… గతంలో క్యూలైన్ లో పాలు, ప్రసాదం అందించేవారు. కానీ గత ఐదేళ్లలో భక్తుల గురించి పట్టించుకున్న వాడే లేడు. శ్రీవాణి వివాదం, రోజక్క లాంటి వారికి వారానికోసారి మందీమార్బలంతో దర్శనం, వెంకన్న ఆలయం ముందు రాజకీయ ప్రసంగాలు.. అబ్బో ఇలా చెప్పుకుంటూ పోతే వైసీపీ లీలలు అన్నీ ఇన్నీ కావు. జనం దేన్నైనా మర్చిపోతారు. కానీ భగవంతుడి జోలికి వెళితే ఊరుకోరు. అదే చావు దెబ్బ కొట్టింది. చంద్రబాబు లడ్డూలో జంతువుల కొవ్వు అనగానే జరిగే ఉండొచ్చు అన్నవారే ఎక్కువగా ఉన్నారు. వారికి ఎదురైన అనుభవం అలాంటిది.
ఇప్పుడు నానీలొచ్చి మేం వచ్చాం మేం చెప్పింది వినండి అంటే వినడానికి జనం చెవిలో పూలు పెట్టుకుని లేరు. ఈ పత్తిత్తులు చెప్పగానే జనం వైసీపీని పరిశుద్ధ పార్టీగా భావిస్తారనుకున్నారేమో…! నిజానికి ఈ నానీలే గత ఎన్నికల్లో జగన్ ను చావుదెబ్బ కొట్టారు. కర్ణుడి చావుకి సవాలక్ష కారణాలన్నట్లు జగన్ ఓటమికి నానీలు కూడా తమకు తెలియకుండానే యథాశక్తి సహకరించారు. మేలు చేస్తున్నామనుకుని నోరు పారేసుకుని జగన్ ను జనంలో పలచన చేశారు. వారికీ, వైసీపీ కార్యకర్తలకు మేటర్ అర్థమయ్యేసరికి పార్టీ బుడమేరులో కలసిపోయింది. దాంతో నానీలు కూడా లైబ్రరీయన్లలాగా సైలెంటయ్యారు. కానీ ఇప్పుడు అధినేత చెప్పడంతో మీకెందుకు బాస్ మేం మొత్తం మార్చేస్తామని హామీ ఇచ్చి హడావుడిగా మైక్ పట్టుకున్నారు. కానీ అంతా అయిపోయింది బ్రదర్. మీరెంత వాగినా టైమ్ వేస్ట్… ఎనర్జీ వేస్ట్… సో బెటర్ సైలెంట్.