నన్ను కచ్చితంగా లేపేస్తారు.. జగన్‌ సంచలన స్టేట్‌మెంట్‌

dialtelugu author

Dialtelugu Desk

Posted on: August 5, 2024 | 07:58 PMLast Updated on: Aug 06, 2024 | 9:19 AM

Petition In High Court To Increase Security

తనకు ప్రాణహాని ఉందని.. సెక్యూరిటీ కల్పించాలని ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి హైకోర్టులో మరో పిటిషన్ దాఖలు చేశారు. ఎన్నికల ఫలితాల తర్వాత తనకు భద్రత తగ్గించేశారని, తనకు ప్రాణహాని ఉండడంతో.. ఎన్నికల ఫలితాలకు ముందు ఉన్న భద్రతను పునరుద్ధరించాలని కోరుతూ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. తన నివాసం దగ్గర ఉన్న సెక్యూరిటీలో ప్రభుత్వం మార్పులు చేసింది. దీంతో జగన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. తనకు తగినంత సెక్యూరిటీ కల్పించేలా… ప్రభుత్వాన్ని ఆదేశించాలని హైకోర్టుకు విన్నపాలు వినిపించారు. తనకు కేటాయించిన వాహనం కూడా సరిగాలేదని పిటిషన్‌లో తెలిపారు జగన్‌.

మరమ్మతులకు గురైన వాహనాన్ని కేటాయించారని వివరించారు. ఈ పిటిషన్‌ను స్వీకరించిన కోర్టు ధర్మాసనం.. మరో రెండు రోజుల్లో విచారణ చేపట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. సీఎంగా ఉన్నప్పుడు తనకు అందించిన భద్రత ప్రాముఖ్యతను జగన్ గుర్తుచేశారు. ఎన్నికల ఫలితాలు వచ్చాక.. ఆశ్చర్యకరంగా నెల రోజుల్లోనే తన భద్రతను 59కి తగ్గించారని… అది కూడా తనకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే చేశారని పిటిషన్‌లో తెలిపారు జగన్‌.

జడ్ ప్లస్‌గా ఉన్న తన భద్రత తగ్గించడంతో పాటు… భద్రతా సిబ్బంది సంఖ్యను కూడా భారీగా తగ్గించేశారని ఆరోపించారు. ప్రస్తుతం తనకు ఇద్దరు అధికారులు మాత్రమే సెక్యూరిటీగా ఉన్నారని.. ఇది తన ప్రాణాలకు ప్రమాదం అని జగన్ పిటిషన్‌లో వివరించారు. గతంలో తనపై జరిగిన కోడికత్తి దాడితో పాటు పలు అంశాల్ని ప్రస్తావించారు. జూన్ 3 నాటికి జగన్‌కి 900 మందితో భద్రత ఉంది. ఐతే ఆ రోజున ఉన్న స్థాయికి… తన భద్రతను పునరుద్ధరించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని జగన్ హైకోర్టులో దాఖలు చేసిన రిట్ పిటిషన్‌లో కోరారు.