Pilli Subhash Chandra Bose: బోసు తగ్గారా.. నెగ్గారా..? జగన్ చెప్పిందేంటి..?
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం ఇప్పుడు వైసీపీలో హాట్ టాపిక్. మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ, ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. ఇద్దరూ ఢీ అంటే ఢీ అంటున్నారు. ఎవరూ తగ్గట్లేదు. కొన్ని రోజులుగా రెండు వర్గాల మధ్య జరుగుతున్న పరిణామాలు తాడేపల్లిని తాకాయి.
Pilli Subhash Chandra Bose: రామచంద్రాపురం వైసీపీలో కుమ్ములాటలపై సీఎం జగన్ ఫోకస్ పెట్టారు. పిల్లి సుభాష్ చంద్రబోస్‌ను పిలిపించి మాట్లాడారు. కాస్త సీరియస్‌గానే క్లాస్ తీసుకున్నట్లు చెబుతున్నారు. ఇంతకీ ఇన్‌హౌస్ ఏం జరిగింది..? బోసు తగ్గారా.. నెగ్గారా..?
లోపల ఏం జరిగింది..?
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం ఇప్పుడు వైసీపీలో హాట్ టాపిక్. మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ, ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. ఇద్దరూ ఢీ అంటే ఢీ అంటున్నారు. ఎవరూ తగ్గట్లేదు. కొన్ని రోజులుగా రెండు వర్గాల మధ్య జరుగుతున్న పరిణామాలు తాడేపల్లిని తాకాయి. దీంతో వెంటనే పిల్లి సుభాష్ చంద్రబోసును పిలిపించి మాట్లాడారు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి. లోపల పిల్లికి కొంచెం గట్టిగానే సీఎం జగన్ వార్నింగ్ ఇచ్చినట్లు చెబుతున్నారు. నీ కొడుకు భవిష్యత్తు నేను చూసుకుంటా అంటూనే చిన్న చిన్న విషయాలకు రోడ్డెక్కవద్దని చెప్పినట్లు తెలుస్తోంది. నియోజకవర్గంలోని పరిస్థితులను పిల్లి సీఎంకు వివరించారు. తన వర్గంపై మంత్రి వేణు అక్రమంగా కేసులు బనాయిస్తున్నారని, చిన్న చిన్న పనులు కూడా కావడం లేదని చెప్పుకొచ్చారు. ఇటీవల ఆత్మీయ సమావేశం తర్వాత జరిగిన పరిణామాలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు. చివర్లో తన మనసులో మాటను స్పష్టంగా చెప్పేసారు. తన కుమారుడు పిల్లి సూర్యప్రకాష్‌ను ఈసారి రామచంద్రాపురంలో పోటీ చేయించాలి అనుకుంటున్నట్లు చెప్పారు. మొదట్నుంచి వెంట నడిచిన తన కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. అవసరమైతే ఇండిపెండెంట్‌గా బరిలోకి దింపుతానన్న వ్యాఖ్యలపై సీఎం ఆరా తీసినట్లు చెబుతున్నారు. మీ అబ్బాయిని ఎక్కడ పోటీకి దించాలో నాకు తెలుసు అంటూ సీఎం జగన్ పిల్లితో అన్నారంటున్నారు. అదే సమయంలో రచ్చకెక్కి పార్టీకి నష్టం చేయవద్దని గట్టిగా చెప్పారంటున్నారు. సీనియర్ నాయకుడైన మీరే ఇలా చేస్తే ఎలా అని ప్రశ్నించినట్లు సమాచారం.
పిల్లి ఏమంటున్నారు..?
సీఎం జగన్‌తో మీటింగ్ తర్వాత పిల్లి మీడియాతో మాట్లాడలేదు. అయితే తన నియోజకవర్గంలోని కొందరు నేతలతో మాత్రం మాట్లాడారు. సీఎం నుంచి ఎలాంటి హామీ దక్కలేదని ఆయన వాపోయినట్లు తెలుస్తోంది. నియోజకవర్గంలో సర్వేలు చేయించి నిర్ణయం తీసుకుంటానని మాత్రమే జగన్ చెప్పారంటున్నారు. ప్రస్తుతానికైతే పరిస్థితులు తమకు అనుకూలంగా లేవని బోసు భావిస్తున్నారు. చెల్లుబోయిన శెట్టిబలిజ సామాజిక వర్గానికి చెందినవారు. ప్రస్తుతం మంత్రిగా ఉన్న ఆయనకు సీటు నిరాకరించే పరిస్థితి లేదు. దీంతో జిల్లాలో మరో చోట సీటు అడ్జస్ట్ చేసే అవకాశముందేమో అని భావించారు. అయితే అన్ని చోట్లా టికెట్ల కోసం గట్టి పోటీ ఉంది. రామచంద్రాపురం బోసుకు గట్టి పట్టున్న చోటు. అందుకే వేరే చోట తన కుమారుడ్ని పోటీకి దింపి అతని రాజకీయ భవిష్యత్తుతో ఆటలాడలేనని పిల్లి అంటున్నారు. ఇప్పటికి తగ్గినా వచ్చే ఎన్నికల నాటికి ఏదో ఓ నిర్ణయం తీసుకోవాలని పిల్లి గట్టి పట్టుదలో ఉన్నట్లు తెలుస్తోంది.
వేణు వ్యూహమేంటి..?
పిల్లి సుభాష్ చంద్రబోసును సీఎం జగన్ పిలిపించి మాట్లాడటంతో వేణు వర్గం కూడా అప్రమత్తమైంది. నియోజకవర్గంలో తనకు అందుబాటులో ఉన్న నేతలతో వేణు సమావేశమయ్యారు. ఏం చేయాలన్న దానిపై చర్చించారు. సీఎం ఒకవేళ తనను పిలిపించి మాట్లాడితే ఏం చెప్పాలి అన్న దానిపై నేతల అభిప్రాయాలు తీసుకున్నారు. ప్రస్తుతానికి తమకు ఇబ్బందులు లేకున్నా బోసు లాంటి సీనియర్ నేత ఎలాంటి ఎత్తులు వేస్తారోనని వేణు వర్గం భయపడుతోంది. నియోజకవర్గంలో కొంతకాలంగా వేణు, పిల్లి వర్గాల మధ్య విభేదాలున్నాయి. గత ఎన్నికల్లో ఇక్కడ్నుంచి వేణు ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. పిల్లి ఎమ్మెల్సీగా ఉండి ఉపముఖ్యమంత్రిగా పనిచేశారు. తర్వాత పిల్లిని తొలగించి ఆయన్ను రాజ్యసభకు పంపారు. వేణు మంత్రయ్యారు. అప్పట్నుంచి నియోజకవర్గంలో ఇరువర్గాల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. అదిప్పుడు ముదిరి పాకాన పడింది. ఆత్మీయ సమావేశాల పేరిట కుంపట్లు రగిలించే దాకా దారితీసింది.