PM MODI Vs KTR: కేసీఆర్ కుటుంబంపై మోదీ ఫైర్.. రివర్స్ ఎటాక్ చేసిన కేటీఆర్

తెలంగాణ ప్రభుత్వం రోజూ నాలుగు పనులే చేస్తోంది. మొదటి పని.. ఉదయం నుంచి సాయంత్రం వరకు మోదీని తిట్టడం. రెండో పని.. కుటుంబ పార్టీ అయిన బీఆర్ఎస్‌ను పెంచి పోషించడం. మూడో పని తెలంగాణ ఆర్థిక వ్యవస్థను నాశనం చేయడం. నాలుగో పని తెలంగాణను అవినీతిలో కూరుకుపోయేలా చేయడం అన్నారు మోదీ.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: July 8, 2023 | 06:25 PMLast Updated on: Jul 08, 2023 | 6:25 PM

Pm Modi Fires On Brs And Kcr In Warangal Ktr Hits Out

PM MODI Vs KTR: వరంగల్‌‌లో శనివారం బీజేపీ నిర్వహించిన సభలో కేసీఆర్ కుటుంబం, బీఆర్ఎస్ పార్టీపై ప్రధాని నరేంద్ర మోదీ విమర్శలు గుప్పించారు. కల్వకుంట్ల కుటుంబంపై మండిపడ్డారు. కేసీఆర్ కుటుంబ పాలన, ఢిల్లీ లిక్కర్ స్కాంపై విమర్శలు చేశారు. తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందన్నారు. అవినీతి ఆరోపణలు లేని ప్రాజెక్టు తెలంగాణలో లేదని విమర్శించారు.

“తెలంగాణ ప్రభుత్వం రోజూ నాలుగు పనులే చేస్తోంది. మొదటి పని.. ఉదయం నుంచి సాయంత్రం వరకు మోదీని తిట్టడం. రెండో పని.. కుటుంబ పార్టీ అయిన బీఆర్ఎస్‌ను పెంచి పోషించడం. మూడో పని తెలంగాణ ఆర్థిక వ్యవస్థను నాశనం చేయడం. నాలుగో పని తెలంగాణను అవినీతిలో కూరుకుపోయేలా చేయడం. ఢిల్లీ లిక్కర్ స్కాంతో కేసీఆర్ కుటుండం కొత్త తరహా అవినీతికి తెరలేపింది. రెండు రాష్ట్రాలు, రెండు రాజకీయ పార్టీల మధ్య అవినీతి ఒప్పందం కుదరడం ఇదే మొదటిసారి. గతంలో రెండు రాష్ట్రాల మధ్య, రెండు దేశాల మధ్య నీళ్లు, అభివృద్ది పనుల గురించి ఒప్పందాలు జరిగేవి. కానీ లిక్కర్ స్కాం ద్వారా రెండు రాష్ట్రాల్లో అవినీతిని పంచుకున్నారు. కేసీఆర్ కుటుంబ అవినీతి ఢిల్లీ వరకు పాకింది. ఇక్కడ అధికారంలో ఉన్న ప్రభుత్వం కోట్ల రూపాయల అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటోంది. అవన్నీ ఇప్పుడు బహిర్గతమయ్యాయి. అవినీతి నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి కొత్త వ్యూహాలు పన్నుతోంది.

ఆ వ్యూహాల నుంచి, ఆలోచనల నుంచి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. కుటుంబ పార్టీల పాలనలో తెలంగాణ కూరుకుపోతుందని ఏనాడు అనుకోలేదు. కుటుంబ పార్టీల డీఎన్‌ఏ మొత్తం అవినీతి మయమే. తొమ్మిదేళ్లుగా బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోంది. తెలంగాణలో జనాల నమ్మకాన్ని బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వమ్ముచేసింది. తెలంగాణ ఉద్యమ సమయంలో చాలా గొప్ప మాటలు చెప్పారు. నిరుద్యోగులకు రూ.3 వేల నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చి నెరవేర్చకుండా మోసం చేశారు. పేదలకు డబుల్ డెబ్‌రూమ్ ఇళ్లు ఇస్తామని చెప్పి మోసం చేశారు. ఎన్నో ఉద్యోగాలు ఇస్తామన్నారు. టీఎస్‌పీఎస్‌సీ స్కామ్ గురించి అందరికీ తెలిసిందే. రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పి అది కూడా చేయలేదు. గత ప్రభుత్వాలు గిరిజనులపై సవతి తల్లి ప్రేమను చూపేవి. గిరిజన ప్రాంతాల అభివృద్ధి విషయంలో బీజేపీ సర్కారు ఆలోచనలు మార్చింది. దేశంలోనే బీజేపీ అతిపెద్ద రాజకీయ పార్టీ. తెలంగాణ అభివృద్ధికి భారీ నిధులు కేటాయిస్తున్నాం. రహదారుల అభివృద్ధికి రూ.36,000 కోట్లు ఇచ్చాం. 2014 రైల్వే బడ్జెట్‌తో పోలిస్తే 17 రెట్లు అదనపు నిధులిచ్చాం.

తెలంగాణలో 12 వర్సిటీల్లో ఉన్నత విద్యను బీఆర్ఎస్ తొక్కిపెట్టింది. లక్షల మంది విద్యార్థుల భవిష్యత్‌ను అణిచివేస్తున్నారు. వర్శిటీల్లో మూడు వేల అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దళితులు, బలహీన వర్గాలను తెలంగాణ ప్రభుత్వం మోసం చేస్తోంది. కార్పొరేషన్‌ ఎన్నికల్లో బీజేపీ ట్రైలర్‌ చూపించింది. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్‌ను అడ్రస్‌ లేకుండా చేస్తాం. తెలంగాణ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉంది” అంటూ మోదీ చెప్పుకొచ్చారు.
బదులిచ్చిన కేటీఆర్
వరంగల్‌లో మోదీ చేసిన ఆరోపణలు, విమర్శలపై తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పందించారు. “కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ తెలంగాణ ప్రజల 45 ఏళ్ల కల, డిమాండ్. కోచ్ ఫ్యాక్టరీ స్థానంలో రూ.520 కోట్ల రైల్వే వ్యాగన్ రిపేర్ షాప్ పేరుతో మోదీ తెలంగాణకు ఏదో గొప్ప మేలు చేసినట్లు చెప్పడం ఇక్కడి ప్రజల్ని అవమానించడమే. గుజరాత్‌కు రూ.20 వేల కోట్ల ఫ్యాక్టరీని తరలించుకుపోయారు. దేశ చరిత్రలోనే అత్యధిక నిరుద్యోగం సృష్టించిన విఫల ప్రధాని మోదీ. ప్రధానిలా అనర్గళంగా అబద్ధాలు చెప్పాలంటే చాలా ధైర్యం కావాలి. వ్యవసాయ నల్ల చట్టాలు తీసుకువచ్చి, 700 మంది రైతుల మరణాలకు కారణమైన మోదీ ఈరోజు వ్యవసాయ రంగం గురించి మాట్లాడడం దుర్మార్గం. మోదీ ప్రసంగం మొత్తం ఆత్మవంచన, పరనింద అన్న తీరుగా కొనసాగింది. తెలంగాణ విషయంలో మోదీ నిర్లక్ష్యాన్ని, వివక్షను రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. సరైన సమయంలో మోదీకి, బీజేపీకి గుణపాఠం చెప్పడం ఖాయం” అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.